Devotional

సింఘాల్ బదిలీ…ధర్మారెడ్డికి బాధ్యతలు

TTD EO Anil Kumar Singhal Transferred - AV Dharma Reddy Is Now Incharge

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఇంఛార్జి ఈవోగా నియమించింది. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈవోగా రాకముందు ఆయన దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. 2017 మేలో ఆయన తితిదే ఈవోగా వచ్చారు. 2019లో రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత ప్రభుత్వం మరో ఏడాదిపాటు ఆయన డిప్యూటేషన్‌ను పొడిగించింది. గత కొంత కాలంగా ఆయన బదిలీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తనదైన ముద్ర వేశారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించముందు నుంచీ ఆయన శ్రీవారికి భక్తుడు. ఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందే ఆయన కాలినడకన నేరుగా దివ్యదర్శనం లైనులోనే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నుంచి సైతం సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి చూడటం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి టైంస్లాట్‌ విధానాన్ని తీసుకొచ్చారు. అనేక ఏళ్ల తర్వాత సుదర్ఘీకాలం తితిదే ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు నిర్వహించారు. 2017 మే 6వ తేదీన ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఇప్పటికి మూడేళ్ల నాలుగు నెలలపాటు ఈవోగా ఉన్నారు.