వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌పై ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు.. వాటికి సమాధానాలు.
—————————————-
1) ఆన్‌లైన్ చేసుకోవడానికి
ఎవరిని సంప్రదించాలి?ఎంత ఫీజు కట్టాలి?
ఇంటిని ఆన్‌లైన్ చేసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిపన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది.
2). ఆన్‌లైన్ కోసం ఎలాంటి
డాక్యుమెంట్లు కావాలి.
వాటిని చూపిస్తే సరిపోతుందా?
ఇంటిని ఆన్‌లైన్ చేయడానికి అధికారి వచ్చినప్పుడు యాజమాని ఆధార్‌కార్డుతో పాటు వ్యవసాయ భూముల పట్టాదారు పాసుపుస్తకం చూపించాలి. ఇంటినంబర్/ పట్టాదారు పాసుబుక్ వివరాలు యాప్‌లో నమోదు చేయగానే మీకు సంబంధించిన వివరాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఎలాంటి డాక్యుమెంట్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారు ఆధార్‌కార్డుతో పాటు ఉపాధి హామీ కార్డు/ రేషన్ కార్డు/ పెన్షన్ కార్డు/ జీరో అకౌంట్‌లలో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు.
3). ఇంటిని కొలిచేటప్పుడు
యజమాని తప్పని సరిగా
ఉండాలా?
యజమాని ఉంటే వివరాలు సమగ్రంగా నమోదుచేయడానికి వీలవుతుంది. ఎలాంటి అనుమానాలు కలిగినా వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. కచ్చితంగా రాలేని పరిస్థితి ఉంటే బంధువులు లేదా అద్దెకు ఉంటున్నవారి సహాయంతో వివరాలు అందజేయాలి.
4). ఇల్లు లేకుండా స్థలం మాత్రమే
ఉంటే దాన్ని ఆన్‌లైన్
చేస్తారా? దానికోసం ఎలాంటి
డాక్యుమెంట్లు కావాలి?
ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్ చేయరు. భవిష్యత్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆన్‌లైన్‌లోకి ఎక్కించి పాస్‌బుక్ జారీ చేస్తారు. అక్రమ లేఅవుట్, వ్యవసాయ భూమిలో ప్లాట్ కొంటే దాన్ని ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇండ్లను మాత్రమే ఆన్‌లైన్ చేస్తున్నారు.
5). యాజమాని చనిపోయి ఉంటే
వారసులందరి పేర్లు నమోదు
చేసుకుంటారా? వారిలో
ఒక్కరే గ్రామంలో ఉంటూ
మిగిలిన వారు వేరే ప్రాంతాల్లో
ఉంటే ఎలా?
రికార్డుల్లోఉన్న ఇంటి యాజమాని మరణిస్తే అతడి భార్య లేదా పిల్లల పేరుమీద ఆన్‌లైన్ చేస్తారు. వారసులు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని అందరికీ జాయింట్ ఓనర్‌షిప్ ఇస్తారు. వారసుడు ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకున్నాకే ఆన్‌లైన్ చేస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్తిని ఒక్కరి పేరు మీదే రాయాలని డిక్లరేషన్ ఇస్తే ఆ ఒక్కరి పేరుమీద చేస్తారు. వారసులం అని నిరూపించుకోవడానికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.
6). ఆస్తులను ఎందుకు ఆన్‌లైన్
చేస్తున్నారు. కార్యక్రమం
ముఖ్య ఉద్దేశం ఏమిటి?
వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నట్టే.. వ్యవసాయేతర ఆస్తులకూ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్లతోపాటు, ఇతర ఖాళీస్థలాలపై యాజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించడంతోపాటు వాటికి రక్షణ కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. పంచాయతీ/ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఉన్న రికార్డు ఆధారంగా ఇండ్లను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇల్లు ఎవరిది? ఎవరి నుంచి ఎవరికొచ్చింది? తర్వాత వారసులెవరు? తదితర వివరాలను ఆన్‌లైన్‌చేసి.. వాటిని మెరూన్ రంగు పాస్‌బుక్‌లో ము ద్రించి ఇస్తారు. దీంతో ఏండ్లుగా ఉన్న ఆస్తి వివాదాలకు చెక్ పడటంతోపాటు, భవిష్యత్తులో క్రయవిక్రయాలు సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి.
7). అధికారులు ఇంటికి రాకపోతే..?
పంచాయతీ లేదా మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరూ రాలేదని భావిస్తే.. పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపాలిటీ ఆఫీస్‌కు వెళ్లి విషయాన్ని వివరించాలి. సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తారు.
8). కుటుంబసభ్యుల వివరాలు
చెబితే చాలా? వారికి
సంబంధించిన డాక్యుమెంట్లు
ఏమైనా ఇవ్వాలా?
పదేండ్ల వయస్సు పైబడిన కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయించడానికి ఆధార్‌నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని అధికారులు యాప్‌లో పొందుపరుస్తారు. పదేండ్లలోపు వారికి మినహాయింపు ఉంటుంది. యాజమాని కోరితే పిల్లల వివరాలు సైతం నమోదుచేస్తారు.
9). ఇంటితోపాటు ఇంటిముందు,
వెనకాల ఉన్న స్థలాన్ని
కూడా ఆన్‌లైన్ చేస్తారా?
పెరడు ఒకదగ్గర ఇల్లు
మరో దగ్గర ఉంటే ఏంచేయాలి?
_*ఇంటితోపాటు ఇంటిముందు, వెనకాల ఉన్న స్థలాలను సైతం ఆన్‌లైన్ చేస్తారు. పంచాయతీ రికార్డుల్లో గతంలోనే ఈ వివరాలు ఉంటాయి. మొత్తం ఖాళీస్థలం (ప్లాట్ ఏరియా), అందులో ఉన్న ఇంటి స్థలం (ప్లింత్/ బిల్డప్ ఏరియా) అని నమోదు చేస్తారు. గత రికార్డుల్లో ప్లాట్ ఏరియా (పెరడు)కు సంబంధించిన వివరాలు లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని ఇంటిస్థలంతోపాటు ఆ స్థలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కిస్తారు. పెరడు ఒకదగ్గర ఇల్లు మరో దగ్గర ఉన్నా సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం. ఒకవేళ ఆ పెరడులో పశువుల కొట్టం, రేకుల షెడ్డు లేదా ఏదైనా నిర్మాణం ఉంటే దానికి ఇంటి నంబర్ కేటాయించి.. ఆన్‌లైన్ చేస్తారు.*_
10). ఖాళీ స్థలంతోపాటు ఇంటి
వివరాలు తీసుకున్నప్పడు
రెండింటిమీద పన్ను వసూలు
చేస్తారా?
పంచాయతీల్లో గతంనుంచీ ఈ రెండింటికీ కలిపి ఒక్కటే పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వసూలు చేసేదేమీ ఉండదు. ఒకవేళ రికార్డుల్లో లేని భూమిని సెల్ఫ్ డిక్లరేషన్‌తో ఇంటి స్థలంలో కలిపి ఆన్‌లైన్ చేసుకున్నట్లయితే అదనంగా కలిసిన భూమికి అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రెండింటినీ కలిపితే పన్ను పెరిగిపోతుందనేది ఆపోహ మాత్రమే.
11)ఎలాంటి డాక్యుమెంట్లులేని
ఇండ్లను ఆన్‌లైన్ ఎలా
చేస్తారు? కొత్తగా నిర్మించుకున్న వారి పరిస్థితి ఏమిటి?
వాస్తవంగా ప్రతి ఇల్లూ రికార్డుల్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తారు. రెండుమూడ్రోజుల్లో ఇంటి నంబర్ కేటాయించి యాజమాని వివరాలను ఈ- పంచాయతీ/ సీడీఎంఏ వెబ్‌సైట్‌లోకి ఎక్కించి తరువాత యాప్‌లో ఆన్‌లైన్ చేస్తారు. కొత్తగా నిర్మించిన, నిర్మాణంలోఉన్న ఇండ్లకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
12). ప్రభుత్వ భూమిలో ఇండ్లు
కట్టుకొని ఉంటున్నవారి
వివరాలను సేకరిస్తారా?
సర్కారు జాగాను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నట్టు తేలితే ప్రభుత్వభూమిగా నమోదు చేస్తారు. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇప్పటికే 58, 59 జీవో కింద కొన్ని ఇండ్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. మరోసారి రెగ్యులరైజేషన్‌కు అవకాశమిచ్చేందుకు సిద్ధమవుతున్నది. అప్పటికీ వినియోగించుకోకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
13). ఇల్లు కట్టుకొని రికార్డుల్లో
నమోదు చేసుకోకుండా
ఉంటే పరిస్థితేమిటి?
గుర్తింపులేని ఇండ్లు/ భవనాలు ఏవైనా ఉంటే వెంటనే మున్సిపల్/ పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తారు. రెండుమూడ్రోజుల్లోగా పీటీఐఎన్ లేదా అసెస్‌మెంట్ నంబర్ ఇస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్ చేస్తారు.
14). గతంలో నివాసానికి వాడుకున్న
ఇంటిని ఇప్పుడు కమర్షియల్‌గా
మారిస్తే పన్ను స్లాబ్
మారుతుందా?
ఇల్లు లేదా ప్లాటు ఏ ప్రాంతంలో ఉంది? ఎంత విస్తీర్ణంలో ఉన్నది? బిల్డప్ ఏరియా ఎంత? దానినెలా ఉపయోగిస్తున్నారు? వంటి అంశాలపై ఆ పన్ను ఆధారపడి ఉంటుంది. ప్రధాన కూడళ్లు, రద్దీప్రాంతాల్లో ఉండే భవనాలలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నవారు ఎందరో ఉన్నారు. మరికొందరు గతంలో బిల్డప్ ఏరియాను తక్కువగా చూపించుకున్నారు. ఇలాంటివన్నీ తాజా సర్వేతో బయటపడుతాయి. వారికి పన్ను పెరిగే అవకాశం ఉంటుంది.
15). అనుమతి లేకుండా
పైఅంతస్తులు కట్టుకున్నవారిపై
చర్యలు ఉంటాయా?
ఇంటి అనుమతులు తీసుకునే సమయంలో ఇచ్చిన ప్లాన్‌కు మించి కట్టినట్టు తేలితే.. జరిమానాగా 50శాతం అదనంగా పన్ను విధిస్తారు. అనుమతుల్లేకుండా పైఅంతస్తులు కట్టినట్టు తేలితే జరిమానాగా పన్నును రెట్టింపు చేస్తారు. జీవితాంతం ఈ జరిమానా కట్టాల్సి ఉంటుంది. యజమాని ఇంటి కొలతలను తప్పుగా చెప్పినా.. అసెస్‌మెంట్‌లో తేలిపోతుంది.
16). మా ఇంటికి పన్ను మారుతుందా?
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వద్దే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువను నమోదు చేయాలని ధరణి పోర్టల్‌లో తాజాగా ఆదేశించింది. సర్వేనంబర్, ఇంటి నంబర్ల వారీగా మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. మొదట రోడ్లు, ఇతర వాణిజ్య స్థలాలకు దగ్గరగా ఉండే ఆస్తులను హయ్యర్ వాల్యూగా.. మిగతావాటిని లోయర్ వాల్యూగా నిర్ధారిస్తారు. వీటికి తాజాగా ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త ధరల ఆధారంగా మార్కెట్ వాల్యూ మారుతుంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు, పన్నులపై వీటి ప్రభావం ఉంటుంది.
17). ఇల్లు కొనుగోలు చేశాక కూడా
రికార్డుల్లో పాత యాజమాని
పేరు ఉంటే?
అలాంటివారిని వెంటనే మున్సిపల్/ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం మార్పిడి జరిగిన తర్వాత ఆన్‌లైన్ చేస్తారు.
18). కూలిపోయిన ఇండ్లకు
అసెస్‌మెంట్ చేస్తారా?
కూలిపోయిన ఇండ్లకు ఇప్పటికే ఇంటి నంబర్/ పీటీఐఎన్ నంబర్ ఉంటుంది. కాబట్టి ఆ ఇంటిని అసెస్‌మెంట్ చేస్తారు. నిర్మాణం సగంలో ఆగిపోయిన ఇండ్లకు ఇంటి నంబర్ మంజూరుకాదు కాబట్టి ఆన్‌లైన్ చేయరు.
19). బావుల వద్ద, వ్యవసాయ
భూమిలో ఇల్లు కట్టుకుంటే
ఎలా?
_*వ్యవసాయ భూముల్లో కట్టుకున్న ఇండ్లను ఆన్‌లైన్ చేసేప్పుడు అది పట్టాల్యాండ్‌లో ఉంది అని ధ్రువీకరించి ఆన్‌లైన్ చేస్తున్నారు.*_
20). వ్యక్తిగత వివరాలు ఇస్తే
గోప్యంగా ఉంటాయా?
భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వలక్ష్యం. రికార్డులన్నీ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయ భూముల రికార్డులు దాదాపు క్లియర్‌గా ఉన్నాయి. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా క్లియర్‌గా ఉండాలనే ఈ ప్రక్రియను చేపట్టారు. ఇంటియాజమానితోపాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం మెరూన్ పాస్‌బుక్‌లోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
21). ఇంటిని ఇద్దరు వారసులు
పంచుకుంటే దానిని ఎవరి
పేరుమీద నమోదు చేస్తారు?
ఒకరు కాస్తులో, మరొకరు
పట్టాలో ఉంటే?
ఒకే ఇంటిని వారసులు పంచుకుంటే వేర్వేరు నంబర్లు కేటాయించి.. ఎవరిది వారికే ఆన్‌లైన్ చే స్తారు. పంచుకున్నాక కూడా కాస్తులో ఒకరు పట్టాలో ఒకరు ఉంటే ఆ ఆస్తి ఎవరికి చెందిందో ఆ ఇద్దరు కలిసి ఇచ్చే డిక్లరేషన్ ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు.
22). మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో
ఇంటి వివరాలను ఎలా
సేకరిస్తున్నారు? పట్టాలు లేని
ఇండ్లను కూడా నమోదు
చేస్తారా?
మురికివాడల్లోని ఇండ్లకు పీటీఐఎన్ నంబర్ ఆధారంగా అసెస్‌మెంట్ చేస్తున్నారు. వాటి విస్తీర్ణం వివరాలు ఇప్పటికే నమోదయ్యాయి. అదనంగా కుటుంబసభ్యుల వివరాలు, నల్లా, ఇంటి కనెక్షన్ వంటివి మాత్రమే సేకరిస్తారు.
23). పీటీఐఎన్ నంబర్‌లేని
ఇండ్లను ఎలా నమోదు_
చేస్తారు? కొత్తగా పీటీఐఎన్
నంబర్ ఇస్తారా?
పీటీఐఎన్ నంబర్‌లేని ఆస్తుల వివరాలు సైతం నమోదుచేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, వివరాలతోవారు పీటీఐఎన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ వచ్చాక కుటుంబసభ్యుల వివరాలు అప్‌లోడ్ చేయవచ్చు.
24). బినామీ ఆస్తులు
బయటపడుతాయా?
నిబంధనల ప్రకారం ఇల్లు ఎవరి పేరుమీద ఉన్నదో వారికే శాశ్వత హక్కులు కలుగుతాయి. తాజా సర్వేతో తర్వాతితరం వివరాలు కూడా నమోదవుతాయి. ఒకవేళ ఎవరికైనా బినామీ ఆస్తులు ఉంటే.. వాటిని తరతరాలుగా వేరేవ్యక్తులకు అప్పగించరు. కాబట్టి బినామీలకు ఆస్కారం ఉండదు. ఆస్తిని అమ్మితే వెంటనే లావాదేవీల వివరాలు ప్రభుత్వానికి తెలిసిపోతాయి. అనుమానం వస్తే విచారణ జరుగుతుంది.
25). నమోదు సమయంలో యాజమాని
కచ్చితంగా ఉండాలా? దూరంగా
ఉన్న, వలస వెళ్లినవారి పరిస్థితి
ఏంటి?
యాజమాని ఊర్లో లేకుంటే.. ఫోన్‌లో వివరాలు తెలిపినా ఆన్‌లైన్ చేస్తారు. వలసవెళ్లిన వారికి ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే ప్రతి ఆస్తికి సంబంధించి యజమాని ఫోన్ నంబర్లు పంచాయతీ/ మున్సిపాలిటీల వద్ద ఉన్నాయి. లేనివారి వివరాలు సేకరించి వారికి సమాచారమిస్తారు. అపార్ట్‌మెంట్లు/ గేటెడ్ కమ్యూనిటీ అయితే సమాచారమిచ్చే బాధ్యతను అసోసియేషన్ కూడా పంచుకుంటుంది. ఒకవేళ యాజమానికి సమాచారమే లేదు. ఆన్‌లైన్ చేసుకునేందుకు రాలేదు. అంటే వారికి మరో అవకాశం ఉంటుందా అనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు.
26). కులం వివరాలు ఎందుకంటే?
గ్రామంలో ప్రజల సాంఘిక స్థితిగతులు ప్రభుత్వానికి తెలుస్తాయి. కులాలవారీ జనాభా, వారి ఆర్థికస్థితిగతులపై మరింత స్పష్టత వస్తుంది. తద్వారా కరెంటు, నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్నులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు నేరుగా అర్హులకు అందే అవకాశం ఉంటుంది.
27).జీహెచ్‌ఎంసీ పరిధిలో
ఆన్‌లైన్ ఎలా చేస్తున్నారు?
ఏమేం డాక్యుమెంట్లు అవసరం?
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే దాదాపు అన్నిఇండ్ల వివరాలు సీడీఎంఏ పోర్టల్‌లో నమోదై ఉన్నాయి. వారందరికీ పీటీఐఎన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఇచ్చారు. ఇతర వివరాలు నమోదు చేయాలనుకునేవారికోసం యజమాని ఫోన్‌నంబర్‌కు ప్రత్యేకంగా వెబ్ లింక్‌ను పంపుతున్నారు. దాని ఆధారంగా మీసేవ పోర్టల్‌లో వివరాలను సరిచూసుకోవచ్చు. ఆ ఇంటికి సంబంధించిన అదనపు వివరాలు, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయొచ్చు. చివరగా ఇంటి యజమాని ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సొంతంగా వివరాలు అప్‌లోడ్ చేసుకునేందుకు https://ts.meeseva.telangana.gov.in/>TSPortaleef/UserInterface/Citizen/ RevenueServices/SMSSendOTP.aspx లింక్‌ను సందర్శించవచ్చు.
28). కరెంటు, నల్లా కనెక్షన్
వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు?
ఇంటికి కనీస అవసరాలైన కరెంటు, నల్లా కనెక్షన్లు లేవని తేలితే వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక గ్రామంలో/మున్సిపాలిటీలో కరెంటు, నీటి వినియోగంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లుచేసేందుకు వీలు కలుగుతుంది.
29). ఆన్‌లైన్ చేయకపోతే
ఏమవుతుంది?
_*ఆన్‌లైన్ చేయకపోతే ఆ ఆస్తి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కావు. అంటే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. భవిష్యత్తులో మార్పిడులు, రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.*_
30). అన్ని వివరాలను ధరణిలో
అప్‌లోడ్ చేస్తారా?
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు కానున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్టల్‌కు అనుసంధానమవుతాయి. తద్వారా భవిష్యత్‌లో క్రయవిక్రయాలు సులభంగా జరుగుతాయి.
31). ఆన్‌లైన్‌లో ఆస్తి నమోదుకు
కావాల్సిన వివరాలు
—————————————-
★ యాజమాని పేరు
★ తండ్రి/భర్త పేరు
★ వయసు
★ జెండర్ (లింగం)
★ ఫోన్ నంబరు
★ పట్టాదారు పాసుబుక్ ఉందా
లేదా
★ పాస్‌బుక్ లేని పక్షంలో ఇతర
గుర్తింపు కార్డులు
★ ఆధార్‌నంబరు
★ యాజమాని ఫొటో
★ ఆస్తికి జాయింట్ ఓనర్లు ఉన్నారా
★ జాయింట్ ఓనర్ పేరు /
ఆధార్ నంబరు/ మొబైల్ నంబరు
★ ఆస్తికి సంబంధించిన వివరాలు
★ టీపీఐఎన్
★ ఇంటి నంబరు
★ ప్రాంతం
★ ఏ రకమైన ఆస్తి, ఎలా
సంక్రమించింది..(వారసత్వం/
కొనుగోలు/ దానం/ పంపకం)
★ ప్లాట్ మొత్తం ఎన్ని స్వేర్
యార్డులు
★ అందులో నిర్మాణంఉన్న స్వేర్
యార్డులు
★ అన్ డివైడెడ్ ఏరియా ఎంత
★ నిర్మాణం దేనికి వాడుతున్నారు
(ఇండిపెండెంట్ హౌజ్/
అపార్ట్‌మెంట్/ కమర్షియల్
భవనం)
★ భూమి ఏ రకం.. ప్రైవేటు
భూమి/ ప్రభుత్వ భూమి/
ఆబాదీ (గ్రామ కంఠం) /అసైన్డ్
★ సర్వే నంబరు
★ రెవెన్యూ విలేజ్
★ విద్యుత్ కనెక్షన్ నంబరు
★ నీటి సరఫరా నంబరు
★ చిరునామా
★ కుటుంబ సభ్యుల వివరాలు,
వారి ఆధార్ నంబర్
మున్సిపాలిటీల్లో అదనంగా
సేకరించే వివరాలు
—————————————-
★ శాశ్వత చిరునామా
★ పస్తుత చిరునామా
★ నిషేధిత ఆస్తిలో ఉన్నదా? లేదా?
★ మెయిల్ ఐడీ
? ఆన్‌లైన్‌తో లాభాలివీ
—————————————-
★ వ్యవసాయేతర ఆస్తులు, కుటుంబం
వివరాలన్నీ ప్రభుత్వం వద్ద
ఉంటే పంపకాల సమయంలో
గొడవలకు ఆస్కారం ఉండదు.
కుటుంబం ఇచ్చే డిక్లరేషన్‌తో
పంపకాలు సులువుగా
జరుగుతాయి. తద్వారా
ఆ ఆస్తికి ప్రభుత్వం రక్షణగా
ఉంటుంది.
★ రికార్డులన్నీ డిజిటలైజ్ కావడంతో
తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే
అవకాశం ఉండదు.
★ కులం వివరాలు సేకరించడం
ద్వారా సామాజిక, ఆర్థిక
పరిస్థితులపై ప్రభుత్వానికి
స్పష్టత ఉంటుంది.
★ సబ్సిడీలు వంటివి ఏ ఇంటికి
చేరుతున్నాయో తెలుస్తుంది.
★ కరెంటు, నల్లా కనెక్షన్ల
వివరాలు తెలుసుకోవడం ద్వారా
కనెక్షన్లు లేనివారికి వాటినందించే
వీలుంటుంది.
★ గృహ అవసరాల కోసం
అనుమతి తీసుకొని కమర్షియల్‌గా
వాడటం, నిబంధనలకు
విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు
బయటపడుతాయి.
★ ఏ గ్రామం/పట్టణంలో అవసరాలు
ఎంత? భవిష్యత్తులో ఎంత
అవసరం పడొచ్చు వంటి
వివరాలపై ఓ అంచనా
వస్తుంది. దానికి అనుగుణంగా
వసతుల కల్పన జరుగుతుంది.