* బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె ఈ విషయాన్ని స్వయంగా శనివారం అర్ధరాత్రి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గత మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల హిమాలయాలకు వెళ్లినపుడు సామాజిక దూరం సహా.. కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా వైరస్ సోకింది అని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
* ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజు వ్యవధిలో 76,416 నమూనాలను పరీక్షించగా.. 6,923 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 6,75,674కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 7,796 మంది కరోనా నుంచి కోలుకోగా.. 45 మంది మృతిచెందారు.
* భారత్‌లో కరోనా తీవ్రత ఉద్ధృతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లో వైరస్ ఎక్కువగా వ్యాపించడానికి రెండు దేశాల ప్రయాణికులే మూలమని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా దుబాయ్, యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఐఐటీ-మండీ విశ్లేషణాత్మక అధ్యయనం పేర్కొంది. ట్రావెల్ మెడిసిన్ జర్నల్‌లో ఈ తాజా అధ్యయనం ప్రచురితమైంది.
* ఇంకా ప్రయోగదశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతరత్రా దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా దీన్ని ఆపడంలేదని నిపుణులు మండిపడుతున్నారు. ‘అత్యవసర వినియోగం’ పేరుతో ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. చైనాలో పలు సంస్థలు కరోనాకు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. అవన్నీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. సాధారణ వినియోగానికి ఇంకా అనుమతి రాలేదు. ముప్పు అధికంగా ఉన్నవారికి ‘అత్యవసర అనుమతి’ కింద ఆ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జూన్‌లో అనుమతినిచ్చింది. కంపెనీలు మాత్రం లక్షల మందికి టీకాలు ఇచ్చేస్తున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నైతిక, భద్రతాపరమైన ప్రశ్నలను ఉత్పన్నమవుతున్నాయి. చైనాలో ప్రఖ్యాత రచయిత కాన్ చాయ్ ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని ఒక వెబినార్‌లో ప్రస్తావించారు. ‘‘మొదటి విడత టీకాను తీసుకున్నాక నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. రెండో డోసు పొందాక మార్పులు కనిపించాయి. కారు నడుపుతున్నప్పుడు ఒళ్లు తిప్పినట్లు అనిపించింది. దీంతో కారు ఆపి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు. గత కొద్దినెలల్లో అత్యవసర వినియోగం కోసం నిర్దేశించిన సంఖ్య కన్నా చాలా ఎక్కువ మందికి ఈ టీకాలను ఇచ్చారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. టీకాల భద్రత, సమర్థతను నిర్ధరించేందుకు ఇంకా మానవ ప్రయోగాలు ప్రారంభం కాకముందే తమ ఉద్యోగులు, పరిశోధకులకు ఇవ్వడం ద్వారా చైనా కంపెనీలు కలకలం సృష్టించాయి. ఆ తర్వాత మొదటి రెండు దశల ప్రయోగాలు నిర్వహించాక ఇతరులకూ ఇవ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సినోఫార్మ్‌కు చెందిన ‘సీఎన్‌బీజీ’.. సుమారు 3.5 లక్షల మందికి ఈ టీకాను ఇచ్చింది. మరో సంస్థ సినోవ్యాక్.. తన ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చింది. చైనా సైన్యం, కానాసినో అనే ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను సైనిక సిబ్బందికి అత్యవసర వినియోగం కింద ఇవ్వడానికి ఆమోదం లభించింది. టెలికం దిగ్గజం హువావే, ప్రసార సంస్థ ఫీనిక్స్ టీవీ తదితర కంపెనీలూ తమ ఉద్యోగులకు సినోఫార్మ్ ద్వారా టీకాలు ఇప్పించేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ఈ చర్యలను చైనా అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించచిన ‘అత్యవసర వినియోగ’ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు.