Business

1000 పెట్టెల బంగారం కదిలిపోయింది-వాణిజ్యం

1000 పెట్టెల బంగారం కదిలిపోయింది-వాణిజ్యం

* రేపు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం వాడీవేవీగా జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే పరిహారం విషయంలో కేంద్రప్రభుత్వంతో విభేదిస్తున్నాయి. 21 రాష్ట్రాల్లో భాజపా, మిత్రపక్షాలు అధికారంలో ఉండటంతో రూ.97వేల కోట్ల మేరకు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అప్షన్‌ను అంగీకరించాయి. కానీ, పశ్చిమ్‌ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు మాత్రం దీనిని అంగీకరించలేదు.

* నెదర్లాండ్‌లో ఓ భారీ ఆపరేషన్‌ శనివారం ముగిసింది. ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌కు చెందిన స్వర్ణం, డబ్బును ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి సమీపంలోని హార్‌లెమ్‌ పట్టణానికి తరలించారు. ఈ తరలింపు కోసంభారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. ప్రధాన కార్యాలయంలో మార్పులు చేర్పులు చేస్తుండటంలో భాగంగా ఈ బంగారం తరలింపు జరగింది. మొత్తం 14వేల బంగారు బార్లు, 1,000 పెట్టెల నిండా బంగారు నాణేలు ఉన్నాయి.

* రష్యా తయారు చేసిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’పై మనదేశంలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సన్నద్ధమవుతోంది. దీనికి అనుమతి కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు కంపెనీ దరఖాస్తు చేసింది. స్పుత్నిక్‌ వి టీకాను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. అన్ని అనుమతులు వచ్చాక డాక్టర్‌ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్‌ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ తగిన సన్నాహాలు చేపట్టింది. రష్యాలో ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

* వ్యవసాయానికి బడ్జెట్‌ కేటాయింపులు భారీగా పెరిగాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ అన్నారు. 2009-10 యూపీఏ హయాంలో రూ.12వేల కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ ప్రస్తుతం 11 రెట్లు పెరిగి 1.34 లక్షల కోట్లకు చేరిందన్నారు. రైతుల పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న నిబద్ధతకు ఈ అంకెలే నిదర్శనమన్నారు.

* ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది.
*** అప్లై చేయండి ఇలా..
* పీవీసీ ఆధార్‌ కార్డు అప్లయ్‌ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
* గెట్‌ ఆధార్‌ అనే చోట ఓర్దెర్ Aadhaar PVC Card అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.
* అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్‌ కార్డు తాలూకా వర్చువల్‌ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ అయినా ఎంటర్‌ చేయొచ్చు.
* క్యాప్చా కోడ్‌, మీ ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
* మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.
* ఆ తర్వాతి పేజీలో మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
* పేమెంట్‌ పేజీలోకి వెళితే మీకు అక్కడ క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ ఆప్షన్స్‌లోకి వెళితే పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పేను ఉపయోగించి పేమెంట్‌ చేయొచ్చు.
* పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు ఓ రసీదు వస్తుంది. అందులో ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం సేవ్‌ చేసి పెట్టుకోండి.
* పది రోజుల్లో మీ అడ్రస్‌కు కొత్త ఆధార్‌ కార్డు వెళుతుంది. ఆధార్‌ కార్డు స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను ఉపయోగించి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో గెట్‌ ఆధార్‌ విభాగంలో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.