తగిన శాస్తి జరిగింది… ట్రంప్ కు కరోనా సోకడంపై చైనా అధికార మీడియా చీఫ్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కూడా కరోనా నిర్ధారణ అయింది. ఇదే అదనుగా చైనా రెచ్చిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొవిడ్ ని తక్కువ చేసి చూపుతూ, దాంతో జూదం ఆడేందుకు ప్రయత్నించారని, అందుకు ఆయన, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తగిన మూల్యం చెల్లించారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ హు షిజిన్ ట్వీట్ చేశారు.
ట్రంప్, మెలానియాలకు కరోనా సోకిందన్న వార్తలే అమెరికాలో కరోనా పరిస్థితికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి ట్రంప్ ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని భావిస్తున్న ఆయన ఆశలకు ప్రతిబంధకంగా మారనుందని హు షిజిన్ వివరించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా సోకడంపై చైనా అధినాయకత్వం ఇంకా స్పందించలేదు.