కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోన్న విషయం తెలిసిందే. చివరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వైరస్ నిర్ధారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అంతేకాకుండా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ ఇప్పుడు కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్పటికే అక్కడ దాదాపు డజను మందికిపైగా వైరస్ బారనపడ్డారు. ఓరోజు మొత్తం అధ్యక్ష భవనాన్ని ఖాళీగా ఉంచారు. కానీ, మిలటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకోవడంతో అక్కడి సిబ్బందిలో మళ్లీ ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాస్కు ధరించడాన్ని అంతగా ఇష్టపడని ట్రంప్, వైట్‌హౌస్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తారో? లేదోననే భయం అక్కడి సిబ్బంది ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
*** అప్రమత్తం చేయడంలోనూ అలసత్వం..!
అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించినప్పటికీ అక్కడి సిబ్బందిలో మాత్రం నిరాశే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైరస్ బారినపడుతామేమోనన్న భయం వారిని వెంటాడుతున్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి వెల్లడవుతోన్న సమాచారం కూడా వైరుధ్యంగా ఉండటాన్ని కొందరు వేలెత్తిచూపుతున్నారు. అధ్యక్షుడికి వైరస్ సోకిన అనంతరం కూడా సిబ్బందిని అప్రమత్తం చేయడంలో అలసత్వం ప్రదర్శించినట్లు విమర్శలున్నాయి. అధ్యక్షుడికి వైరస్ నిర్ధారణ అనంతరం వారికి ఓ ప్రకటన జారీ చేశారు. ‘మీకు ఏదైనా లక్షణాలుంటే ఇంటి వద్దే ఉండండి.. కార్యాలయానికి రావద్దు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారికి లక్షణాలుంటే వెంటనే వారి ఇళ్లకు వెళ్లిపోండి, అనంతరం వారి వైద్యులను సంప్రదించండి’ అని వైట్‌హౌస్ సూచించింది. అక్కడే ప్రత్యేక వైద్య విభాగం ఉన్నప్పటికీ వారిని ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని ప్రకటించడంపై సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
*** వ్యక్తిగత భద్రతా సిబ్బంది విషయంలోనూ..
ఇక వైట్‌హౌస్‌లోనే కాకుండా ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ అధ్యక్షుడు కారులో బయటకు రావడం తెలిసిందే. ఆ సమయంలో కారులో అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా పీపీఈ కిట్లు వేసుకొనే దర్శనమిచ్చారు. ఈ సమయంలో అధ్యక్షుడి వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై ఆందోళన వ్యక్తమైంది. దీన్ని ట్రంప్ ప్రచార ప్రతినిధి హోగన్ గైడ్లీ ఖండించారు. అధ్యక్షుడు ఒక్కరే బయటకు ఎలా వెళ్లగలరు? సొంతంగా కారు నడుపుకొంటు వెళతారా? ఎల్లప్పుడూ అధ్యక్షుడి చుట్టూ ఉండటం వారి బాధ్యత అని అధ్యక్షుడిపై వస్తోన్న విమర్శలను గైడ్లీ తిప్పికొట్టారు. అయితే, భౌతిక దూరం, మాస్కులు ధరించడంపై వైట్‌హౌస్ వైఖరిపై భద్రతా సిబ్బంది అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొంచెం కోపంగానే ఉన్నప్పటికీ తాము చేసేదేమీ లేదని భద్రతా సిబ్బంది మీడియా ప్రతినిధుల వద్ద తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాంబులు, ప్రమాదకర ఆయుధాలను ఎదుర్కోవడంపై తమకు శిక్షణ ఉన్నప్పటికీ వైరస్‌ను ఎదుర్కొనే పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరిస్తే తమ ఉద్యోగాలకే ఎసరు పడుతుందనే భయంతో ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ ఏజెంట్లలో ఇప్పటివరకు ఎంతమంది వైరస్ బారినపడ్డారు, ఎందరు క్వారంటైన్‌లో ఉన్నారనే విషయాన్ని వెల్లడించేందుకు సీక్రెట్ సర్వీస్ నిరాకరించింది. గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని వెల్లడించలేకపోతున్నట్లు పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో వేల సంఖ్యలో ఏజెంట్లు విధుల్లో ఉన్నారని, ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకినా.. వారి స్థానంలో ఇతరులు విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారని మాత్రం స్పష్టంచేసింది.
*** సకల సౌకర్యాల శ్వేతసౌధం..
ట్రంప్ దంపతులు నివాసముండే శ్వేతసౌధం లోపల ఉండే సిబ్బంది వివరాలు ఎప్పుడూ గోప్యంగానే ఉంటాయి. సకల సౌకర్యాలు కలిగిన అధ్యక్ష భవనంలో దాదాపు 100మంది సిబ్బంది ఉంటారు. ముఖ్యంగా భవనాన్ని శుభ్రపరిచేవారు, వంటమనుషులు, ఫ్లోరిస్టులు, గ్రౌండ్‌కీపర్లతోపాటు అధ్యక్షునికి ఆహారాన్ని అందించే బట్లర్స్ (ఐదు నుంచి ఆరుమంది) ఆయనతో సన్నిహితంగా మెలుగుతారు. అయితే, ప్రస్తుతం ఆ సిబ్బందిని సగానికి తగ్గించడంతోపాటు వారికి మాస్కులు తప్పనిసరి చేసినట్లు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ పనిచేస్తోన్న సిబ్బంది ఆరోగ్యంపై ‘ది రెసిడెన్స్: ఇన్‌సైడ్ ద ప్రైవేట్ వరల్డ్ ఆఫ్ ది వైట్‌హౌస్’ పుస్తక రచయిత కేట్ ఆండెర్సెన్ బ్రౌసర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధ్యక్ష భవనంలో పనిచేసిన వారిని సంప్రదించినప్పుడు వారు కూడా ప్రస్తుత సిబ్బంది ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వారికి సరైన రక్షణా కిట్లు లేకపోవడంతోపాటు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా జరపడంలేదని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
ఇలా వస్తోన్న వార్తలపై అధ్యక్ష భవనం స్పందించింది. ట్రంప్ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంగణంలో పనిచేసే ప్రతిఒక్కరికి సీడీసీ నియమాల ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీరే ప్రకటించారు. అంతేకాకుండా అధ్యక్షుడిని నేరుగా కలిసే వారిసంఖ్యను భారీగా తగ్గించామని, వెళ్లాల్సి వచ్చిన వారికి రక్షణ కవచం ఉండేలా చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ పనిచేసే అందరి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మెలానియా ట్రంప్ అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రిషాం కూడా పేర్కొన్నారు.