‘జలుబు చేస్తేనో ఫ్లూ జ్వరం వస్తేనో… అల్లం టీ తాగితే హాయిగా అనిపిస్తుంది, అంటే- సంప్రదాయ గృహ చిట్కాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమధ్య ప్రకటించింది. మర్నాటి నుంచే- పరగడుపున అల్లం టీ తాగినా, ఉడికించి తిన్నా కరోనా తగ్గిపోతుందంటూ సోషల్‌మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. దాంతో ప్రపంచమంతా అల్లాన్ని బెల్లంలా చప్పరించేస్తోంది. అది కొవిడ్‌కి మందులా పనిచేస్తుందా లేదా అన్నది పక్కనపెడితే అల్లంతో లాభాలెన్నో..!
**కరోనా మానవాళికి ఎన్ని కడగండ్లు తెచ్చిపెట్టినా- రోగనిరోధకశక్తిని పెంచే వాటిని రోజూ తినేలా చేసిందన్నది నిజం. అందులో భాగంగానే అల్లం వంటింటి దినుసుల్లో కీలకంగా మారింది. కొన్నిదేశాల్లో దానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడి, ధర మూడింతలకి పెరిగిందట. నిజానికి మనదేశంలోనే కాదు, ఆసియా దేశాలంతటా అల్లం వాడని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కషాయంలో మసాలా టీలో కూరల్లో బిర్యానీల్లో పులావుల్లో మజ్జిగ పులుసులో సాంబారులో… అల్లం దంచి వేయాల్సిందే. మాంసాహార కూరలకయితే అల్లం వెల్లుల్లి నూరాల్సిందే. అల్లం లేని ఉప్మా, పెసరట్టుని అస్సలు ఊహించలేం. ఇడ్లీ, దోసె, గారె… వంటి వాటికి అల్లం చట్నీనే సరిజోడీ. ఇక, నాలుగు చినుకులు పడినా శీతగాలి తిరిగినా నిమ్మరసం, తేనె కలిపిన వేడి వేడి అల్లం టీ కొంచెంకొంచెంగా గొంతు దిగుతుంటే ఆ హాయే వేరు. మురబ్బా రూపంలో అల్లం స్వీటు చిరపరిచితమే కానీ ఈమధ్య దాన్నే బెల్లంతో రకరకాలుగా తయారుచేస్తున్నారు. ఎండిన అల్లం(శొంఠి)పొడిని వాడటమూ తెలిసిందే. బిస్కట్లూ కుకీలూ కేకులూ బ్రెడ్డుల్లోనూ అల్లం వేయడం ఐరోపా వాసులకీ అలవాటే. పొట్టు తీసిన అల్లాన్ని స్లైసెస్‌గా కోసి బీట్‌రూట్ రసం, వినెగర్‌లో నానబెట్టి నిల్వ చేసుకునీ తింటుంటారు.
***వికారమా… అల్లం ఉందిగా..!
ప్రపంచంలో పండే అల్లంలో 32శాతం మనదేశంలోనే పండినప్పటికీ దీని స్వస్థలం మలేషియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ దీవులే. అక్కడినుంచే అన్ని దేశాలకూ చేరిందట. ఆయా దేశాల్లో ఇప్పటికీ నావల్లో వెళ్లినవాళ్లు వెంట అల్లాన్ని తీసుకెళితే సురక్షితంగా చేరుకుంటారనే విశ్వాసం వాడుకలో ఉంది. పూర్వం సముద్రంమీద వెళ్లేవాళ్లు వికారం కలగకుండా అల్లం తీసుకెళ్లేవారట. అదే సంప్రదాయంగా మారిందక్కడ. అల్లం మొక్కల ఆకులూ పూలూ కూడా అందంగా ఉంటాయన్న కారణంతో అందం కోసమూ పెంచుతుంటారు. ఇండొనేషియా, వియత్నాం… వంటిచోట్ల ఆకుల్ని వాసనకోసం వంటల్లో వాడతారు. అయితే మనకు తెలిసిన అల్లం ఒకటే. అది పెరిగే వాతావరణం, ప్రాంతాన్ని బట్టి ఇది భిన్న వర్ణాలూ సైజుల్లో పండుతుంది. అయితే అచ్చం అల్లంలోని గుణాల్ని కలిగి ఉండే రకాలు చాలానే ఉన్నాయి. ఎరుపు రంగులోని జింజిబర్ రుబ్రమ్; నీలం, గులాబీ, తెలుపు రంగుల్లో ఉండే గలాంగల్ రకాలూ; పసుపురంగులో ఉండే జింజిబర్ కాసామునార్; ఊదా, నలుపు రంగుల్లో క్యాంఫెరియా పర్విఫ్లోరా(థాయ్ జిన్‌సెంగ్), చేతివేళ్లను పోలిన బోసెన్‌బెర్జియా రొటుండా…ఇలా చాలానే ఉన్నాయి. మామిడి అల్లంగా పిలిచే కుర్‌క్యుమా అమండా పసుపు కొమ్ముని పోలి ఉంటుంది. రుచి అల్లంలా ఉంటుంది. కానీ ఘాటు తక్కువగా, మామిడి వాసనతో ఉంటుంది. అందుకే దీనికా పేరు. నిల్వపచ్చళ్లకి దీన్నే ఎక్కువగా వాడతారు. రంగురంగుల్లోని ఈ అల్లం రకాలన్నీ అత్యుత్తమ ఔషధాలే. రోగనిరోధకశక్తిని పెంచి, శ్వాసకోశ వ్యాధుల్ని అరికట్టే అద్భుత నిల్వలే.
***భలే… మంచి మందు!
కొన్ని రకాల ఔషధ పదార్థాల్లో మంచి గుణాలెన్ని ఉన్నా అందరి శరీరానికీ సరిపడకపోవచ్చు. కానీ అల్లంలో అన్నీ మంచి గుణాలే. అందరికీ ఆరోగ్యాన్నే పంచిస్తుంది. అందుకే ఆ తూర్పు, ఈ పశ్చిమం అన్న తేడా లేకుండా దీన్ని ‘యూనివర్సల్ మెడిసిన్’గా పేర్కొంటారు వైద్యులు. ఆయుర్వేదం, యునాని, గృహ వైద్యంలోనే కాదు, అలోపతీ సైతం అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే అంటోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాడే అన్ని సంప్రదాయ వంటకాల్లోనూ అల్లం ఉనికి కనిపిస్తుంటుంది. ఇంట్లో ఎవరైనా వికారంగా ఉందన్నా, అజీర్తి చేసిందన్నా, ఆకలి లేదని చెప్పినా, పొట్ట నొప్పన్నా వెంటనే ఉప్పూ నిమ్మరసం అద్దిన చిన్న అల్లం ముక్క తినమని ఇస్తుందా ఇల్లాలు. ఆయుర్వేద వైద్యులయినా అదే చెబుతారు. విరేచనాలకీ ఇది మంచి మందు అని శాస్త్రవేత్తలూ అంటున్నారు. నిల్వ పదార్థాలనుగానీ విషపూరితంగా మారిన వాటినిగానీ పొరబాటున తింటే వెెంటనే అల్లం మరిగించిన నీటిని తాగిస్తే అందులోని హానికర టాక్సిన్లను అది పీల్చేస్తుందట.
* జలుబు చేసినా ఫ్లూ జ్వరం వచ్చినా కప్పు నీళ్లలో టీస్పూను చొప్పున అల్లం తురుము, దాల్చినచెక్క పొడి వేసి పది నిమిషాలు మరిగించి కాస్త తేనె కలుపుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. కఫం ఉన్నవాళ్లకైతే రోజుకి రెండుమూడు కప్పులు తాగమని చెబుతారు. జీర్ణశక్తికి తోడ్పడే ఎంజైముల విడుదలకి తోడ్పడటం ద్వారా ఇది పొట్టనీ శుద్ధి చేస్తుందట.
* అల్లంలోని వేడికి బాగా చెమట పట్టడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ పోతాయి. అంతేకాదు, ఒంటిమీద చేరే వైరస్‌ల్నీ బ్యాక్టీరియానీ నాశనం చేసే డెర్మిసిడిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తినీ ఇది పెంచుతుందట.
* ఒంట్లోకి చక్కెర వ్యాధి, హృద్రోగాలు వచ్చి చేరితే రోజూ కాస్త అల్లం తినడం లేదా టీ రూపంలో తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగకుండానూ; కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా రక్తం గడ్డ కట్టకుండానూ చేస్తుందట. అధిక కొలెస్ట్రాల్ బాధితులకి 45 రోజులపాటు మూడు గ్రా. శొంఠిపొడిని ఇవ్వగా, అది కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇచ్చే అటొర్వాస్టాటిన్ అనే మందులా పనిచేసి, వాళ్లలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేలా చేసిందని పరిశోధనలూ చెబుతున్నాయి. ఇందులోని జింజరాల్ జీవక్రియని పెంచుతుంది. తద్వారా కొవ్వు కరిగి, బరువు తగ్గేలా చేస్తుంది.
* రోగనిరోధకశక్తిని పెంచే తెల్ల రక్తకణాలే కొన్ని సందర్భాల్లో శరీరంమీద దాడికి దిగి, విపరీతమైన మంటనీ నొప్పినీ కలిగిస్తుంటాయి. దీనివల్లే కీళ్లు, కండరాలూ వాచి, నొప్పి పెడుతుంటాయి. అలాంటి వాటిని అల్లం
చాలావరకూ తగ్గిస్తుంది.
* అల్లంలోని జింజరాల్‌కి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంది. ఇది క్లోమ, రొమ్ము, అండకోశ క్యాన్సర్లు రాకుండా చేయడంతోపాటు క్యాన్సర్ రోగులకి కీమోథెరపీ ఇచ్చేటప్పడు కలిగే వికారాన్నీ వాంతుల్నీ అరికడుతుంది.
* వయసుతోబాటు వచ్చే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆల్జీమర్స్‌నీ అడ్డుకుంటుంది. అల్లంలోని బయోయాక్టివ్ పదార్థాలన్నీ మెదడు పనితీరుని పెంచుతాయి. మధ్యవయసు మహిళల్లో జ్ఞాపకశక్తిని అల్లం పెంచుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. సో, వయసురీత్యా పెరిగే మందమతిని అల్లం పోగొడుతుందన్నమాట.
* శ్వాసకోశ వ్యాధులకీ చిగుళ్ల వ్యాధులకీ కారణమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు తాజా అల్లంలోని జింజరాల్ అత్యుత్తమ ఔషధం.
మొత్తమ్మీద రోజూ కాస్త అల్లం తింటే, తినే ఆహారంలోని పోషకాలన్నీ బాగా ఒంటబడతాయి. ఒత్తిడీ తగ్గుతుంది. సో, కరోనా గోల ఎలాగున్నా రోగనిరోధకశక్తిని పెంచే అల్లం మాత్రం ఎవర్‌గ్రీన్ యూనివర్సల్ మెడిసిన్ అని ఒప్పుకోవాల్సిందే మరి.
జలుబు వేధిస్తోందా?
Related tags :