Kids

దటీజ్ తెనేటీగ పవర్

దటీజ్ తెనేటీగ పవర్

సృష్టిలో అన్నిటికన్నా తెలివైన ప్రాణి… మనిషే. అందులో సందేహం లేదు. కానీ ముఖ్యమైన ప్రాణి..? మనిషి మాత్రం కాదు, డౌటే లేదు. మరి ఎవరూ అంటే… ఒక చిన్న ఈగ… తేనెటీగ! అవును. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో భూమి మీద అన్నిటికన్నా ముఖ్యమైన, విలువైన ప్రాణి తేనెటీగేనని శాస్త్రవేత్తలు మళ్లీ మళ్లీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు, అది అంతరించిపోయే ప్రమాదంలో ఉందనీ హెచ్చరిస్తున్నారు.
పొద్దున్నే తాగడానికి కాఫీ లేకపోతే…
పిల్లలు తినడానికి చాకొలెట్‌ అనేదే లేకపోతే…
ఐస్‌క్రీమ్‌లో నోరూరించే స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌ లేకపోతే…
వండుకోవటానికి టొమాటో, వంకాయ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, ఆలూ, క్యారట్‌ లాంటి కూరలేవీ లేకపోతే…
తినడానికి మామిడి, ఆపిల్‌, ద్రాక్ష, నారింజ, జామ, దానిమ్మ లాంటి పండ్లేవీ లేకపోతే…
జీవితం ఎంత చప్పగా ఉంటుంది మనకి? ఏం తిని బతుకుతాం?
ఒట్టి వరీ గోధుమా జొన్నలూ ఎంతకాలమని తింటాం… తేనెటీగలు లేకపోతే అదే మన పరిస్థితి.
కాస్త మట్టీ కొంచెం నీరూ మరికాస్త ఎండా ఉంటే చాలు మొక్కలు మొలుస్తాయి, పువ్వులు పూసి కాయలు కాసి మన కడుపు నింపేస్తాయి- అనుకుంటే పొరపాటే. మనిషి బతకడానికి గాలీ నీరూ తిండీ మాత్రమే ఎలా సరిపోవో అలాగే మొక్కలకీనూ. ప్రపంచంలో పండే 30 శాతం పంటలకీ, 90 శాతం చెట్లకీ బతకడానికి పరపరాగ సంపర్కం కావాలి. అంటే ఒక పువ్వుకి మరో పువ్వులోని పుప్పొడి తాకితేనే ఆ పువ్వు ఫలదీకరణం చెంది కాయ అవుతుంది. తర్వాత తరానికి కావలసిన విత్తనాల్ని తయారుచేస్తుంది. అలా పువ్వుల మధ్య పరాగ సంపర్కం జరగడానికి తోడ్పడుతుంది కాబట్టే తేనెటీగకి అంత విలువ. పువ్వుల్లోని పుప్పొడే తేనెటీగలకు ఆహారం. ఆ ఆహారాన్ని తాము తిని, తమ కాళ్లపై ఉన్న సంచుల నిండా నింపుకుని ఇంటికి తీసుకెళ్లి తేనెపట్టులో ఉన్న బుల్లి తేనెటీగలకు తినిపిస్తాయి. ఆ క్రమంలో ఒక పువ్వు నుంచి మరో పువ్వుకు అలుపెరగక తిరుగుతూ తేనెటీగలు వేలాది పువ్వుల మీద వాలతాయి. తమ పని తాము చేసుకుంటూ మన పనీ చేసిపెడతాయి. కూరగాయలూ పండ్లూ మాత్రమే కాదు, మనం ధరించే ఈ మెత్తటి నూలు దుస్తులూ తేనెటీగల చలవే. పత్తి పూల ఫలదీకరణకూ అవే కీలకం.
****మూడోవంతు ఆహారం
ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 35 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాల ఉత్పత్తికి ఝుమ్మంటూ తిరిగే తేనెటీగలూ వాటి జాతికే చెందిన ఇతర కీటకాలూ కారణం. ఆంగ్లంలో బీస్‌ అని పిలిచే వీటిలో దాదాపు పాతిక వేల రకాలున్నాయి. తుమ్మెదలు కూడా వీటిలో ఒక రకమే. వాటన్నిటిలోనూ తేనెటీగలు మాత్రమే 90 శాతం ఫలదీకరణకు కారణమవుతాయి. ఇంకా సీతాకోకచిలుకలూ గబ్బిలాలూ ఇతర పక్షులూ కూడా పువ్వుల పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నా వాటి ప్రభావం చాలా తక్కువ. పైగా అవి కొన్ని రకాల పూలనే ఇష్టపడతాయి. తేనెటీగలు అలా కాదు. అన్ని రకాల పూలమీదా వాలి వాటి మకరందాన్ని ఇష్టంగా జుర్రుకుంటాయి. అందువల్లనే మనకు అవసరమైన మూడింట ఒక వంతు ఆహారపదార్థాల తయారీకి అవే కారణమవుతున్నాయి. ఇతరత్రా వాటికన్నా తేనెటీగల వల్ల పరాగసంపర్కం జరిగితే ఉత్పత్తి 24 శాతం పెరుగుతుందనీ పండ్ల తోటల దగ్గర తేనెటీగలు పుష్కలంగా ఉంటే దిగుబడి మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందనీ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. పైగా నాణ్యత కూడా బాగుంటుందట. గాలి వల్ల పరాగ సంపర్కం జరిగే వరి, గోధుమ లాంటి ధాన్యమూ, హైబ్రిడ్‌ రకాలకూ తప్ప మిగతా అన్ని ఆహారపదార్థాల పంటలకూ తేనెటీగలే కీలకం.
ఇలా మనకు దిగుబడులు పెంచుతూనే మరో పక్క తేనె తుట్టెల ద్వారా లక్షల టన్నుల తేనెనీ అందిస్తున్నాయి ఈ తేనెటీగలు. వీటివల్ల మరికొన్ని లాభాలూ ఉన్నాయి.
****ప్రధానంగా ఐదు
తేనెటీగల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రధానంగా ఐదు రకాలు.
**పరాగ సంపర్కం: కూరగాయల్లో- బెండ, వంకాయ, టొమాటో, బంగాళాదుంప, బీట్‌ రూట్‌, క్యారట్‌, ముల్లంగి, ఉల్లిపాయ, బ్రకోలి, కాలిఫ్లవర్‌, క్యాబేజ్‌, క్యాప్సికమ్‌, ఆవ, దోస, గుమ్మడి, రకరకాల బీన్స్‌; పండ్లలో- మామిడి, జామ, ఆపిల్‌, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ, స్టార్‌ ఫ్రూట్‌, కివి, బొప్పాయి, లిచీ, నిమ్మ, బత్తాయి, చింత, చెర్రీ, అప్రికాట్‌, రేగు, బాదం, జీడి, పుచ్చ, నారింజ; ఇంకా నూనెలనిచ్చే కొబ్బరి, పొద్దు తిరుగుడు, అవిసె, నువ్వులు, పత్తి… ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం రెండున్నర లక్షల రకాల మొక్కలు తేనెటీగల వల్లనే బతుకుతున్నాయి.
**అటవీ ఉత్పత్తులు: అడవినుంచి మనం సేకరించుకునే పలురకాల ఉత్పత్తులకూ తేనెటీగల ద్వారా జరిగే పరాగ సంపర్కమే కారణం. అడవుల్లో నివసించే జంతువులన్నీ తమ ఆహారంకోసం పరోక్షంగా తేనెటీగల మీదే ఆధారపడతాయి. జీవ ఇంధనాన్ని తయారుచేయడానికి పనికొచ్చే మొక్కలూ, ఔషధ మొక్కలూ, జంతువులు తినే గడ్డిమొక్కలూ… తేనెటీగల వల్లనే పెరుగుతాయి.
**అడవుల అభివృద్ధి:
అడవిలోని చెట్లను కొట్టుకుని వాడుకుంటాం కానీ ఆ అడవుల్ని పెంచిందెవరో మనమెప్పుడూ ఆలోచించం. నిజానికి అడవులు పెరగడానికి తోడ్పడేది తేనెటీగలే. వాటివల్లే అడవుల్లోని చెట్లు కాయలు కాస్తాయి. ఆ కాయలూ పండ్లను తిన్న పక్షులూ జంతువులూ పడేసే గింజల వల్ల కొత్త చెట్లు మొలుస్తాయి. అలా అడవి దట్టంగా విస్తరిస్తుంది.
**ఆహార వనరు:
మధురమైన తేనెని మనమే కాదు, అడవుల్లో ఉండే పక్షులూ చిన్న చిన్న ప్రాణులూ కీటకాలూ ఇష్టంగా తాగుతాయి. ప్రకృతిలో ప్రాణులన్నీ ఆహారం కోసం ఒకదానిమీద ఒకటి ఆధారపడి బతికే ఫుడ్‌చైన్‌లోనూ వీటిది కీలక స్థానమే. దాదాపు 24 జాతుల పక్షులూ, సాలీళ్లూ, తూనీగలూ, గొల్లభామలూ తేనెటీగలను తింటాయి.
**జీవ వైవిధ్యం:
ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నోరకాల మొక్కలూ క్రిమికీటకాలూ జంతువులూ బతకడానికి తోడ్పడుతున్న ఈ భూమి మీద జీవ వైవిధ్యాన్ని పెంచిపోషిస్తున్న కీలకమైన ప్రాణిగా తేనెటీగకి గుర్తింపు వచ్చింది. అయితే, ఇంతటి ముఖ్యమైన ప్రాణి మనుగడకీ ఇప్పుడు ప్రమాదం నాలుగువైపుల నుంచి ముంచుకొచ్చింది.
***ఏమైందంటే…
పుష్కరకాలం క్రితం మొదటిసారి తేనెటీగలు వార్తల్లోకెక్కాయి. ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్ద ఎత్తున తేనెటీగలు మాయమైపోవడాన్ని అమెరికాలో బీకీపర్లు గమనించారు. రాణి ఈగ, మగ ఈగలు తప్ప బయట తిరిగే శ్రామిక ఈగలన్నీ ఒక్కసారిగా కన్పించకుండాపోవడంతో మొత్తంగా ఆ తేనెపట్టు కుప్పకూలిపోయేది. చాలా ప్రాంతాల్లో, ఇతర దేశాల్లోనూ ఇలాగే జరుగుతున్నట్లు తెలిసింది. అది గమనించాక ఆ పరిస్థితులకు కారణాలను వెతకడం మొదలుపెట్టారు పరిశోధకులు. అరుదుగా మాత్రమే ఏదైనా జబ్బు చేసి ఈగలన్నీ ఒకేసారి చచ్చిపోతాయి. అలాంటి అనారోగ్యమేమీ లేకుండా ఉన్నట్టుండి అవి చచ్చిపోతున్నాయంటే అందుకు వేరే కారణాలేవో ఉన్నాయన్న అనుమానం వచ్చింది. సీరియస్‌గా అధ్యయనం చేస్తే గత అర్ధశతాబ్దంలోనే ప్రపంచం మొత్తమ్మీద తేనెటీగల సంఖ్య దాదాపు తొంభైశాతం తగ్గిపోయిందన్న విషయం వెల్లడైంది. దాంతో దిద్దుబాటు చర్యల వైపు దృష్టి మళ్లించారు. అంతరించిపోతున్న ప్రాణుల గురించి ఎర్త్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన చర్చలో అత్యంత ముఖ్యమైన ప్రాణిగా తేనెటీగకు ప్రథమ ప్రాధాన్యం లభించింది. క్రమం తప్పకుండా జరుగుతున్న వరుస అధ్యయనాలు దాన్ని బలపరిచాయి. ఎనభైకి పైగా పరిశోధనా సంస్థలనుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రచురించిన అధ్యయనం మరోసారి ఆ విషయాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ తేనెటీగలవైపు మళ్లించింది. అవి ఎంతో వేగంగా తగ్గిపోతున్నాయని హెచ్చరిస్తోంది. సహజంగా జరగాల్సిన పరాగసంపర్కం కోసం తేనెటీగల్ని అద్దెకు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే సమస్య తీవ్రతని అర్థం చేసుకోమంటోంది.
***కారణమేంటంటే…
ఏ జాతి అయినా సహజంగా అంతరించిపోవటానికి ఎంత సమయం పడుతుందో దానికి వెయ్యి రెట్లు వేగంగా తేనెటీగలు అంతరించిపోతున్నాయని పరిశోధకులు తేల్చారు. అందుకు కారణం… మనమే!
**క్రిమి సంహారకాలు:
రసాయన క్రిమిసంహారకాలూ, కలుపు నివారిణుల వాడకం వల్ల తేనెటీగలు ఎక్కువగా చనిపోతున్నాయి. పలుచోట్ల తేనెటీగలు సేకరించిన పుప్పొడిని విశ్లేషించి చూసిన శాస్త్రవేత్తలు అందులో ఐదారు రకాల క్రిమిసంహారకాల అవశేషాలను గుర్తించారు.
**వాతావరణ మార్పులు:
పారిశ్రామికీకరణ వల్ల భూతాపం పెరిగి ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. తేనెటీగలు మనగలిగే వాతావరణ పరిస్థితులు తగ్గిపోతున్నాయి.
**ఒకే పంట:
సాగు విధానాల్లో మార్పులూ మరో కారణం. ఒక ప్రాంతమంతా, సంవత్సరాల తరబడి ఒకే పంట వేయడం వల్ల వాటికి ఆహారం దొరకడం లేదు.
**ఆహారం దొరక్క:
సాధారణంగా ఒక తేనెటీగ తేనెపట్టునుంచి ఐదు కిలో మీటర్ల పరిధిలో తిరుగుతుంది. ఆ పరిధిలో పూల మొక్కలు కన్పించకపోతే ఇంకా ఎక్కువ దూరం వెళ్లాల్సివస్తోంది. దాంతో తిరిగి తిరిగి నీరసించి ఎక్కడో పడి చచ్చిపోతున్నాయి.
**మెదడు మీద ప్రభావం:
మనిషి సాధించిన అభివృద్ధి ఆ చిన్ని కీటకాల మెదడుని పనిచేయకుండా చేస్తోంది. డీజిల్‌ వల్ల కలుషితమైన గాలీ నియోనికోటినాయిడ్‌ ఉన్న క్రిమి సంహారకాలూ కలుపునివారణ మందుల్లో వాడే గ్లైఫోసేట్‌ లాంటి రసాయనాలూ తేనెటీగల మెదడు మీద ప్రభావం చూపడంతో అవి దారి మర్చిపోయి, దిక్కుతోచకుండా తిరిగి చచ్చిపోతున్నాయి.
**సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌:
తేనెటీగలు దిశను మర్చిపోవటానికి సెల్‌ఫోన్‌, వైఫై తరంగాలు కూడా కారణమేనని స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పేర్కొంది. ఈ సంస్థకి చెందిన బృందం ఎనభైకి పైగా ప్రయోగాలు చేసి సెల్‌ఫోన్‌ తరంగాలు ఏ విధంగా తేనెటీగల మెదడు మీద ప్రభావం చూపుతున్నాయో వివరించింది.
పట్టుమని గ్రాములో పదోవంతు బరువు కూడా తూగని ఆ చిన్ని ప్రాణాలకు గండంగా మారుతున్న ఈ కారణాలన్నీ మన సృష్టే. అయినా పట్టించుకోకుండా పరిస్థితిని ఇలాగే వదిలేస్తే- తేనెటీగలు లేని ప్రపంచంలో మనకొచ్చే మొట్టమొదటి సమస్య ఆహారోత్పత్తి తగ్గడమూ, ఉన్న ఆహారంలో కూడా పోషకాలు తగ్గిపోవడమూను. కొన్ని లక్షల రకాల మొక్కలు ఏకంగా ఉనికినే కోల్పోతాయి. జంతువులకూ ఆహారం తగ్గిపోతుంది కాబట్టి అవీ అంతరించిపోతాయి. దాంతో మనకు జంతువుల నుంచి లభించే ఆహారమూ ఉండదు. దూదితో బట్టలు తయారుచేసే పరిశ్రమే మాయమైపోతుంది. మొక్కలూ జంతువులూ లేని నేల ఎడారి అయిపోతుంది. అంటే మానవజాతి మనుగడే ప్రశ్నార్థమవుతుందన్నమాట. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
***మనమేం చేయగలమంటే…
తేనెటీగలకు ఆహారం దొరికే సహజవాతావరణాన్ని పెంపొందించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవసరం.
* తేనెటీగల సంఖ్య పెరగడానికి వీలుగా అడవుల్ని పెంచాలి. అడవులంటే ఎక్కడో కొన్ని ఊళ్ల అవతల అన్నట్లు కాకుండా తక్కువ దూరంలో ఉండాలి. ప్రతి ఊళ్లోనూ పూలూ పండ్ల మొక్కలతో ఉద్యానవనాల్ని పెంచాలి. ముఖ్యంగా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల శివార్లలో చుట్టూ ఇలాంటి ఉద్యానవనాలు ఉండటం చాలా అవసరం.
* అంతరపంటల్నీ, వైవిధ్యమైన పంటల్నీ సాగుచేయాలి. సేంద్రియ విధానాలను ఎంచుకోవాలి. ధాన్యం పండించే రైతులు పొలం మధ్య గట్ల మీద తేనెటీగలను ఆకర్షించే పెద్ద చెట్లను పెంచాలంటారు ‘ఎ వరల్డ్‌ వితౌట్‌ బీస్‌’ అనే పుస్తకం రాసిన అలిసన్‌ బెంజమిన్‌.
* ప్రభుత్వమే అక్కర్లేదు, వ్యక్తిగత స్థాయిలో మనం చేసే ప్రతి చిన్న పనీ తేనెటీగల వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రతి ఇంటా పెరట్లో, బాల్కనీల్లో పది రకాల పూల మొక్కలు పెట్టినా చాలు, తేనెటీగల ప్రయాణ దూరాన్ని తగ్గించినవాళ్లమవుతాం, ఆకలి తీర్చినవాళ్లమవుతాం.
* క్రిమి సంహారకాలు వాడని సేంద్రియ ఉత్పత్తులూ, స్థానికంగా తయారైన తేనె, ఇతర అటవీ ఉత్పత్తులూ కొనడం కూడా పరోక్షంగా తేనెటీగలకు మేలు చేయడమే.
***ఇలా కూడా చేస్తున్నారు…
* హాలీవుడ్‌ నటుడు మోర్గాన్‌ ఫ్రీమాన్‌ మిసిసిపి ప్రాంతంలో తనకి ఉన్న 124 ఎకరాల భూమిని రకరకాల చెట్లతో తేనెటీగల అభయారణ్యంగా మార్చేశారు.
* లండన్‌లోని బ్రెంట్‌ కౌన్సిల్‌ ఏడు మైళ్ల పొడవునా తేనెటీగలను ఆకట్టుకునే చెట్లను పెంచి ఒక ‘బీ కారిడార్‌’ని ఏర్పాటు చేసింది.
* విదేశాల్లో కొంతమంది బీ హోటల్స్‌ కడుతున్నారు. అంటే, అవి ఆశ్రయం పొందటానికి గూళ్లలాంటివన్నమాట. పూలమొక్కలున్న విశాలమైన పెరటి వాకిళ్లలో సన్నని రంధ్రాలుండే వెదురు, తుంగ పుల్లలతో వీటిని కడతారు.
* ఎర్త్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంగ్లండ్‌లో తేనెటీగల ప్రేమికులకోసం ఒక ఆప్‌ని కూడా తయారుచేసింది. ‘బీ ఫ్రెండ్‌ యువర్‌ గార్డెన్‌’ అనే ఈ ఆప్‌ని ఫోనులో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఆ ఫోన్‌ని పట్టుకున్నవారు తిరిగే పరిసరాల్లో తేనెటీగల కదలికల్ని రికార్డు చేస్తుంది. వారానికోసారి ఆ సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి తేనెటీగల ఉనికి గురించి వివరాల్ని అధ్యయనం చేస్తారు.
*విదేశాల్లో ఇప్పుడు చాలామంది రైతులు సొంతంగా తేనెటీగల్ని పెంచుకుని పండ్ల, కూరగాయల తోటల్లో వాటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇలా పెంచుకునే తేనెటీగల కన్నా ప్రకృతిలో స్వేచ్ఛగా పెరిగే తేనెటీగల వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి వాటి ఉనికికి హాని జరగకుండా ఎవరికి చేతనైన పని వారుచేసి ఇవాళ మనం వాటిని కాపాడుకుంటే రేపు అవే మనని కాపాడతాయి.
* * * *తరచి చూస్తే తేనెటీగల జీవితం క్రమశిక్షణకు మారుపేరులా ఉంటుంది. రాణీ ఈగ, మగ ఈగలు, శ్రామిక ఈగలు… వేటి పని వాటిదే. ఒక్కో పట్టులో 40నుంచి 80 వేల వరకూ ఉండే శ్రామిక ఈగలే దాదాపు అన్ని విధులూ నిర్వర్తిస్తాయి. ప్రత్యేకమైన ఆహారం పెట్టి రాణీ ఈగని పోషిస్తాయి. అది పెట్టే గుడ్లను పరిరక్షించి తర్వాతి తరాన్ని తయారుచేసుకుంటాయి. బయటకు వెళ్తే ఆహారం లేకుండా తిరిగి రావు. పనిలేకుండా క్షణం ఉండవు. తేనెపట్టుకు కాపలా కాస్తాయి. గదుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. ఇవన్నీ చేస్తూనే చలికాలం కోసం అవి ఆహారాన్ని దాచిపెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా దాన్ని లాక్కుంటున్న మనం, వాటిని కాపాడాల్సిన బాధ్యతా మనదేనని గుర్తిస్తేనే… అటు తీయని తేనే ఇటు తీరైన పంటలూ మన సొంతమవుతాయి!
*(మరో ప్రత్యేకతా ఉంది!
దోమలూ ఈగలూ రకరకాల వ్యాధుల్ని మోసుకొస్తాయి. సృష్టిలో ప్రతి ప్రాణీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక వ్యాధికారక క్రిములకు వాహకంగా పనిచేస్తుంది. జీవితకాలంలో అసలు ఎలాంటి వ్యాధి కారక క్రిముల్నీ (ఫంగస్‌, వైరస్‌, బాక్టీరియా) మోయని ఏకైక ప్రాణి తేనెటీగ ఒక్కటే. మూడు ప్రతిష్ఠాత్మక పరిశోధనాసంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు దీన్ని రుజువు చేశాయి. అందుకేనేమో అవి తయారుచేసే తేనె కూడా యాంటి బాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది.
**తీయని కబురే!
మన దేశంలో గతేడాది లక్ష మెట్రిక్‌ టన్నులకు పైగా తేనె తయారైందని నేషనల్‌ బీ బోర్డ్‌ తెలిపింది. హనీ మిషన్‌ పేరుతో కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. దాంతో గత పదేళ్లలో దిగుబడి 200 శాతం పెరిగింది. అడవుల నుంచీ గిరిజనులు సేకరించే తేనే కాకుండా తేనెటీగల పెంపకాన్ని వృత్తిగా చేపట్టే వారి సంఖ్య క్రమంగా పెరగటం వల్ల దిగుబడీ పెరిగింది. అయితే దేశంలో తేనె వాడకం తక్కువే కావడంతో ఉత్పత్తిలో సగం పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక బీకీపింగ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని పెట్టి వాటన్నిటినీ అనుసంధానం చేసి తేనె పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలూ జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలో ఉపాధి అవకాశాలూ కొత్త స్టార్టప్‌లు వచ్చే అవకాశాలూ బాగా పెరుగుతాయంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు.