* దేశీయ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్తల ఆందోళన ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపైనా పడింది. దేశీయంగానూ కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదం వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ షేర్లు… హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. మిగిలిన రంగాల షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. వరుస లాభాలను చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లూ నష్టాలను చవిచూశాయి. దీంతో వరుసగా ఆరో రోజూ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 11వేల మార్కు దిగువకు చేరింది. ఆగస్టు 4 తర్వాత నిఫ్టీ 11వేల దిగువకు చేరడం గమనార్హం.
* ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హావెల్స్‌కు చెందిన లాయిడ్ రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇది వరకు ఎయిర్ కండీషన్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థ.. రిఫ్రిజిరేటర్ల తయారీ ద్వారా పూర్తిస్థాయి వినియోగ వస్తువుల విక్రయ సంస్థగా మారింది. డైరెక్ట్ కూల్, ఫ్రాస్ట్ ఫ్రీ, సైడ్ బై సైడ్ విభాగంలో మొత్తం 25 మోడళ్లను కంపెనీ తీసుకొచ్చింది. మరో 25 రిఫ్రిజిరేటర్లను ఈ ఏడాది దీపావళికల్లా అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
* దేశీయంగా బంగారం ధర వరుసగా నాలుగో రోజూ తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.485 తగ్గి రూ.50,418కి చేరింది. గత సెషన్‌లో 10 గ్రాముల పుత్తడి రూ.50,903గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడం ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.
* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో మరింత మంది చందాదారులు కొత్తగా చేరారు. జూన్ నెలలో కొత్తగా 45 లక్షల మంది చందాదారులు ఆ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ సంస్థ 39.72 కోట్ల సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ చందాదారులను కోల్పోయాయి. ఈ మేరకు తాజాగా టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గురువారం గణాంకాలను విడుదల చేసింది.
* వాహన పరిశ్రమలో విక్రయాలు పుంజుకోడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని టాటా మోటార్స్ అంటోంది. బుధవారం జరిగిన ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో పాల్గొన్న టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) గుంటెర్ బషెక్ మాట్లాడుతూ ‘కరోనా నేపథ్యంలో ఉత్పత్తిని తిరిగి యధాస్థితికి తీసుకురావడానికి, వినియోగదార్లు వాహనాలు సులువుగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలంలో అమ్మకాలు కొనసాగడానికి పన్ను కోతల రూపంలో ‘గిరాకీ ఉద్దీపన’ అందించాల’ని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కొన్ని విభాగాల్లో పరిశ్రమ పుంజుకుంటున్నప్పటికీ.. దీర్ఘకాలంలో ఆ గిరాకీ కొనసాగుతుందో లేదో తెలియదు. ఎందుకంటే కొత్త ఉద్గార ప్రమాణాలు, అధిక పన్నుల కారణంగా భారత్‌లో వాహన ధరలు ప్రియమయ్యాయ’ని ఆయన గుర్తు చేశారు. భారత్ ఒక అంతర్జాతీయ వాహన తయారీ కేంద్రంగా మారాలంటే.. మార్కెట్ పరిమాణం, తక్కువ కార్మిక వ్యయాలు కొనసాగుతూనే.. దీర్ఘకాలంలో స్థిరమైన విధానాలు అవసరమని బషెక్ వివరించారు.