ప్రేమించి పెళ్లిచేసుకుని హత్యకు గురైన హేమంత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసులో హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గొంతుకు తాడు బిగించడం వల్లే హేమంత్ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. మరోవైపు సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు హేమంత్ మొబైల్ ఫోన్ లభ్యం కాలేదు. పోలీసులు దానిని సేకరించే పనిలో పడ్డారు. తమకు ప్రాణహాని ఉందని చందానగర్ స్టేషన్‌లో జూన్ 15న ఫిర్యాదు చేశామని, పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదన్నారు అవంతి. అత్తవారింట్లో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన నిందితులకు కఠినశిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన భర్త హేమంత్ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని అని అవంతి తెలిపారు. ఈ కేసులో తనకు న్యాయం జరిగేలా ఆయన సాయం చేయాలని కోరారు.
నా భర్త జగన్ వీరాభిమాని…ఆయన కలగజేసుకోవాలి!
Related tags :