Fashion

కాసులపేరులో పూలు పండ్లు కూడా పెట్టుకోవచ్చు

కాసులపేరులో పూలు పండ్లు కూడా పెట్టుకోవచ్చు

మగువ సహజంగానే అలంకార ప్రియురాలు. ప్రకృతిలోని ప్రతి అందమైన వస్తువూ తన సొంతం కావాలని కోరుకుంటుంది. చెట్లకు పూసే పూలూ, నీటిలో దొరికే గవ్వలూ, మట్టిలో లభించే వజ్రాలూ! ఒకటేమిటి, ఏ కొంత మెరుపు కనిపించినా ఆమెలో తెలియని మైమరపు! పురాణాల్లో పారిజాతాపహరణ ఘట్టం అలా పుట్టిందే. దేవలోక పుష్పాన్ని శ్రీకృష్ణుడి దేవేరి సత్యాదేవి కోరుకోవడంతో దేవేంద్రుడితో యుద్ధమే జరిగింది. ఇక, నగలైతే ప్రాణమే ఇచ్చేస్తుంది మహిళ.
*అందానికి, హుందాతనానికి పెట్టింది పేరు.. కాసుల పేరు! కాసుల్ని పేర్చడం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. బంగారపు కాసులు మారకద్రవ్యంగా చలామణి అయిన రోజుల్లో.. వాటిని చక్కగా పేర్చి అలంకరించుకునేది ఇల్లాలు. అలా కాసుల పేరు ఓ ఆభరణమైంది. నేటికీ ఇల్లాలి నగల డబ్బాలో కాసుల పేరు ఉండటం ఓ గొప్ప. లక్ష్మీదేవి, రామపరివారం.. దేవీ దేవతల రూపాలతో కాసుల పేరులోని కాసులను రూపొందించడం సంప్రదాయం.
*లక్ష్మీ కాసుల మాల
శుభానికి, సౌభాగ్యానికి లక్ష్మీదేవి అధిదేవత. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి.. ఇలా అష్టలక్ష్మీ రూపాలతో అలరారేదే లక్ష్మీ కాసులమాల! నగధగల మధ్య ఆ యువతి సాక్షాత్తు సిరిలక్ష్మి.
*రామ పరివార కాసులమాల
ఈ మాలలో ప్రతి కాసుపైనా శ్రీరాముడి పట్టాభిషేక ఘట్టం ఉంటుంది. సీతాలక్ష్మణ సమేతుడై రామచంద్రుడు దర్శనమిస్తాడు. కొన్ని డిజైన్లలో సాధారణ కాసుల మధ్యలో రామపరివారపు లాకెట్‌ ఉంటుంది.
*రత్నాల కాసుల పేరు
పేరుకు కాసుల పేరే అయినా.. ఈ హారంలో కాసులు తక్కువే. వజ్రాలూ, పచ్చలూ కెంపులూ మొదలైన జాతిరాళ్లు విరివిగా వాడతారు.
*‘షార్ట్‌’ కాసుల హారం
మొదట్లో కాసులమాల చాలా పొడుగ్గా ఉండేది. కాలక్రమేణా అభిరుచులతో పాటు డిజైన్లు కూడా మారాయి. అలా కురచ కాసుల పేరులు వచ్చాయి. అందులోని, కాసులూ చిన్నవైపోయాయి.
*డిజైనర్‌ కాసుల పేరు
కాసుల పేరులో.. దేవతామూర్తులు కాకుండా పూలూ, పండ్లూ, లతలూ.. ఇలా నచ్చిన డిజైన్లను జోడించుకుంటున్నారు చాలామంది. సృజనకు హద్దేం ఉంటుందీ!
*వడ్డాణంలా కూడా
కొత్తగా వస్తున్న కాసుల పేరును వడ్డాణంలా, నెక్లెస్‌లా వాడుకోవచ్చు. అలా డిజైన్‌ చేస్తున్నారు. కాసుల పేరు డిజైన్‌తోనే లోలాకులు, ముక్కెరలు, గాజులు కూడా వస్తున్నాయి. ఏ సందర్భానికి అయినా కాసుల పేర్లు అతికినట్టు సరిపోతాయి.
*లేయర్డ్‌ కాసుల పేరు
ఈ డిజైన్లు మెడ భాగంలో చిన్న సైజు చైన్‌లా వచ్చి.. అక్కడి నుండి రెండుమూడు పొరలుగా హారం ఉంటుంది. ఆ హారానికి చిన్నచిన్న కాసులు ఉంటాయి. మధ్యలో పెండెంట్‌ కూడా ఉంటుంది.