DailyDose

చప్పట్లు కొట్టిన జగన్-తాజావార్తలు

Jagan Appreciates Volunteers With Claps - Telugu Breaking News

* శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకులు పోటెత్తారు. జలాశయానికి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ఐదు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను చూసేందుకు తరలివస్తున్నారు. గాంధీ జయంతి సెలవు.. శని, ఆదివారాలు కలిసి రావడంతో కార్లు, ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం రహదారులు సందర్శకుల వాహనాలతో రద్దీగా మారాయి. జలదృశ్యాలను చూసేందుకు పలువురు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

* గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయా ఉద్యోగులకు సీఎం జగన్‌ చప్పట్లతో అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం చప్పట్లు కొట్టి ప్రశంసించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,555 కరోనా పాజిటివ్‌ కేసులు, 31 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,06,790కు చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 5,900 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో వ్యవధిలో 70,399 నమూనాలను పరీక్షించారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 6,43,993 మంది డిశ్చార్జి అవ్వగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 56,897 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 59,48,534 పరీక్షలు నిర్వహించారు.

* దేశం అభివృద్ధి చెందాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థమని.. అందుకే అనేక విప్లవాత్మక మార్పులను ఆయన తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం బాధాకరమని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో సోమాజీగూడలో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర రద్దు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

* హాథ్రస్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. భీమ్‌ ఆర్మీ, యూత్‌ కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు వేలాది సంఖ్యలో నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో హాథ్రస్‌ ఘటనను వ్యతిరేకిస్తూ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆడపడుచుల భద్రత, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘రాష్ట్రంలోని తల్లులు, బిడ్డలకు హాని కలిగించాలని భావించిన వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తాం. ఆ శిక్ష భవిష్యత్‌ తరాలకు కూడా గుర్తుండిపోయేలా చేస్తాం. యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు తల్లులు, బిడ్డల రక్షణకు కట్టుబడి ఉంది. ఇది మా ప్రతిజ్ఞ’ అంటూ ట్వీట్‌ చేశారు.

* రైతులే భారతదేశానికి వెన్నెముక అని.. తన తుదిశ్వాస వరకు తన పార్టీ, తాను వారి వెన్నంటే ఉంటామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్‌ – జై కిసాన్‌’ నినాదాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 55 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన ఈ నినాదం దేశంలోని సైనికులు, రైతాంగానికి ఎంతో ఉత్తేజాన్ని, ప్రేరణను ఇవ్వడంతో పాటు రైతు సోదరులను గర్వపడేలా చేసిందన్నారు.

* అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచిన హాథ్రస్‌ బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ దిల్లీలో వాల్మీకి మహర్షి ఆలయంలో శుక్రవారం ఆమె ప్రార్థనలు నిర్వహించారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ యూపీ ప్రభుత్వం, పోలీసులు దారుణంగా వ్యవహరించారని అన్నారు. బాధితురాలి అంత్యక్రియలను కూడా కుటుంబ సభ్యులు సరిగా నిర్వహించలేకపోయారని చెప్పారు.

* ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు సందడి చేస్తున్నాయి. గ్యాడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రానిక్‌ కంపెనీలు పోటాపోటీగా తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. తాజాగా హువామీ అమేజ్‌ఫిట్‌ నియో స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. చతురస్రాకారపు డయల్ (రెట్రో)డిజైన్‌, నేవిగేషన్ బటన్, వాటర్‌ రెసిస్టెంట్, ఎక్కువ రోజుల బ్యాటరీ సామర్థ్యం ఈ వాచ్‌ ప్రత్యేకతలు. షావోమి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5తో అమేజ్‌ఫిట్‌ నియో పోటీపడనుంది. ఇందులో 24X7 హార్ట్‌రేట్ మానిటరింగ్ కోసం పీపీజీ బయో ట్రాకింగ్ ఆప్టికల్‌ సెన్సర్ ఇస్తున్నారు. ర్యాపిడ్ ఐ మూమెంట్ (ఆర్‌ఈఎం), స్లీప్ ట్రాకర్‌ ఫీచర్స్‌ ఉన్నాయి.

* ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా ఇప్పటికే కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు వైరస్‌ సోకినట్లు తేలడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు స్పందిస్తున్నారు. వైరస్‌ బారినపడినట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనపై కొందరు ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎగతాళి చేయడం కనిపిస్తోంది. ముఖ్యంగా తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోన్న ట్రంప్‌కు వైరస్‌ సోకడంతో‌ ఆయనపై కామెంట్లు చేసేందుకు చైనీయులు మాత్రం తాపత్రయపడుతున్నారు.

* బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడని మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అన్నాడు. తమ బౌలింగ్‌కు అనుగుణంగా ఫీల్డింగ్‌ పెట్టుకొనేందుకు స్వేచ్ఛనిస్తాడని ప్రశంసించాడు. ఆటగాళ్లు నాయకుడి నుంచి కోరుకొనేది అదేనని వెల్లడించాడు. యూఏఈలో జరుగుతున్న లీగులో మూడు మ్యాచులు ఆడిన బెంగళూరు రెండు విజయాలు సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో చాహల్‌ కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిసాడు. బ్యాట్స్‌మెన్‌ సిక్సర్లు బాదే అవకాశమున్నా రిస్క్‌ తీసుకొనేందుకు వెనుకాడడు. లీగులో అతడు ఇప్పటి వరకు 105 వికెట్లు తీయడం గమనార్హం.

* మొబైల్​ఫోన్‌ ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. డిస్​ప్లే, టచ్ ప్యానళ్లపై ప్రభుత్వం 10శాతం దిగుమతి సుంకం విధించడమే ఇందుకు కారణం. దీంతో సుమారు 3 శాతం వరకు మొబైల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలైన శాంసంగ్, యాపిల్, షావోమి, ఒప్పో, రియల్‌మీ ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

* కరోనా వస్తుందేమోనన్న భయంతో విశ్రాంత జడ్జి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..సైబర్‌హిల్స్‌లో నివాసముంటున్న విశ్రాంత న్యాయమూర్తి రామచంద్రారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తనకు కొవిడ్‌ సోకుతుందేమోనన్న ఆందోళనతో శుక్రవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను గుర్తించడంలో వ్యాధి లక్షణాలు ఎంతో కీలకం. ఇప్పటివరకు జ్వరం, దగ్గు వంటి వాటిని ముఖ్య లక్షణాలుగానే పరిగణిస్తున్నారు. అయితే, వీటికంటే వాసన, రుచి కోల్పోయే లక్షణాలే వైరస్‌ను గుర్తించడంలో కీలకంగా ఉన్నాయని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీ కాలేజీ లండన్‌(UCL)కు చెందిన నిపుణులు తొలిసారిగా వీటిపై పరిశోధన చేశారు.

* గొడవలు జరుగుతుంటే చూడటం తనకు ఎంతో ఇష్టమని అంటున్నారు నటి రష్మి. వ్యాఖ్యాతగానే కాకుండా నటిగా ప్రేక్షకులను మెప్పించిన రష్మి తాజాగా నందు విజయ్‌ కృష్ణతో కలిసి నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నందు(పోతురాజు).. పూరీజగన్నాథ్‌కి వీరాభిమానిగా కనిపిస్తారు. అంతేకాకుండా తన జీవితాన్ని కథగా రాసి పూరీకి ఇవ్వాలని.. బతికినా, చచ్చినా తన జీవితకథ మాత్రం పూరీ డైరెక్షన్‌లో ఎప్పటికీ బతికే ఉండాలని నిర్ణయించుకుంటాడు. మరి పోతురాజు తీసుకున్న నిర్ణయం ఎలా నెరవేరిందో తెలియాలంటే సినిమా కోసం వేచి చూడాల్సిందే.