జర్మనీలో లాంఛనంగా వేడుకలు ప్రారంభం
పీవీ బహుముఖీణ ఆవిష్కరణ ప్రభుత్వ లక్ష్యం
– శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేకే
– జర్మనీలో పీవీ ప్రసంగాలు అద్భుతం: చెన్నమనేని రమేశ్
– ఆధునిక చాణక్యుడికి భారతరత్న ఇవ్వాలి: బిగాల మహేశ్
– కళలు, సాహిత్యంపై పీవీకి ప్రత్యేక ఆసక్తి: పీవీ కశ్యప్
అద్భుతాలు సాధించిన మహానుభావుల్లో భారత పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. పీవీ నరసింహారావును బహుముఖీణంగా, 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, ప్రత్యేక శ్రద్ధతోనే ఉత్సవాలు చేపట్టినట్టు వివరించారు. జర్మనీలో పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేకే మాట్లాడారు. పీవీ నరసింహారావు అమూల్యమైన అముద్రిత వ్యాసాలు, గ్రంథాల్ని ప్రచురించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో ఉత్సవాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయంగా వివిధ రంగాల ప్రముఖుల కోణంలో పీవీని ఆవిష్కరిస్తూ “కాఫీ టేబుల్ బుక్” తీసుకొస్తామని వెల్లడించారు. దౌత్యపరంగా దేశానికి అద్భుతమైన బాటలు వేశారని వివరించారు.
కార్యక్రమంలో జర్మనీ నుంచి పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మాట్లాడుతూ… పీవీకి జర్మనీతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. జర్మనీ పర్యటనల్లో పీవీ నరసింహారావు ప్రసంగాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయని తెలిపారు. జర్మనీ పర్యటనల సందర్భంగా సంస్కృతం, అంతర్జాతీయ నాగరికత, జర్మనీ తత్వవేత్తల గురించి పీవీ చేసిన ప్రసంగాలు సుమారు 100 పేజీల వరకు ఉంటాయని చెప్పారు. వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని తెలిపారు. జర్మనీలో పీవీ విగ్రహం ఏర్పాటు, ఏదైనా ప్రధాన నగరంలో ఓ వీధికి పీవీ పేరు పెట్టేలా అక్కడి ప్రభుత్వంతో తాను సంప్రదింపులు చేస్తానని అన్నారు.
జర్మనీలో పీవీ శత జయంతి ప్రారంభోత్సవానికి హోస్ట్ గా వ్యవహరించిన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు బిగాల మహేశ్ మాట్లాడుతూ…. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా… ఆయా ప్రాంతాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ… పీవీ ఖ్యాతిని చాటి చెప్పడమే ధ్యేయమని అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అన్నారు. ఈ ఆకాంక్షకు మద్దతు కూడగట్టేందుకు ఆన్ లైన్ పిటిషన్ ద్వారా చైతన్యం కలిగిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జర్మనీలో నివాసముంటున్న పలువురు తెలుగు వారు పాల్గొన్నారు. పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పీవీ మనవడు కశ్యప్ మాట్లాడుతూ… పీవీ ఓ కర్మయోగి అని అన్నారు. రాజకీయాలు, సాహిత్యం, కళలు, క్రీడల పట్ల ఆసక్తి కలిగిన పీవీ బహుమఖ ప్రజ్ఞాశాలి అని కీర్తించారు. పీవీకి అంతర్జాతీయ సాహిత్యం పట్ల ఉన్న అభిరుచిని… ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్పానిష్ సహా వివిధ భాషల నుంచి ఇంగ్లిష్ లోకి అనువాదమైన గ్రంథాలతో పాటు మూల గ్రంథాలు సైతం ప్రత్యేకంగా తెప్పించుకుని చదివేవారని తెలిపారు. పీవీకి సంబంధించిన రచనల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా స్థితప్రజ్ఞత ప్రదర్శించే పీవీ తీరు… స్ఫూర్తిదాయకమని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.
ఈ కార్యక్రమములో తెరాస NRIజర్మనీ ప్రెసిడెంట్ అరవింద్ గుంత , మన తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ మేసినేని, శ్రీనివాస్ ఉమ్మెంటుల, గిరీష్ బండి, అనిల్ కుందేటి, సుజిత్ అన్నమనేని, వినయ్ రామాయంపేట పీవీ నరసింహారావు గారికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా జర్మనీలోని పలు తెలుగు సంఘాలు మరియు వివిధ భారత దేశా సంఘాలు ఆన్లైన్లో పాల్గొని వీక్షించారు. పీవీ శతజయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.