*కరోనా కాలంలో రోగ నిరోధకశక్తి కోసం వినియోగం
*రోజుకు 60 వేలకు పైగా తెగుతున్న గొర్రెలు, మేకలు
*ఆరు నెలల్లోనే 6.14 లక్షల టన్నుల మాంసం విక్రయం
*2019-20లో 9.65 లక్షల టన్నుల వినియోగం
*పెరిగిన డిమాండ్.. కిలోకు రూ.750 నుంచి 900
*తెలంగాణలో 90ు మందికి పైగా మాంసాహారులే!
****** ముద్ద దిగాలంటే.. ముక్క ఉండాల్సిందే! ప్రస్తుత కరోనా విపత్తు కాలంలో రాష్ట్రంలో ప్రజలు జోరుగా మటన్ తింటున్నారు. శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి మాంసం ఎంత ఎక్కువ తింటే అంత మంచిదని వైద్యులు సూచిస్తుండటంతో మాంసం ప్రియులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పటికే మాంసం వినియోగంలో దేశంలోనే అగ్రభాగంలో ఉన్న తెలంగాణలో ఇప్పుడు మరింత పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రాష్ట్రంలో 9.65 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాంసం విక్రయాలు జరగగా.. ఈ ఏడాది గడచిన ఆరు నెలల వ్యవధిలోనే 6.14 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్ మొదలు కాగా.. అన్ని వర్తక, వాణిజ్య సంస్థలను మూసేశారు. యావత్ వ్యవస్థలన్నీ స్తంభించిపోయినా.. మెడికల్ షాపులతోపాటు మాసం విక్రయాలకు మాత్రం ప్రభుత్వం అనుమతినిచ్చింది.
*తొలి మూడు నెలల్లో కోడి మాంసం తింటే కరోనా వస్తుందని దుష్ప్రచారం జరగడంతో గొర్రెలు- మేకల మాంసానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో వ్యాపారులు మాంసం ధరను కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా పెంచారు. అయినప్పటికీ వినియోగదారులు మటన్ కొనుగోలుకు వెనుకాడకపోవడంతో వినియోగం రోజురోజుకూ పెరిగింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు లెక్కలు తీస్తే… రాష్ట్రవ్యాప్తంగా 6.14 లక్షల మెట్రిక్ టన్నుల మటన్ వినియోగం జరిగింది. ఆరు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున గొర్రెలు-మేకల మాంసం వినియోగం జరగడం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. 2017-18లో ఏడాదంతా కలిపి ఎంత మాంసం వినియోగం జరిగిందో.. ఈ ఆరు నెలల్లోనే అంత మాంసాన్ని వినియోగించారు. అంతేకాదు.. 2019- 20లో గొర్రెలు, మేకలు కలిపి రోజుకు 50 వేలు తెగగా… ఇప్పు డు రోజుకు 60 వేలు తెగుతున్నాయి. ఇందులో 25 శాతానికి మించి హైదరాబాద్ నగరంలోనే తెగుతుండటం గమనార్హం.
*గొర్రెల పెంపకంలో ఇప్పటికే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టిన పశుగణన-2019 నివేదికను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు ఉన్నట్లు తెలిపింది. అయితే తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య 2.42 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రకటించింది. కాగా, మాంసం ఉత్పత్తిలో 9.3 శాతంతో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. అయితే మాంసం వినియోగంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 90 శాతం మందికి పైగా మాంసాహారులే ఉండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా మాంసం వినియోగం సగటు 61.86 శాతం ఉంది. కాగా, దేశవ్యాప్త వినియోగంలో 60 శాతం మాంసాన్ని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలే తింటున్నట్లు జాతీయ మాంస పరిశోధన సంస్థ (ఎన్‌ఆర్‌సీఎం) నివేదికలు చెబుతున్నాయి.
*వాస్తవానికి ఒక వ్యక్తి ఏడాదికి 12 కిలోల మాంసం (నెలకు కిలో చొప్పున) తినాలని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సూచిస్తోంది. దేశవ్యాప్తంగా తలసరి మాంసం వినియోగం 2 కిలోల 900 గ్రాముల నుంచి 3 కిలోల 260 గ్రాముల మధ్య ఉండగా… తెలంగాణలో మాత్రం 9 కిలోల 200 గ్రాముల వరకు ఉన్నట్లు గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఆరు నెలల్లో ఈ సగటు మరింత పెరిగింది. మాంసం తినటంలో తెలగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
*దసరా, బక్రీద్‌కు హైదరాబాద్‌లో 500 టన్నుల మాంసం
దసరా, బక్రీద్ పండుగల సమయంలో మాంసం వినియోగం రికార్డు స్థాయిలో ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ రెండు రోజుల్లో దాదాపు 500 మెట్రిక్ టన్నుల యాట మాంసం వినియోగం అవుతుంది. ఒక్కో పండుగ రోజు సగటున 30 వేల యాటలు హైదరాబాద్‌లో తెగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ చికెన్ బిర్యానీతోపాటు మటన్ బిర్యానీ కూడా ఫేమస్ కావటంతో… వినియోగం కూడా ఎక్కువ గా ఉంటోంది. బోనాలు- పోచమ్మల పండుగ సమయంలో కూడా లెక్కలకు మించి యాటలు తెగుతుంటాయి. మటన్ ఉత్పత్తి, డిమాండ్‌తోపాటు తలసరి లభ్యత కూడా పెరుగుతూ వస్తోం ది. 2014-15లో తలసరి లభ్యత 12.92 కిలోలు ఉండగా… ఇప్పుడు 18.75 కిలోలకు పెరిగింది. మన దేశంతో పోలిస్తే అమెరికా, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాల్లో మాంసం తలసరి వినియోగం ఎక్కువగా ఉండటం గమనార్హం.
*ఆకాశాన్నంటుతున్న ధరలు
మటన్ ధరలు రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టి రాష్ట్రంలోని 7.62 లక్షల గొల్ల, కురుమ కుటుంబాలకుగాను.. 3.67 లక్షల కుటుంబాలకు 76.93 లక్షల గొర్రెపిల్లలను పంపిణీ చేసింది. గొర్రెలు, మేకల సంఖ్య 2.42 కోట్లు ఉన్నప్పటికీ… దిగుమతులేమీ తగ్గలేదు. జియాగూడ, బోయిగూడ, చెంగిచర్ల, అంబర్‌పేట్ మార్కెట్లకు రోజుకు 5 వేల నుంచి 6 వేల గొర్రెలు, మేకలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. చలి కాలంలో మాత్రం 3 వేల నుంచి 3,500 దిగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల్లో గొర్రెలు, మేకలు హైదరాబాద్‌కు వస్తున్నాయి.
అయినప్పటికీ మటన్ ధరలు తగ్గడంలేదు. కిలోకు రూ.750 నుంచి రూ.900 మధ్య విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల తాజా పొట్టేలు మాంసం పేరుతో కిలోకు రూ.1000 పైగా అమ్ముతున్నారు. ఇక హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా డోర్ డెలివరీ చేసే సంస్థలైతే ఏకంగా కిలో మటన్‌కు రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిలో మటన్ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండటం గమనార్హం.
రోజుకు 60వేల మేకలు తింటున్న తెలంగాణా ప్రజలు
Related tags :