Food

కారం పన్నీర్ మస్త్ మస్త్..

కారం పన్నీర్ మస్త్ మస్త్..

పనీర్‌… పిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టపడే పదార్థాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని దోరగా కాల్చుకుని తినడమే కాదు… రకరకాల వంటకాలూ చేయడం తెలిసిందే. అయితే.. ఆ పనీరే ఇప్పుడు ఇంకాస్త కొత్తగా మారిపోయి… ‘ఫ్లేవర్డ్‌ పనీర్‌’ రూపంలో వస్తూ నోరూరిస్తోంది.
**మల్లెపువ్వులా తెల్లగా ముట్టుకుంటే మెత్తగా ఉండే పనీర్‌లో మాంసకృత్తులూ, మంచి కొవ్వులూ, ఫొలేట్‌… వంటి పోషకాలు ఎన్నో. అందుకే శాకాహారులు దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుని రకరకాల వంటకాల తయారీలో వాడుతుంటారు. ఎలా వండుకున్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందే తప్ప అస్సలు బోర్‌ కొట్టని పనీర్‌కి ఇప్పుడు గృహిణులూ, తయారీదారులూ కొత్త రుచులే కాదు రంగులూ అద్దుతున్నారు. అలా వస్తున్నదే ఈ ‘ఫ్లేవర్డ్‌ పనీర్‌’. అంటే… ఫ్లేవర్డ్‌ మిల్క్‌ తరహాలో దీని తయారీలోనూ నచ్చిన పదార్థాలూ, మసాలాలూ కలిపేస్తూ పనీర్‌ని చప్పగానే కాదు… రకరకాల రుచుల్లో చేసుకోవచ్చని చెబుతున్నారు. అలా నచ్చిన రుచిలో వచ్చేందుకు వెల్లుల్లి, ఎండుమిర్చి గింజలు, మెంతికూర, పాలకూర, గరంమసాలా, మిరియాలు, అల్లం… తదితర పదార్థాలను పనీర్‌ తయారీలో వాడుతున్నారు. దాంతో చప్పగా ఉండే పనీర్‌ కాస్తా చవులూరిస్తూ స్పైసీగా మారిపోతోంది.
**ఎలా తయారుచేస్తారు…
సాధారణంగా పనీర్‌ తయారుచేయాలంటే పాలను మరిగించి, నిమ్మరసం లేదా వెనిగర్‌ వేస్తాం కదా… వాటికన్నా ముందు మనం కావాలనుకున్న రుచికి సంబంధించిన పదార్థాలు వేసి ఓసారి కలపాలి. ఆ తరువాత పాలను విరగ్గొట్టుకుని పనీర్‌లా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పాల విరుగుడును ఓ గిన్నెలో వేసి కావాలనుకున్న పదార్థాలను కలిపి… ముద్దలా చేసుకుని దీనిపైన ఏదయినా బరువును ఉంచితే పనీర్‌ తయారై పోతుంది. ఉదాహరణకు… పనీర్‌ కాస్త కారంగా కావాలనుకుంటే ఎండుమిర్చి గింజలు, ఉప్పు, కొద్దిగా పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీరను వేయొచ్చు. అదేవిధంగా పసుపు, మిరియాలపొడి, అల్లంరసం లాంటివీ వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇలా కావాలనుకున్న పదార్థాలను వేసుకోవడం వల్ల పనీర్‌ రుచితోపాటు రంగు కూడా పూర్తిగా మారిపోతుంది. ఒకవేళ ఇంకా ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే తందూరీ మసాలా, పాలకూర ముద్ద, పాలక్‌పనీర్‌ మసాలా వంటివీ వేయొచ్చు. ఇవేవీ కాకుండా… పిల్లలకు నచ్చేలా తియ్యగా చేసుకోవాలనుకుంటే తేనె, దాల్చినచెక్కపొడి వాడితే చాలు. ఇలా చేసుకునే పనీర్‌ ముక్కల్ని దోరగా వేయించుకుని లేదా కాల్చుకుని తినేయడమే కాదు… చపాతీలు, బ్రెడ్‌స్లైసుల మధ్యా తురిమి పెట్టుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫ్లేవర్డ్‌ పనీర్‌ వంటకాలకు కొత్త రుచి తెస్తుందనేది నిజం. ప్రయత్నించండి మరి.