Food

పులస ఆచూకీ లేదు

పులస ఆచూకీ లేదు

పుస్తెలమ్మైనా పులస కూర తినాలని మాంసాహారప్రియులు లొట్టలేస్తుంటారు. పులసల సీజన్‌ వచ్చిందంటే నాలుగు డబ్బులు సంపాదించవచ్చని మత్స్యకారులు కొండంత ఆశతో గోదావరి వంక చూస్తుంటారు. పులస చిక్కితే ఆ రోజు పండగే. అలాంటి చేప ఈ సీజన్‌లో వలలకు చిక్కడం లేదు.
*గోదావరి నదిలోకి ఎర్ర నీరు వచ్చింది మొదలుకుని సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ వచ్చే పులసల కోసం జనం ఎగబడుతుంటారు. ఈసారి గోదావరిలో పులసల లభ్యత బాగా పడిపోవటంతో వాటి ధర పెరిగిపోయింది. ఎవరికైనా ఒకటి, రెండు చేపలు చిక్కితే రూ.7 వేలు, రూ.8 వేల ధర పలుకుతున్నాయి.
**ఇవీ కారణాలు
కిలో బరువుగల ఆడచేప లక్ష నుంచి రెండు లక్షల గుడ్లు పెడుతుంది. అవి పిల్లలుగా మారి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. గుడ్డు పిల్లగా మారడానికి 48 నుంచి 72 గంటల వ్యవధి పడుతుంది. రానురాను వీటి ఉత్పత్తి పడిపోతోంది. జల కాలుష్యం, సముద్రం ఒడ్డు నుంచి బాగా లోపలకు వెళ్లి పెద్దపెద్ద వలలతో మత్స్య సంపదను వేటాడే సమయంలో ఇవి సాధారణ రోజుల్లో కూడా సముద్రంలో లభిస్తున్నాయి. సంతానోత్పతికి గోదావరిలోకి వచ్చే చేపల సంఖ్య తగ్గిపోవటం, గోదావరిలో చెనల చేప వలలకు చిక్కటం అవి అమ్ముడుపోవటం ఇలా వివిధ కారణాలతో వాటి ఉత్పత్తి పడిపోతోంది.
**ఇదీ పరిస్థితి…
గత అయిదేళ్లకాలంగా గోదావరి పులసల లభ్యత తగ్గుతూ వస్తోంది. జులై నెలలో వరద నీరు తగులుతుంది. అప్పటి నుంచి అక్టోబరు వరకు ఈ చేపలు లభిస్తాయి. జులై నుంచి అక్టోబరు వరకు అంటే సుమారు 120 రోజుల్లో 40 రోజులు వరకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన 80 రోజుల్లో ఈ చేపలు వేటాడేందుకు అనువుగా ఉంటుంది. కోనసీమ వ్యాప్తంగా పులస సీజన్‌లో సుమారు 500 నుంచి 600 మర పడవల్లో మత్స్యకారులు వేట సాగిస్తారు. అంటే సుమారు నిత్యం వెయ్యి నుంచి 1,200 మంది ఈ వేటలో నిమగ్నమవుతారు. పులస దొరికితే ఆ రోజు మత్స్యకారుడి పంట పండినట్టే.
**అయిదేళ్లలో ఇలా…
2016లో కోనసీమలో సుమారు ఆరువేల పులసలు దొరికితే ఏటా సుమారు 20 శాతం వీటి లభ్యత పడిపోతూ వస్తోంది. 2017లో 4,800, 2018లో 3,840, 2019లో 3,072 చేపలు చిక్కినట్టు ఒక అంచనా. ఆ లెక్కన తీసుకుంటే ఈ సీజన్‌లో 2,400 వరకు చేపలు దొరకాలి. ఇంతవరకు సుమారు 1,500 చేపలు దొరికుంటాయి. ఈ చేపలు ఎక్కువగా చిక్కినప్పుడు కిలో రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ధర పలికేది. చేపల ఉత్పత్తి పడిపోవటంతో వీటిధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ సీజన్‌లో కిలో చేప రూ.5 వేలు నుంచి రూ.5,500 ధర పలుకుతోంది. మలికిపురం మండలం దిండివద్ద రెండు కిలోలు బరువుకు మించి ఉన్న రెండు పులసలు రూ.31 వేలు, పాశర్లపూడి వద్ద రెండున్నర కిలోలు బరువున్న ఉన్నవి రూ.22 వేలకు కొనుగోలు చేశారు. పి.గన్నవరంలో 1,300 నుంచి 1,500 గ్రాములు బరువుఉన్న చేప రూ.8 వేలు నుంచి రూ.8,500 వరకు ధర పలికాయి.