“తానా ఆధ్వర్యంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు”
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి ఉత్సవాలు అంతర్జాలంలో ఘనంగా నిర్వహించ గా పలు దేశాలనుండి సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ “గాన గంధర్వులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆయన తానా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారని, బాలూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.”
సెప్టెంబర్ 21వ తేదీన గురజాడ అప్పారావు జయంతి అని అలాంటి మహాకవి తెలుగునేలపై పుట్టటం జాతికే గర్వకారణమన్నారు. గుర్రం జాషువా జయంతి ఉత్సవాలను ప్ర్రారంభిస్తూ .. గుర్రంజాషువా చిన్ననాటి నుంచి అంటరానితనం, పేదరికాన్ని చవి చూశారని, సామాజిక, ఆర్థిక అసమానతల పై అలుపెరుగని పోరాటం చేశారని, ఎక్కడ అవమానాలకు, అవహేళనకు గురి అయ్యారో, అక్కడే వెయ్యికి పైగా సత్కారాలు, సన్మానాలు, పద్మవిభూషణ్ పురస్కారాలు పొందారన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో గుర్రం జాషువాది ప్రత్యేక స్థానమని, అట్టడుగు వర్గాల గాధలకు పట్టం కట్టి, గౌరవం కలానికా, కులానికా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ, ఒక ప్రక్క దుర్భర దారిద్ర్యం, వర్ణ వ్యవస్థ, కులమత బేధాలు ఎదుర్కుంటూ మరో ప్రక్క గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, క్రొత్త లోకం వంటి అద్భుత కావ్యాలను రచించిన మహాకవి జాషువా సాహిత్యం అజరామరం అని అన్నారు”.
వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ “తెలుగు సాహిత్య చరిత్రలో జాషువాది ప్రత్యేకమైన స్థానం” అని కొనియాడారు.
ప్రఖ్యాత గాయకులు ప్రవీణ్ కొప్పోలు జాషువా పద్యాలను మధురంగా పాడి వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ “జాషువా కులమతాలను దాటి విశ్వనరుడు గా తనను తాను పరిచయం చేసుకున్నాడని, ఆయనంత మానవతావాది, నవతావాది మరొకరు ఉండరని” అన్నారు. డా. జి. సమరం “జాషువా తో తమకున్న బంధుత్వాన్ని, వ్యక్తిగత అనుబంధాన్ని నెమరువేసుకోవడమే కాక, జాషువా కవితా వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు”
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ “జాషువా సాహిత్యానికి తాను సేవకుడినని, ప్రచారకుడినని, జాషువా వీరాభిమానిని అని, జాషువా కవిత్వం పై మరింత చర్చ జరగాలని, ప్రచారం జరగాలని ఆ దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం లో తెలుగు శాఖాచార్యులు ఎండ్లూరి సుధాకర్ జాషువా “గబ్బిలం” కావ్యం పై సమగ్రమైన విశ్లేషణా పూర్వక ప్రసంగం చేశారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం లో తెలుగు శాఖాధిపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి “ఫిరదౌసి” కావ్యం పై వివరణాత్మక ప్రసంగం చేశారు.
ఖమ్మం జిల్లా “గుర్రం జాషువా సాహిత్య వేదిక” అధ్యక్షులు మువ్వా శ్రీనివాస్ జాషువా కవిత్వం ప్రాసంగికత మీద అద్భుత విశ్లేషణ చేసారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తన మలి పలుకులలో – ప్రతి నెలా ఆఖరి ఆదివారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటకు) తప్పనిసరిగా ఒక సాహిత్య కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమం లో పాల్గొన్న అతిధులకు, ప్రపంచ వ్యాప్తం గా వీక్షించిన సాహితీ ప్రియులకు, సభ విజయవంతంగావడానికి తోడ్పడిన బైట్ గ్రాఫ్స్ అధినేత ప్రశాంత్ కొల్లిపరకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులు చిల్లర శ్రీధర్ కు, తానా కార్యవర్గ సభ్యుడు సుమంత్ రామిశెట్టి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి వివరాలకు www.tana.org ను సందర్సించవచ్చు.