విదేశాల్లో ఉన్నాం.. ఏం చేసినా చెల్లుతుందిలే అని విర్రవీగే కొందరు ప్రవాస అల్లుళ్లకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం చెక్ పెడుతోంది. పాస్‌పోర్టులు రద్దు చేయిస్తుండటంతో గత్యంతరం లేక వాళ్లు కాళ్ల బేరానికి వస్తున్నారు. ఇప్పటికే ఏడుగురి పాస్‌పోర్టులు రద్దు చేయడంతో కేసులు ఎదుర్కొంటున్న మిగతా నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తమ అల్లుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారని చెప్పుకోవడం హోదాకు చిహ్నంగా మారింది. అయితే, ఈ క్రమంలో అమ్మాయిల కుటుంబసభ్యులు బోల్తా పడుతున్నారు. ఎవరో మధ్యవర్తి ద్వారా ప్రతిపాదన రాగానే విదేశీ సంబంధం అనే మోజులో వారి మాటలను నమ్మి హడావుడిగా పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత కొందరికి అసలు కష్టాలు మొదలవుతున్నాయి పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లగానే అల్లుళ్లు తమ విశ్వరూపం చూపుతున్నారు. రకరకాల కారణాలతో వేధించడం, భౌతికంగా హింసించడం చేస్తున్నారు. ఇంకా కొందరైతే అప్పటికే పెళ్లై.. కేవలం కట్నం కోసం మరో వివాహం చేసుకుంటున్న ఉదంతాలూ ఉంటున్నాయి. వేధింపులకు పాల్పడుతున్న ప్రవాస అల్లుళ్లపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసినా.. ప్రయోజనం ఉండటంలేదు. విదేశాలతో ముడివడిన అంశం కాబట్టి గతంలో ఇలాంటి కేసులను సీఐడీకి బదిలీ చేసేవారు. ఇక్కడ కేసు నమోదైతే ఇంటర్‌పోల్ సహకారంతో సీఐడీ అధికారులు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేవారు. అయితే, వరకట్న వేధింపులు మన దగ్గర నేరం. కానీ, చాలా దేశాల్లో వరకట్నం అనే అంశమే ఉండదు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు రెడ్‌కార్నర్ నోటీసు ఇవ్వడం సాధ్యంకాదని ఇంటర్‌పోల్ తేల్చేసింది. దాంతో విదేశాల్లో ఉండి వేధింపులకు పాల్పడుతున్న అల్లుళ్లకు అడ్డే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కేసుల పరిష్కారంపై రాష్ట్ర మహిళా భద్రత విభాగం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు తెప్పించుకొని చట్టం పరిధిలో కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఎన్నారై సెల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ ఈ సెల్‌కు 119 ఫిర్యాదులు రాగా వాటిలో 76 కేసులలో దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేశారు. 43 కేసులలో దర్యాప్తు కొనసాగుతోంది. న్యాయప్రక్రియ ద్వారానే మొత్తం ఏడుగురు నిందితుల పాస్‌పోర్టులు రద్దు చేయించారు. ఈ ప్రయోగం మంచి ఫలితం ఇస్తోందని మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు.
జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ యువతికి ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడితో 2013లో వివాహం జరిగింది. 2014లో ఆ యువతి తన అత్తగారితో కలిసి స్వదేశానికి వచ్చింది. కొద్దిరోజుల్లోనే అత్తగారు ఎవరికీ తెలియకుండా ఫ్రాన్స్ వెళ్లిపోయారు. అప్పటి నుంచీ సదరు యువతి తన భర్తతో మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా సమాధానం రాలేదు. భర్త వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన యువతిది మరో వ్యథ. పెళ్లిచేసుకొని అమెరికా వెళ్లినప్పటి నుంచీ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. విపరీతంగా హింసించడంతో ఎలాగోలా తిరిగి వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.