Sports

ఆ పరుగులు ఎందుకు ఇవ్వరు?

ఆ పరుగులు ఎందుకు ఇవ్వరు?

పంజాబ్‌ పేసర్‌ షమి వేసిన 17వ ఓవర్‌ ఆఖరి బంతికి పొలార్డ్‌ను అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని పొలార్డ్‌ సవాలు చేస్తూ సమీక్షకు వెళ్లాడు. బంతి బ్యాట్‌కు తగిలినట్లు సమీక్షలో స్పష్టమవ్వడంతో అంపైర్‌ తిరిగి నాటౌట్‌గా ప్రకటించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. అయితే ఆ సమయంలో పొలార్డ్‌ తన పరుగు పూర్తిచేశాడు. కానీ అంపైర్‌ తొలుత ఔట్‌గా ప్రకటించడంతో నిబంధనల ప్రకారం అతడికి ఆ పరుగు దక్కలేదు. కానీ సమీక్షలో నాటౌట్‌ వచ్చినప్పుడు పరుగు ఇవ్వాలని క్రికెట్‌ మాజీల అభిప్రాయం. ఆ ఒక్క పరుగు జట్టు గెలుపు నిర్ణయిస్తుందని, ఐసీసీ తమ నిబంధనలు మార్చాలని మాజీలతో సహా అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అంపైర్‌ తొలుత ఔట్‌గా ప్రకటిస్తే.. అనంతరం సమీక్షలో బ్యాటింగ్‌ వైపు నిర్ణయం సానుకూలంగా వస్తే, నోబాల్‌ కాకుండా ఏ ఇతర పరుగు బ్యాటింగ్‌ జట్టుకు లభించదు. ఈ నిబంధనను తీవ్రంగా తప్పుపడుతున్నారు. అలాంటి నిబంధనతో భవిష్యత్తులో ప్రపంచకప్‌ను, లీగ్‌ టైటిళ్లను చేజార్చుకుంటే పరిస్థితి ఏంటని మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘‘పొలార్డ్‌ ఒక్క పరుగు తీశాడు. కానీ ఎల్బీడబ్లూగా ఇచ్చారు. దీంతో రివ్యూకి వెళ్లాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్‌ అయిందని స్పష్టమైంది. కానీ సులువుగా వచ్చిన ఆ పరుగుని పరిగణనలోకి తీసుకోలేదు. ఐసీసీ.. ఆ ఒక్క పరుగు ఏదో ఒక రోజు ప్రపంచకప్‌ను దూరం చేయవచ్చు. దీని గురించి పునరాలోచించండి. డెడ్‌ బాల్‌ అయ్యే వరకు అంపైర్లు తమ నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచుకోవాలి’’ అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్‌ వూర్కేరి వెంకట రామన్‌ మద్దతిస్తూ ఆకాశ్‌ చోప్రా ఆలోచన సరైనదని అభిప్రాయపడ్డాడు.