వల్లభనేని వంశీతో నేను కలిసి పని చేయటం జరగదు – యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాక వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తున్నా సరే అంతగా ఫలించడం లేదు అనే చెప్పాలి. ఇక తాజాగా నియోజకవర్గంలో మరో పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలని భావించినా సరే పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు.
ఈ వివాదంపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. గన్నవరం వైసీపీలో నాకు గ్రూపులు లేవు అని ఆయన అన్నారు. వంశీతో కలిసి పని చేయను అని సీఎం జగన్ కి చెప్పేసాను అని చెప్పుకొచ్చారు. వంశీ నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. పార్టీని బలహీనం చేయటం ఇష్టంలేకే నేను గన్నవరం వెళ్ళటం లేదని ఆయన పేర్కొన్నారు. వైసీపీ వంశీకి అద్దె ఇల్లు నాకు సొంత ఇల్లని ఆయన అన్నారు.
వైసీపీ నా స్వస్థలం..నా సొంత పార్టీ అని పేర్కొన్నారు. వంశీ వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పలు గ్రామాల్లో మా పార్టీ కార్యకర్తలను నా జన్మదిన వేడుకలు జరపవద్దని వంశీ ఇబ్బంది పెట్టారని విమర్శించారు. వంశీతో నేను కలిసి పని చేయటం జరగదని స్పష్టం చేసారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎమ్మెల్యే మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు.