చంద్రుడిపై నీరు ఉందో లేదో తేల్చేందుకు ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు భారత్‌కు చెందిన చంద్రయాన్-1 గతంలోనే గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు నీరు.. మంచు రూపంలో ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) భావిస్తోంది. అయితే ఈ మంచునే ఇంధనంగా మార్చాలని జపాన్‌కు చెందిన స్పేస్ ఏజెన్సీ జాక్సా నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. నాసాతో కలిసి ఇప్పటికే చంద్రుడి కక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని జాక్సా ప్రణాళికలు వేసింది. పనిలోపనిగా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ ఇంధన కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది. చంద్రుడిపై అన్వేషణ నిమిత్తం చేసే అంతరిక్ష యాత్రకు ఇంధనాన్ని భూమి నుంచి తీసుకెళ్లాల్సి వస్తోందని, దీని వల్ల ఖర్చు పెరుగుతోందని జాక్సా చెబుతోంది. ఈ ఖర్చు తగ్గించుకోవడం కోసమే 2035 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇంధనం తయారు చేసే ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. అక్కడ మంచు రూపంలో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులను సోలార్ సెల్‌ను ఉపయోగించి వేరు చేసి మళ్లీ కలపడం ద్వారా ఇంధనాన్ని తయారుచేయనుంది. దీంతో చంద్రుడి కక్ష్యలో ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుడిపైకి వ్యోమగాముల ప్రయాణానికి అయ్యే ఇంధనం అక్కడే లభిస్తుందని జాక్సా వెల్లడించింది. మరి ఇది ఎంత వరకు విజయవంతమవుతుందో చూడాలి.
నాసా-జాక్సా కలిసి చంద్రుడిపై ఫ్యాక్టరీ
Related tags :