* వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులపై ప్రయోగాలు జరుపుతుండగా.. తాజాగా ‘హ్యూమన్ ఛాలెంజ్’ ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా వ్యాక్సిన్ సమర్థతను కచ్చితంగా పరీక్షించే వీలుంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్ ప్రయోగాలకు, తాజా విధానం మరో ముందడుగు కానుంది.
* రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు కొన్ని రోజులు ఎక్కువగానూ మరి కొన్నిరోజులు తక్కువగా చేస్తున్నారని అభిప్రాయపడింది. రోజుకు 40వేల పరీక్షలు చేస్తామని ప్రభుత్వం గతంలో హైకోర్టుకు తెలిపిందని.. దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా పరీక్షలు, చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు తదితర అంశాలపై దాఖలైన 24 వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
* కరోనా కట్టడికి భౌతికదూరం పాటించటంతో పాటు మాస్కు ధరించటం కూడా అలవాటుగా మారిపోయింది. ఈ మహమ్మారి నివారణకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సినాసిటి యూనివర్సిటీ టీకా వచ్చే వరకూ ప్రజలు తాము వాడే మాస్కులు ఎటువంటివైతే మరింత సురక్షితంగా ఉంటారు. ఏయే రసాయన ధర్మాలు ఉన్న మాస్కులు ధరిస్తే వైరస్‌ను కట్టడి చేయొచ్చే అనే విషయాలపై అధ్యయనం చేసింది.
* ఏపీలో తగ్గినట్లే కనిపించిన కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 76,000 పరీక్షలు నిర్వహించగా 7,855 మంది కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 6,54,385కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 8,807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 52 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం 6, గుంటూరు 6, కృష్ణా 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 3, కర్నూలు 3, పశ్చిమగోదావరి 3, విజయనగరం 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,558కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 53,78,367 నమూనాలను పరీక్షించారు.