Politics

అటల్ టన్నెల్ ప్రత్యేకత ఇది

అటల్ టన్నెల్ ప్రత్యేకత ఇది

ప్రపంచంలోనే అతి పొడవైన అటల్‌ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే, హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ మోదీ వెంట ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ క్షణం చారిత్రాత్మకం. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కలని సాకారం చేసిన రోజు.

అందుకే ఈ సొరంగానికి “అటల్‌ టన్నెల్‌” అని నామకరణం చేయబడింది.

ఈ సొరంగం భారత సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంద’ని ప్రధాని మోదీ అన్నారు.

దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో ఆస్ట్రియా టన్నెలింగ్‌ విధానంలో దీన్ని నిర్మించారు.

9.02 కిలోమీటర్ల అతి పొడవున నిర్మించిన ఈ టన్నెల్‌ సముద్ర మట్టానికి 3,060 మీటర్ల ఎత్తులో గుర్రపు షూ ఆకారంలో ఉంది.

ఈ టన్నెల్ ద్వారా మనాలీ నుంచి లద్దాఖ్‌లోని లేహ్‌ వరకు దాదాపు 5 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.

మనాలీ నుంచి లాహాల్-స్పితి లోయతో అనుసంధానించి నిర్మించిన ఈ సొరంగ మార్గం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు కల్పించినట్లయ్యింది.

రోజుకు 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ఈ టన్నెల్ గుండా ప్రయాణించివచ్చు.

ప్రతీ వాహనం గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు.

కీలకమైన పాక్‌, చైనా సరిహద్దులో సియాచిన్‌ గ్లేసియర్‌, అక్సాయ్‌ చిన్‌లలో మన సైనికులు నిరంతర పహరా కాస్తున్నారు.

వారికి ఆహార పదార్థాలను, ఆయుధాలను, ఇతర సామగ్రిని తీసుకెళ్లడం చాలా కష్టతరంగా ఉండేది.

ఈ నేపథ్యంలో రోహతాంగ్‌ పాస్‌ కింద సొరంగం నిర్మించాలని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్ణయించారు.

దీనికి అనుగుణంగా జూన్ 3, 2000న దక్షిణ ముఖ ద్వారానికి శంకుస్థాపన చేశారు.

అత్యంత కష్టతరమైన విస్తీర్ణాన్ని కలిగి ఉన్నఈ ప్రదేశంలో భౌగోళిక, వాతావరణ సవాళ్లను అధిగమించడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) అవిశ్రాంతంగా పనిచేసింది.

వాజ్‌పేయి చేసిన కృషికి గుర్తుగా రోహతాంగ్ టన్నల్‌కు అటల్ టన్నల్ అని పేరు పెట్టాలని కేంద్ర కేబినెట్ 2019లో నిర్ణయించింది.