DailyDose

కరోనాతో ఇండియాలో మరణించిన లక్ష మంది-TNI బులెటిన్

కరోనాతో ఇండియాలో మరణించిన లక్ష మంది-TNI బులెటిన్

* లక్ష ప్రాణాలు బలి. దేశంలో కరోనా మరణాల సంఖ్య. ప్రపంచంలో పది శాతం మృతులు భారత్‌లోనే…దేశంలో సాధారణ పరిస్థితుల్లో ఏటా 80 లక్షల మంది మృత్యువాత. భారత్‌లో చూస్తుండగానే కరోనాతో లక్ష మంది మరణించారు. మార్చి 11న కర్ణాటకలో తొలి మరణం సంభవించింది. అక్కడి నుంచి 205 రోజుల్లో ఆ సంఖ్య లక్షకు చేరింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కరోనా మరణాల సంఖ్య 99,773 ఉంది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు నమోదైన గణాంకాలను పరిణగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య లక్ష దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలను నమోదు చేసే వరల్డో మీటర్‌ ప్రకారం శుక్రవారం రాత్రి 11.30 సమయానికి భారత్‌లో కొవిడ్‌ మృతుల సంఖ్య 1,00,323కు చేరింది. దీన్ని శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. ప్రపంచంలో 18% కేసులున్న దేశంలో పదిశాతం మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఇప్పటికే 10 లక్షలు దాటిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రపంచలోని ప్రతి 10 మరణాల్లో భారత్‌లో ఒక మరణం చోటుచేసుకుంది. ఇప్పటివరకు సంభవించిన మొత్తం మరణాల్లో దాదాపు 64% ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే ఉన్నాయి.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 49,084 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,97,327కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1153కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,002 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,67,846కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 28,328 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 31,04,542కి చేరింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 285 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

* విజయనగరం గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్.గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 9-10 తరగతుల విద్యార్థులకు కరోనా పరీక్షలు.పరీక్షల్లో 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు డీఈవో కి లేఖ రాసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు.