ఇంటర్‌లో 30% సిలబస్‌ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏయే పాఠాలను తొలగించవచ్చో నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే, ఇంటర్‌బోర్డు అధికారులు వాటిని పరిశీలించకుండా కొన్ని పాఠాలను తొలగించడం వివాదాస్పదంగా మారింది. దీంతో చివరకు బోర్డు వెనక్కి తగ్గింది. వాటిని యథాతథంగా ఉంచుతామని ప్రకటించింది. సిలబస్‌ను తగ్గించిన దృష్ట్యా సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాలను మంగళవారం రాత్రి బోర్డు విడుదల చేసింది. మహనీయులు, జాతీయవీరులు, సామాజిక సంస్కర్తలతోపాటు స.హ.చట్టం, పౌరసత్వం తదితర పాఠాలను తొలగించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చరిత్ర సబ్జెక్టులోని డాక్టర్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, పెరియార్ రామస్వామి, నారాయణగురు తదితరుల జీవితచరిత్రపై ఉన్న పాఠాలను తొలగించడం వివాదాస్పదంగా మారింది. ద్వితీయ సంవత్సరం ఆర్థికశాస్త్రంలో జీఎస్‌టీపై పాఠం మొత్తాన్ని పక్కన పెట్టేశారు. ప్రథమ ఇంటర్ పౌరశాస్త్రంలో పౌరసత్వం పాఠాలనూ తొలగించారు. ఫలితంగా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమస్య తీవ్రతను గుర్తించిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ఆ పాఠాలను తొలగించే ప్రశ్నే లేదని, యథాతథంగా ఉంచుతామని ప్రకటించారు. జాతీయ వీరులు, సామాజిక సంస్కర్తలు, ప్రముఖ వ్యక్తులపై పాఠాలను తొలగించబోమంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తరవాతే సబ్జెక్టుల వారీగా పాఠాలను తొలగించాలని బోర్డు భావిస్తోంది.
* ప్రాధాన్యంగల పాఠాలను తొలగించడాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు బోర్డు కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.
* ప్రాధాన్యమున్న పాఠాలను తొలగింపు విషయంలో బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదరన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
* మహనీయుల చరిత్రను సిలబస్ నుంచి తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని పీడీఎస్‌యూ ఒక ప్రకటనలో ఆరోపించింది.
మహనీయుల చరిత్ర యథాతథం
Related tags :