Business

టాటా వాల్‌మార్ట్ చెట్టాపట్టాల్-వాణిజ్యం

టాటా వాల్‌మార్ట్ చెట్టాపట్టాల్-వాణిజ్యం

* అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని ఆరోపించింది. సెప్టెంబరు 10 నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమ ఖాతాలన్నీ స్తంభింపజేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ కార్యకలాపాల్ని బలవంతంగా నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంపై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వం కావాలనే తమని నిరంతరంగా వెంటాడుతోందని ఆరోపించింది.

* దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌తో చేతులు కలిపేందుకు ప్రముఖ అంతర్జాతీయ రిటైల్‌ కంపెనీ వాల్‌మార్ట్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌ ప్రారంభించబోతున్న ఓ సూపర్‌ యాప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో జాబితాలో తన సత్తా చాటారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదో ఏట కూడా ప్రథమ స్థానంలో నిలిచారు. ఆగస్టు 31తో ముగిసిన 12 నెలల కాలంలో ఆయన సంపద 73శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. ఈ జాబితాలో రూ.1000 కోట్లకు మించి సంపద ఉన్న 828మందిని పరిశీలించారు. ఇక రెండో స్థానంలో హిందుజా సోదరులు ఉండగా.. మూడో స్థానంలో శివ్‌నాడార్‌ కుటుంబం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అజీమ్‌ ప్రేమ్‌జీ, సైరస్‌ పూనావాలా, రాధాకృష్ణ దమాని, ఉదయ్‌ కొటాక్‌, దిలీప్‌ సంఘ్వీ, సైరస్‌ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ ఉన్నారు. తొలి పదిమందిలో ఏడుగురు మహారాష్ట్రకు చెందినవారే కావడం విశేషం. గ్రాన్యూల్స్‌ ఇండియాకు చెందిన చిగురుపాటి క్రిష్ణప్రసాద్‌ ఆస్తి ఈ ఏడాది 218శాతం పెరిగి రూ.4,500 కోట్లకు చేరినట్లు ఈ జాబితా పేర్కొంది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా ఓయె రూమ్స్‌ వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ నిలిచారు.ఆయన సంపద రూ.5,400 కోట్లుగా లెక్కగట్టారు. ఇక అత్యధిక వయస్సు ఉన్న సంపన్నుడిగా ధర్మ్‌పాల్‌ గులాటీ ఎంపికయ్యారు. అత్యంత సంపన్న మహిళగా గోద్రెజ్‌కు చెందిన స్మిత వి క్రిష్ణ గుర్తింపు పొందారు.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 102 పాయింట్లు ఎగబాకి 38,083 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 11,259 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.57 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు లాభపడడం.. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడం సూచీలకు దన్నుగా నిలిచింది. అలాగే దేశీయంగానూ ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టవచ్చునన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచాయి.

* రాబోయే పండగల కాలంలో ఉత్పత్తుల డెలివరీని మరింత వేగంగా చేసేందుకు అమెజాన్‌ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్థానిక కిరాణా దుకాణాలను తమ విక్రేతల జాబితాలోకి తీసుకుంటోంది. దీనివల్ల కొత్తగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, కొనుగోలుదార్లకు వేగంగా ప్యాకేజీలను డెలివరీ చేసేందుకు వీలవుతుందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (లాస్ట్‌ మైల్‌ ఆపరేషన్స్‌) ప్రకాశ్‌ రోచ్లాని తెలిపారు. తమ ‘ఐ హ్యావ్‌ స్పేస్‌’ను సైతం బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. 350కి పైగా నగరాల్లో దాదాపు 28 వేలకు పైగా కిరాణా దుకాణాలకు ఇందులో చోటు కల్పించినట్లు వెల్లడించారు. తమ స్టోర్లకు 2-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినియోగదారులకు నేరుగా వారే ఉత్పత్తులను డెలివరీ చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ముంబయిలాంటి నగరాల్లోని గృహ సముదాయాల్లో వర్చువల్‌ పికప్‌ పాయింట్లతో సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

* రూ.8,100 కోట్ల విలువైన బ్యాంకు మోసం కేసులో గుజరాత్‌ ఔషధ సంస్థ స్టెర్లింగ్‌ బయోటెక్‌కు చెందిన నలుగురు డైరెక్టర్లను పరారైన ఆర్థిక నేరగాళ్లుగా దిల్లీ కోర్టు ప్రకటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేంధర్‌ రాణా ఈ ఆదేశాలను జారీ చేశారు. ‘పిటిషనర్‌ అందించిన ఆధారాలు సంతృప్తికరంగా ఉండటంతో.. నితిన్‌ జయంతిలాల్‌ సండేసర, చేతన్‌ జయంతిలాల్‌ సండేసర, దీప్తి చేతన్‌ జయంతిలాల్‌ సండేసర, హితేశ్‌ కమార్‌ నరేంద్రభాయ్‌ పటేల్‌ను పరారైన నేరగాళ్లుగా ప్రకటించామ’ని న్యాయమూర్తి తెలిపారు.