* అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం పసిడి ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై స్ప్షష్టత కోసం ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించడంతో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయని బులియన్ నిపుణులు పేర్కొన్నారు. పసిడిలో తాజా కొనుగోళ్లు మందగించడంతో ధరలు దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం 140 రూపాయలు దిగివచ్చి 50,430 రూపాయలు పలికింది. కిలో వెండి 33 రూపాయలు తగ్గి 61,112 రూపాయలుగా నమోదైంది. అమెరికా డాలర్ ఒడిదుడుకులకు లోనవడం, తాజా ఆర్థిక ఉద్దీపన చర్యలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలతో పసిడి ధరల్లో అనిశ్చితి నెలకొందని జియోజిత్ కమోడిటీ హెడ్ హరీష్ వీ పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1900 డాలర్లకు తగ్గింది.
* మేనేజ్డ్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్(ఎమ్‌ఎస్‌ఐపీ)ను ఎంపిక చేసే విషయంలో జారీ చేసిన టెండర్ అంతా పారదర్శకంగా జరిగిందని ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే చేసినట్లు వివరించింది. ఎంపిక ప్రక్రియపై ఐబీఎమ్, విప్రో, డెల్ కంపెనీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సాంకేతిక పరిశీలన అనంతరం మిగతా కంపెనీలతో పోలిస్తే ఎక్కువగా హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్(హెచ్‌పీఈ)కు 100కు 98 స్కోరు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాకుండా హెచ్‌పీఈకి అనుమతి పత్రాన్ని సైతం జారీ చేసినట్లు ఈ అంశంతో సంబంధమున్న వ్యక్తుల సమాచారం. కాగా, తాజా పరిణామాలపై స్పందించడానికి ఏమీ లేదని విప్రో పేర్కొనగా.. దీనిపై వ్యాఖ్యానించడానికి డెల్ నిరాకరించింది. ఐబీఎమ్ స్పందించలేదు.
* ఈ నెల 7వ తేదీన టీసీఎస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు భేటీ అయి ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తారని కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. దీంతోపాటు 7వ తేదీన జరిగే మీటింగ్‌లో సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసిక ఫలితాలకు తుదిరూపు ఇవ్వనున్నారు. వీటిల్లో ఈక్విటీ వాటాదార్లకు రెండోసారి మధ్యంతర డివిడెండ్ అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది.
* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అవుతారన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఆ ప్రభావంతో మన మార్కెట్లూ లాభాల్లో కొనసాగాయి. దీనికి తోడు ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. దీంతో నిఫ్టీ 11,500 మార్కు దాటింది. ఆరంభ లాభాలు కోల్పోయినప్పటికీ వరుసగా మూడో రోజు మాన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
* మారటోరియం కేసులో విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఆర్‌బీఐకు వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్స్, సర్య్కూలర్ల జారీ వంటి అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం కేబినెట్ నోట్‌ను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించి ఆమోదం తీసుకొంది. ప్రభుత్వ అఫిడవిట్‌లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్, బిల్డర్లను పట్టించుకోలేదన్న విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.