DailyDose

హైదరాబాద్‌లో మరోసారి భూకంపం-తాజావార్తలు

హైదరాబాద్‌లో మరోసారి భూకంపం-తాజావార్తలు - Earthquake In Borabanda Hyderabad - Breaking News

* హైదరాబాద్ బోరబండలో మరోసారి ప్రకంపనలు… ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలురెండ్రోజుల కిందట హైదరాబాద్ లోని బోరబండ, రహ్మత్ నగర్, సైట్-3 ఏరియాల్లో భూమి కంపించడం, భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కూడా అదే తరహాలో మరోసారి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రెండ్రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే ఈసారి మరింత బిగ్గరగా శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక భీతావహులయ్యారు.కాగా, శుక్రవారం రాత్రి పొద్దుపోయాక బోరబండ, ఇతర ప్రాంతాల్లో భూమి కంపించడం తీవ్ర కలకలం రేపింది. భారీ శబ్దాలకు భయపడిపోయిన ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపైనే గడిపారు. 2017 అక్టోబరులోనూ ఇలాంటి శబ్దాలే వచ్చాయని స్థానికులు అంటున్నారు.

* భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదివారం హాథ్రస్‌ బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. భారీ ఎత్తున భీమ్‌ ఆర్మీ సభ్యులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన బాధితుల స్వగ్రామం బూల్‌గదికి చేరుకున్నారు. హాథ్రస్‌ అత్యాచార ఘటనపై బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘బాధిత కుటుంబానికి వై కేటగిరీ భద్రత కల్పించాలి. లేదంటే వారిని నా ఇంటికి తీసుకెళ్తాను. వారికి ఇక్కడ భద్రత ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే ఈ కేసు దర్యాప్తు జరిపించాలి’ అని డిమాండు చేశారు.

* గూగుల్‌ జులై, సెప్టెంబరు నెలల్లో 34 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. వీటిలో జోకర్ అనే మాల్‌వేర్‌ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది నెలలుగా ప్లేస్టోర్‌లోని యాప్‌లే లక్ష్యంగా జోకర్ మాల్‌వేర్‌ దాడి చేస్తోంది. మొదటగా జులై నెలలో ప్లేస్టోర్‌లోని 11 యాప్‌లపై, సెప్టెంబరు మొదటి వారంలో ఆరు యాప్‌లలో ఈ మాల్‌వేర్‌ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా మరో 17 యాప్‌లలో జోకర్ ఉన్నట్లు తెలియడంతో వాటిని కూడా ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు.

* శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం ఘంటామఠం పునర్‌ నిర్మాణ పనుల్లో మరోసారి నాణేలు బయటపడ్డాయి. ఆదివారం నిర్మాణ పనులు చేస్తుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి. సమాచారం అందుకున్న ఆలయ ఈవో కె.ఎస్‌. రామారావు, తహసీల్దార్‌ రాజేంద్రసింగ్‌, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతంతో దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తరచూ జరుగుతున్న సామూహిక అత్యాచారాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన భాజపా ఎమ్మెల్యే అత్యాచారాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామరాజ్యం కొనసాగుతోందని ప్రజలు భావిస్తున్నప్పటికీ అత్యాచారాలు ఎందుకు కొనసాగుతున్నాయి అని ఓ సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సమాధానమిస్తూ.. ‘కూతుళ్లకు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లి,తండ్రిపై ఉంది. వారికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి’ అని అన్నారు. ‘ఎమ్మెల్యేనే కాకుండా నేను ఓ ఉపాధ్యాయుడిని కూడా. అలాంటి సంఘటనలు సంస్కారంతోనే తగ్గుతాయి. కానీ ప్రభుత్వ పాలనతో కాదు. ప్రభుత్వం మహిళలను రక్షించేందుకు కట్టుబడి ఉంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు అమ్మాయిలకు సంస్కారం నేర్పాలి. ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు’ అని అన్నారు. ప్రస్తుతం ఆ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

* జమ్మూకశ్మీర్‌లోయలో ఉగ్రమూలాలను చెరిపేసేందుకు భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నాలకు కొత్త కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉగ్రవాదులు కొత్త ఎత్తులు వేస్తూ మన బలగాలకు సవాళ్లు విసురుతున్నారు. తమ ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున వర్చువల్‌ సిమ్‌ కార్డులు వినియోగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ముఠా నాయకులతో అనుసంధానమై దేశంలో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వీటి వినియోగం భారీగా పెరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

* తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఫోన్లో పరామర్శించారు. కారు ధ్వంసం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జరిగిన ఘటనను చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామనిపిస్తోందని లోకేశ్‌ మండిపడ్డారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వెల్లిబుచ్చారు. నిన్న సబ్బం హరి నివాసంపై, ఇవాళ పట్టాభి కారుపై దాడి సిగ్గు చేటన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని లోకేశ్‌ నిలదీశారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ సైతం పట్టాభికి ఫోన్‌ చేసి దాడి వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పట్టాభి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలు పగులగొట్టిన విషయం తెలిసిందే. వైకాపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడారని పట్టాభి ఆరోపిస్తున్నారు.

* పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాథ్రస్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోల్‌కతాలోని బిర్లా ప్లానిటోరియం నుంచి సెంట్రల్‌లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ఇందులో టీఎంసీ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ సహా ఇతర వామపక్షాలు సైతం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. భాజపా దళితులను కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనూ దళితుల ఇళ్లకు వెళ్లి వారి ఇంట్లో తినకుండా బయటి నుంచి తెప్పించుకుని తిని వారి మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఓట్లకు మాత్రం వారిని ఉపయోగించుకుని ఎన్నికల తర్వాత దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. హాథ్రస్‌ ఘటనపై ప్రస్తుతం తనకు యూపీకి బయలుదేరి వెళ్లాలనిపిస్తోందన్నారు. శుక్రవారం టీఎంసీ ఎంపీలను హాథ్రస్‌ పంపగా.. పోలీసులు వారిని అడ్డుకోవడమే కాకుండా.. అందులో మహిళా ఎంపీపై చేయి చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కాకినాడ సెజ్‌ కొనుగోలుపై కేంద్రం తక్షణమే స్పందించి కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్‌ మౌనం వీడాలన్నారు. జగన్‌కు సంబంధం లేకుంటే రైతులకు ఎందుకు పరిహారం ఇప్పించడం లేదని ప్రశ్నించారు. ఎకరానికి రూ.10వేల చొప్పున 10 వేల ఎకరాలకు అదనపు పరిహారం కింద రూ. 1000 కోట్లు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయడంపై స్థానికుల వ్యతిరేకత ఉన్నందున ఆ ఆలోచన విరమించుకోవాలన్నారు. దీనివల్ల కాలుష్య సమస్యతోపాటు మత్స్యకారులు అనేక మంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదముందన్నారు. జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ నెలకొల్పే పోర్టుకు అటుఇటూ మత్స్యకారుల వేటకు వీలుగా బ్యాడ్జెట్స్‌, జట్టీలు ఏర్పాటు చేయాలన్నారు. హేచరీస్‌పై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని సూచించారు. ఆరబిందో ఇన్‌ఫ్రా ఆదాయంలో స్థానికులకు వాటా ఇవ్వాలన్నారు. బినామీ లావాదేవీలపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ రైతులు ‘ఖేతీ బచావో యాత్ర’ చేపట్టారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేడు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెగా జిల్లా బధ్ని కలాన్‌లో యాత్ర మొదలయ్యింది. బధ్ని కలాన్‌ నుంచి జత్‌పురా వరకు సాగే ‘ఖేతీ బచావో యాత్ర’లో భాగంగా నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. దాదాపు 50కి.మీ మార్గంలో ఈ ట్రాక్టర్‌ ర్యాలీ సాగనుంది. ఈ సాయంత్రం జత్‌పురాకు చేరుకున్న అనంతరం, అక్కడ నిర్వహించే రైతు బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం లుథియానాలోని జత్‌పురాలో తొలిరోజు యాత్ర ముగుస్తుంది. పంజాబ్‌ నుంచి దిల్లీ వరకు మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.

* వీఎంఆర్డీఏ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకినా తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో సమస్యలు రావడంతో శ్రీనివాస్‌ను మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం సాయంత్రం ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రజల సందర్శనార్ధం విశాఖలోని పెదవాల్తేర్‌ డాక్టర్స్‌ కాలనీలోని నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ తెలిపారు.

* దేశమంతటినీ కుదిపేస్తున్న హాథ్రస్‌ హత్యాచార ఘటనపై బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నేడు బుల్‌గడీ గ్రామానికి చేరుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించినప్పటికీ.. సిట్‌ దర్యాప్తును కొనసాగిస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధిత కుటుంబం సీబీఐ విచారణకు కూడా అంగీకరించడం లేదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేస్తోంది.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ రైతులు ‘ఖేతీ బచావో యాత్ర’ చేపట్టారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేడు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెగా జిల్లా బధ్ని కలాన్‌లో యాత్ర మొదలయ్యింది. బధ్ని కలాన్‌ నుంచి జత్‌పురా వరకు సాగే ‘ఖేతీ బచావో యాత్ర’లో భాగంగా నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. దాదాపు 50కి.మీ మార్గంలో ఈ ట్రాక్టర్‌ ర్యాలీ సాగనుంది.

* ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన సమరం జరుగుతోంది. షార్జా వేదికగా హైదరాబాద్, ముంబయి జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు.

* దేశంలోని అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని.. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కారణంగా వలసలు వస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నగరాల్లో పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు మంచి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ అంబర్‌పేట డీసీపీ కార్యాలయంలో సీసీ టీవీ కెమెరాలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. బ్రిటీష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను మార్చేందుకు ప్రధాని మోదీ యోచిస్తున్నారని చెప్పారు.

* వీఎంఆర్డీఏ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతిచెందారు.

* ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది.

* కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్‌), పరీక్షించడం (టెస్టింగ్‌), వైద్యం అందించడం (ట్రీట్‌మెంట్‌) వంటి వాటిని పక్కాగా అమలు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. పరీక్షలు ఎక్కువగా చేసి కరోనాను త్వరగా గుర్తించడం వల్ల మరణాల రేటును తగ్గించగలిగామని కేంద్రం వెల్లడించింది. అక్టోబర్‌ 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు 7.90 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

* పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం చేసేందుకు పాకిస్థాన్‌ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన సీజీటీఎన్‌ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ షెన్‌ సీవే ట్విటర్‌లో ఒక వీడియోను పంచుకొన్నాడు. 52 క్షణాల నిడివి ఉన్న ఈ వీడియోలో 0.05 సెకన్ల వద్ద ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఏమాత్రం చైనీయుడులాలేడు. గడ్డం పెంచుకొని పొడవుగా భిన్నంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరూ అనే విషయాన్ని మాత్రం షెన్‌ ప్రస్తావించలేదు.

* కొవిడ్‌ మహమ్మారి నుంచి రక్షణ కల్పించే సరికొత్త టీషర్టులు, ఔషధ ద్రావణాన్ని మన దేశానికి చెందిన రెండు అంకుర సంస్థలు అభివృద్ధి చేశాయి. తక్కువ ధరకే అవి విపణిలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇ-టెక్స్, క్లెన్స్‌టా అనేవి ఐఐటీ దిల్లీలో పురుడు పోసుకున్న రెండు అంకుర సంస్థలు. ‘ఇ-టెక్స్‌’ యాంటీ వైరల్‌ ఫ్యాబ్రిక్‌తో తాజాగా టీ-షర్టులను తయారు చేసింది. వాటి ఉపరితలాన్ని తాకితే కరోనా వైరస్‌ సహా ఏ సూక్ష్మజీవులైనాసరే అంతమవుతాయి. 30 సార్లు ఉతికిన తర్వాత కూడా యాంటీ వైరల్‌ సామర్థ్యాన్ని కోల్పోకపోవడం ఈ టీషర్టుల ప్రత్యేకత.

* కరోనా వైరస్‌ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు నేను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్రంప్ పేర్కొనగా, మరో 48గంటలు గడిస్తే కానీ ఏ విషయమైనా తెలుస్తుందని అతని సన్నిహితవర్గాలు ప్రకటించాయి. అయితే, అమెరికా చరిత్రను చూస్తే మాత్రం చాలా సార్లు అధ్యక్షుల ఆరోగ్యంపై వైట్‌హౌజ్‌ అసత్యాలనే బయటకు చెప్పినట్లు వెల్లడవుతోంది.

*దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్‌ఈ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.20 వరకు సీశాట్‌ రెండో పేపర్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం దేశ వ్యాప్తంగా 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుంచి 30,199 మంది, తెలంగాణ నుంచి 52,924 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో 115 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత మే 31న పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. నెల రోజుల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.