Health

30ఏళ్లకే ముగిసిపోతున్న కుర్రకారు జీవితాలు

30 Year Olds Dying Due To Heart Attacks

30 ఏళ్లకే నిట్టనిలువునా కూలిపోతున్నారు

గుండెజబ్బు అంటే ముసలివాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అని ఒకప్పుడు అనుకునేవాళ్లు! ఇప్పుడు ఆ తారతమ్యమేమీ లేదు.  ఇరవై, ముప్పై ఏళ్లకే నిట్టనిలువునాకూలిపోతున్నవారిని.. గుండెజబ్బుల సమస్యలతో బతుకీడ్చే వాళ్లనూ చూస్తూనే ఉన్నాం! మారుతున్న జీవనశైలి అనండి.. తినే తిండిలో తేడాలనండి.. ఇంకేదైనా కారణం చెప్పండి. ఏటా కోటీ డెభ్బై తొమ్మిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నది మాత్రం వాస్తవం.  అందుకే ఈ సమస్యపై అవగాహన మరింతపెంచేందుకు, తద్వారా ప్రాణాలను కాపాడేందుకు.. ఈ నెల 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తున్నారు! 

గుండెజబ్బులపై సామాన్యుల్లో అవగాహన మరింత పెంచే లక్ష్యంతో వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ , ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999 నుంచి ఈ వరల్డ్‌ హార్ట్‌ డేను నిర్వహించడం మొదలుపెట్టాయి. అప్పట్లో వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆంటోనీ బేస్‌ డి లూనా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ వార్షిక వేడుక. ఇప్పటివరకు సుమారు 100 దేశాల్లో ఏటా సెప్టెంబర్‌ 29ని వరల్డ్‌ హార్ట్‌ డేగా జరుపుకుంటున్నారు. 2025 నాటికల్లా ప్రపంచం మొత్తమ్మీద గుండెజబ్బులతోపాటు ఐదు అసాంక్రమిక వ్యాధుల ద్వారా జరుగుతున్న ప్రాణనష్టాన్ని కనీసం 25 శాతం తగ్గించాలన్న ప్రపంచ నాయకుల సంకల్పం కూడా ఈ వేడుకల ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఎందుకంటే అసాంక్రమిక వ్యాధుల ద్వారా సంభవిస్తున్న మరణాల్లో సగం గుండె జబ్బుల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి. గుండెపోటు, గుండెజబ్బులకు కారణాలు? నివారించేందుకు ఉన్న మార్గాలు వంటి అంశాలపై ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గుండె సమస్యలతో ఏటా సంభవిస్తున్న 1.79 కోట్ల మరణాల్లో కనీసం 80 శాతం వాటిని నివారించే అవకాశం ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

కారణాలు ఎన్నో…
గుండెజబ్బులు, గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. కొందరికి పుట్టుకతోనే ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. తగిన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలే చాలామందిలో గుండెజబ్బు లేదా పోటు వచ్చేందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణాల్లో ఎన్ని మనకు అన్వయిస్తాయో… సమస్య మన దరి చేరేందుకు అంతే స్థాయిలో అవకాశాలు పెరుగుతాయన్నమాట. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, వేళాపాళా లేకుండా తినడం, ఇతర అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొవ్వులు పెరిగి ధమనుల్లో గార లాంటి పదార్థం పేరుకుపోయి గుండెబ్బులు లేదా పోటుకు దారి తీస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. ధమనుల్లో గార పేరుకుపోవడం శరీరంలోని ఏ భాగంలోనైనా జరగవచ్చు. గుండె ధమనుల్లో పేరుకుపోతే కరోనరీ ఆర్టరీ డిసీస్‌ అని పిలుస్తారు. కాళ్ల ప్రాంతంలో సంభవిస్తే పెరిఫరీ ఆర్టీరియల్‌ డిసీజ్‌ అని పిలుస్తారు.