Movies

రంగు గురించి బెంగ వద్దు

రంగు గురించి బెంగ వద్దు

‘‘సమాజంలో మనల్ని మన అందం చూసి కాదు.. మన ప్రతిభను చూసి గుర్తించాలి, గౌరవించాలి. అదే నేను నమ్ముతాను. అందుకే చర్మ సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడానికి ఇష్టపడను’’ అన్నారు అదితీ రావ్‌ హైదరీ. ఇలా అనడమే కాదు గతంలో కొన్నిసార్లు అలాంటి ఆఫర్స్‌ను తిరస్కరించారట కూడా. ఓ సంఘటన గురించి అదితీ రావ్‌ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌ ప్రారంభంలో ఓ సౌందర్య ఉత్పత్తిని ప్రమోట్‌ చేసే అవకాశమొచ్చింది. నేను తిరస్కరించాను.నిజానికి ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన నాకు ఆ యాడ్‌ కెరీర్‌కి ఉపయోగపడుతుంది. అయినా అందం ప్రాధాన్యం అని చెబుతూ నటించడం నాకిష్టం లేదు. కానీ ఆ ఉత్పత్తిదారులు నన్ను ఒప్పించాలని చాలా ప్రయత్నించారు. ఏం చేయాలో తెలీక ఇలాంటివి చేస్తే మా అమ్మమ్మకు నచ్చదని చెప్పాను. రంగు, కులం, మతం వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చి, మనుషులను అంచనా వేయడం అలవాటు లేని కుటుంబం నుంచి వచ్చినదాన్ని నేను.ఇక తెల్లగా మారాలనుకుంటున్నారా? అనే యాడ్‌లో ఎందుకు నటిస్తాను? కేవలం తెల్లగా ఉన్నవాళ్లనే ఈ సమాజం గౌరవిస్తుంది, బాగా చూస్తుందనే ఆలోచనతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. తెల్లగా మారడానికి ఏం చేయాలా? అని ఆలోచిస్తారు. అలాంటివాళ్లకు నేను చెప్పేదేంటంటే.. రంగు ముఖ్యం కాదు.. టాలెంట్‌ ముఖ్యం. అందం కొలమానం కాకూడదు. అది కేవలం జీన్స్‌ మాత్రమే’’ అన్నారు.