నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుంటుంటే, కేంద్రం నిష్క్రియాపరత్వం, అలసత్వంతో వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. జల వివాదాలపై ఆరోతేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ]్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమగ్ర వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని, మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, నిజాలను యావత్ దేశానికి ఈ సమావేశంలో తేటతెల్లం చేయాలన్నారు. అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్లు అనిపిస్తున్నారు కానీ కేంద్రం ఏమీ చేయడం లేదన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలని, తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని, తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఏపీపై కేసీఆర్ ధ్వజం
Related tags :