భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు.
**మొత్తం 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ముగ్గురు జాయింట్ జనరల్ సెక్రటరీలుగా జేపీ నడ్డా నియమించారు. జాతీయ కార్యదర్శులుగా 13 మందికి అవకాశం ఇచ్చారు. జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మందికి స్థానం కల్పించారు. వీటితో పాటు భాజపాకు చెందిన ఇతర విభాగాలకు అధ్యక్షులను, ఇన్‌ఛార్జులను నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
*వీరికి దక్కని చోటు
తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో నలుగురు తెలుగువాళ్లకు చోటు దక్కింది. అయితే గతంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మురళీధర్ రావు, రాంమాధవ్‌ను పేర్లను ప్రస్తుత జాబితా నుంచి తప్పించారు. కొన్ని రోజులుగా వీరికి ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అందుకు తగినట్లే తాజా మార్పులు సంతరించుకున్నాయి. మరోవైపు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నర్సింహారావు పేరునూ అధికార ప్రతినిధుల జాబితా నుంచి తప్పించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా జీవీఎల్ ఉన్నారు.
*మంత్రివర్గంలోనూ మార్పులు?
భాజపా తన జాతీయ నూతన కార్యవర్గంలో పలువురి పేర్లు తప్పించి కొత్త వారికి స్థానం కల్పించింది. రాష్ట్రాల వారీగా వ్యూహాత్మకంగా ఈ పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ పరంగా మార్పులు చేసిన భాజపా.. మంత్రివర్గంలోనూ మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ పదవుల నుంచి తప్పించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి
Related tags :