రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం ఎన్‌కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలు ఉన్నాయని ల్యాండ్ సెటిల్‌మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు.
కాగా నయీం ఎన్‌కౌంటర్, తదనంతరం పరిణామాలపై సిట్ 175కుపైగా చార్జ్‌సీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,13 మంది సీఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా వీరందరికి క్లీన్‌చీట్ ఇస్తున్నట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు. మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు కోరారు.