WorldWonders

ఇదొక పెద్ద బూతు చిలుక

Linconlsnshire UK Zoo Parrots Cursing Visitors

భూమిపై ఉన్న జీవరాశుల్లో మనుషులకు మాత్రమే మాట్లాడే అదృష్టం లభించింది. మనుషుల తర్వాత చిలుకలే శిక్షణ ఇస్తే మాట్లాడగలవు. అవి మాట్లాడితే భలే ఉంటుంది. అందుకే ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడితే చిలుక పలుకులు పలుకుతున్నారని అంటుంటారు. అయితే ఆ చిలుకలే యూకేలోని ఓ జూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశాయి. జూ సందర్శకులను బూతులు తిడుతూ చిలుకలు తెగ అల్లరి చేశాయట. దీంతో జూ నుంచి వాటిని తొలగించాల్సి వచ్చింది. ఆగస్టు నెలలో యూకేలోని లింకన్‌షైర్‌ వైల్డ్‌లైఫ్‌ పార్క్‌ నిర్వాహకులు వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన ఐదు చిలుకలను దత్తత తీసుకున్నారు. వాటి ఆరోగ్య భద్రత దృష్ట్యా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఈ చిలుకలు బూతులు మాట్లాడటం జూ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఐదు చిలుకల్లో ఒక చిలుక ఎక్కడ నేర్చుకుందో తెలియదు గానీ, అది మిగతా చిలుకలకు కూడా బూతులు నేర్పించిందట. వాటిని జూలో ఉంచినప్పుడు సందర్శకులను చూసి చిలుకలు బూతులు మాట్లాడుతున్నాయట. చిలుకలు అలా మాట్లాడుతుంటే సందర్శకులు తెగ ఎంజాయ్‌ చేశారు. కొందరు ఇంకా తిట్టు అన్నట్లు వాటిని ప్రోత్సాహించడం ప్రారంభించారు. పెద్దలకు అది సరదాగానే ఉన్నా.. వారాంతాల్లో చిన్నారులు జూకి వస్తుంటారు. వారి ముందు ఈ చిలుకలు బూతులు మాట్లాడటం బాగోదని భావించిన జూ సిబ్బంది వాటిని జూలో నుంచి తీసుకెళ్లి మరో చోట వేర్వేరు పంజరాల్లో ఉంచారు. ఇలాగైనా అవి కొత్త పదాలు నేర్చుకోకుండా, పాతవి మర్చిపోయే అవకాశముందని భావిస్తున్నారు.