అక్కడ ప్రభుత్వం ఉండదు… ప్రజలే ఉంటారు! అదో దీవి… అంతా సరస్సుతోనే నిండి ఉంటుంది! మరి జనం ఉండేదెక్కడ? వాళ్లు చేసేది ఏంటి?
ఈ గమ్మత్తయిన దీవిలో మొత్తం సరస్సే. ఆ సరస్సుకి సముద్రానికీ మధ్యలో పగడపు దిబ్బల వల్ల ఏర్పడిన ఎత్తయిన ప్రాంతం ఉంటుంది. దాని మీదే అక్కడక్కడా భూభాగమూ ఉంటుంది. అక్కడే కొంత మంది జనం నివసిస్తుంటారు. పైగా వాళ్లంతా చుట్టాలే.
* ఈ విచిత్రమైన దీవి ఎక్కడుందంటే పసిఫిక్ మహా సముద్రంలో. న్యూజీలాండ్‌కు 3200 కిలోమీటర్ల దూరంలో.
* ఇంతకీ ఈ దీవి పేరేంటో చెప్పలేదు కదూ. పాల్మర్‌స్టోన్ ఐలాండ్.
* దీని మధ్యలో అంతా మరో పెద్ద సరస్సు నిండిపోయి ఉంటుంది. ఏదో చెరువుకు గట్టు ఉన్నట్టు ఇక్కడి సరస్సుకు చుట్టూ గట్టులా ఈ దీవి మొత్తం దర్శనమిస్తుంది.
* దానిలో అక్కడక్కడా నివాసయోగ్యమైన భూభాగాలున్నాయి. అంటే ఆ దీవిలో మళ్లీ బుల్లి ద్వీపాలన్నమాట. వాటిలో ఇప్పుడు 62 మంది నివసిస్తున్నారు.
* బయటి ప్రపంచానికి అత్యంత దూరతీరాల్లో ఉన్న దీవిగా దీనికి గుర్తింపు ఉంది. ఇది 11కిలోమీటర్ల పొడవుంటుంది.
* ఇక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు.
* 1777లో కెప్టెన్ కుక్ అనే ఆయన మొదట ఈ దీవిలో ప్రవేశించారు. దీనికి హెన్రీ టెంపుల్ అనే పేరు పెట్టారు. అయితే ఆ పేరు ఇప్పుడు వాడుకలో లేదు.
**చుట్టాల దీవి!
* ఇది జరిగిన దాదాపు శతాబ్దం తర్వాత వడ్రంగి అయిన విలియమ్ మార్స్‌టర్ అనే ఆయన ఈ దీవిని చూసి ఇక్కడి అందాలకు ముగ్ధుడైపోయాడు. ఆయన బ్రిటిషర్. తన భార్య, పిల్లలు, బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అలా వారి కుటుంబానికి చెందిన వారే ఇప్పుడు ఇక్కడో కమ్యునిటీలా ఏర్పడ్డారు. వారే 62 మంది వరకూ ఉన్నారు.
* వారంతా అక్కడి చిన్న దీవుల్ని తలా ఒకటన్నట్టుగా పంచుకున్నారు. వాళ్లకు సొంత కౌన్సిల్ ఉంది. అయితే వాళ్లు ఇప్పటికీ బ్రిటిషర్లమనే భావిస్తారు. ఆ జండానే అక్కడ ఎగరేస్తారు. కానీ నిజానికి ఈ భూభాగం న్యూజీలాండ్ పరిధిలోకి వస్తుందట.
* ఇప్పుడు అక్కడ ఇళ్లు, స్కూలు, చర్చిలాంటివన్నీ ఉన్నాయి. అయితే దుకాణాలేం ఉండవు. అక్కడ సహజంగా దొరికే వాటితోనే వీరు జీవిస్తుంటారు. రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి.
* ఇక్కడ తాగడానికి మంచి నీళ్లే దొరకవు. అందుకే వాన నీరును సేకరించి వాటినే తాగుతారు.
* ఏడాదికి రెండు సార్లు వస్తువుల నౌక ఈ దీవిని చేరుతుంది. బియ్యం, ఇంధనంలాంటివి తీసుకొస్తుంది. అలా బయటి నుంచి వచ్చే వస్తువుల్ని కొనుక్కోవాలనుకున్నప్పుడే వీరికి డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం వీరు ఇక్కడి పేరెట్ ఫిష్‌లను ఎండబెట్టి, లేదా గడ్డకట్టించి అదే ఓడలో ఎగుమతి చేస్తారు.
* డజను వరకూ పర్యటక బోట్లూ ఇక్కడికి వచ్చి వెళుతుంటాయి. వారికి రిసార్టుల్లాంటివేవీ ఇక్కడుండవు. ఈ కుటుంబ సభ్యులే స్వాగతం పలుకుతారు. వీళ్ల ఇళ్లలోనే ఆతిథ్యం ఇచ్చేస్తారు. భలే చుట్టాల దీవే!
ఆ దీవిలో ప్రజలే ఉంటారు. ప్రభుత్వాలు ఉండవు.
Related tags :