NRI-NRT

బెంజిమిన్ దొరగారి వికృత కక్కుర్తి

బెంజిమిన్ దొరగారి వికృత కక్కుర్తి

అమెరికా పర్యటనకు వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యవహరించే తీరుపై అమెరికన్‌ మీడియాలో ఓ కథనం వెలువడింది. ఆయన పర్యటించిన ప్రతిసారీ బ్యాగుల కొద్దీ ఉతకని దుస్తులు తీసుకొస్తారన్నది ఆ కథనం సారాంశం. ఆ దుస్తులను అమెరికా ప్రభుత్వంలోని పనివారితో ఉతికించుకునేందుకు ఇలా చేస్తుంటారని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. దీంతో నెతన్యాహు శైలి చర్చనీయాంశమైంది. జెంజమిన్ అమెరికాలో అధికారికంగా పర్యటించిన ప్రతిసారీ వైట్‌హౌస్‌కు చెందిన అధికారిక అతిథి భవనమైన బ్లెయిర్ హౌస్‌లో సేదతీరుతుంటారు. ఆ క్రమంలో ఆయన వెంట బ్యాగులు, సూటుకేసుల కొద్దీ విడిచిన దుస్తులను తీసుకువస్తారు. వాటిని అక్కడి సిబ్బంది ఉచితంగా శుభ్రం చేసిపెడతారు. తన అతిథులందరికీ బ్లెయిర్ హౌస్‌ ఉచితంగా లాండ్రీ సేవలు అందిస్తుండంతో ఆయన ఈ సౌలభ్యాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. చాలామంది విదేశీ నేతలు ఈ సేవలను సహేతుకమైన రీతిలోనే వినియోగించుకున్నప్పటికీ.. ఒక్క నెతన్యాహు మాత్రమే సూట్‌కేసుల కొద్దీ దుస్తులను తీసుకొస్తారని అధికారులు వెల్లడించినట్లు సదరు కథనంలో పేర్కొంది. అనేకమార్లు ఆయన తీరు ఇలాగే ఉండటంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదేనని గుర్తించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలను వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కొట్టిపారేసింది.