Business

నేడు కూడా బంగారం ధర తగ్గింది-వాణిజ్యం

నేడు కూడా బంగారం ధర తగ్గింది-వాణిజ్యం

* రైలు టికెట్లను బుక్‌ చేసుకొనే సౌకర్యాన్ని అమెజాన్‌ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం అమెజాన్‌ ఇండియా, భారత్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీలు ఒప్పందం చేసుకొన్నాయి. తొలిసారి టికెట్ల బుకింగ్‌పై అమెజాన్‌ వినియోగదార్లుకు 10 శాతం క్యాష్‌ డిస్కౌంట్‌ కూడా లభించనుంది. ఈ డిస్కౌంట్‌ అత్యధికగా రూ.100 వరకు ఉంటుంది. ఇక ప్రైమ్‌ సభ్యులకు 12శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇది అత్యధికంగా రూ.120 వరకు ఉంటుంది. ఈ ఆఫర్‌ పరిమిత కాలం మాత్రమే వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. కొంతకాలం పాటు అమెజాన్‌.ఇన్‌ కూడా పేమెంట్‌ గేట్‌వే ఫీజ్‌ను రద్దు చేసింది. ఈ కొత్త సేవలతో అమెజాన్‌ పేతో విమాన, బస్సు టికెట్లతోపాటు రైలు సీట్లు కూడా బుకింగ్‌ చేసుకొనే అవకాశం లభించింది.

* సుజుకీ మోటార్‌ సైకిల్స్‌ ఇండియా మార్కెట్లోకి రెండు సరికొత్త మోడళ్లను విడుదల చేసింది. బీఎస్‌6 యాక్సెస్‌ 125, బీఎస్‌6 బుర్గ్‌మన్‌ స్ట్రీట్‌ స్కూటర్లను విడుదల చేసింది. యాక్సెస్‌ 125 స్కూటర్‌కు బ్లూటూత్‌ ఆప్షన్‌తో ధర రూ78,600, డ్రమ్‌ బ్రేక్‌ ఆప్షన్‌తో రూ.77,700గా నిర్ణయించింది. ఇక బుర్గ్‌మన్‌ స్ట్రీట్‌ ధర రూ.78,600గా పేర్కొంది. ఇవి దిల్లీ ఎక్స్‌షోరూం ధరలు. బ్లూటూత్‌ ఆప్షన్‌ ఉన్న వేరియంట్‌కు డిజిటల్‌ కన్సోల్‌ను అమర్చింది. రెండు స్కూటర్లను కొత్త రంగుల్లో మార్కెట్లోకి తెచ్చింది. సరికొత్త యాక్సెస్‌కు డిజైన్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఇచ్చింది.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రధాన షేర్లు రాణించడంతో వరుసగా ఐదోరోజూ లాభపడ్డాయి. దీంతో నిఫ్టీ 11,700 పాయింట్ల పైన ముగిసింది.

* కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 నుంచి కాపాడగలిగే సమర్థమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి.. దాని పంపిణీ సక్రమంగా జరిగితే ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలు 2021 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయన్నది ఇంకా తెలియదని తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ఉత్పత్తి, పంపిణీ పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ప్రజలు టీకాను తీసుకోవడానికి తొలుత సంకోచిస్తారని.. దాన్ని ఇప్పటి నుంచే అధిగమించాలని సూచించారు.

* మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సెప్టెంబరు త్రైమాసికంలో దాదాపు 12.6శాతం పెరిగి రూ.27.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రంగంలోని 45 సంస్థల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రూ.24.63 లక్షల కోట్లుగా నమోదయ్యింది. యాక్సిస్‌ ఎంఎఫ్‌, యూటీఐ ఎంఎఫ్‌, ఎస్‌బీఐ ఎంఎఫ్‌, కోటక్‌ ఎంఎఫ్‌లలోకి వచ్చిన పెట్టుబడులు దాదాపు 14-16 శాతం, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఎంఎఫ్‌, నిప్పాన్‌ ఎంఎఫ్‌ల సగటు నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) 11 శాతం వరకు పెరిగాయి. ఐసీఐఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌ 10.3%, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ 5.4%, ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ 12.3%, డీఎస్‌పీ ఎంఎఫ్‌ 12 చొప్పున తమ ఏయూఎంలను పెంచుకున్నాయి. జూన్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్ల ఏయూఎం 8 శాతం తగ్గగా.. ఈసారి పెరగడం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లు రాణించడంతో ఈక్విటీ ఫండ్ల విలువ పెరగడమే ఇందుకు కారణంగా పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌తో కలిపి తమ ప్రపంచ టోకు అమ్మకాలు జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 2,02,873 వాహనాలకు పరిమితం అయ్యాయని టాటా మోటార్స్‌ తెలిపింది. 2019 ఇదే సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఇవి 16 శాతం తక్కువని వివరించింది. వాణిజ్య, దేవూ శ్రేణి వాహన విభాగంలో 29 శాతం, ప్రయాణికుల వాహన విభాగంలో 9 శాతం అమ్మకాలు తగ్గాయని తెలిపింది. ఈ సమయంలో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ అమ్మకాలు 91,367గా నమోదయ్యాయని పేర్కొంది.

* ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఏషియా ఇండియాలో టాటా సన్స్‌ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆంగ్ల వార్త పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొంది. ఎయిర్‌ ఏషియా మాతృసంస్థ ఎయిర్‌ ఏషియా బెర్హడ్‌తో కలిసి నిర్వహిస్తున్న జాయింట్‌ వెంచర్‌ (జేవీ)లో వాటాలు కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం 51శాతం వాటా టాటా సన్స్‌కు, మిగిలినది ఎయిర్‌ ఏషియా బెర్హాడ్‌కు ఉన్నాయి. అప్షనల్లీ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఓసీడీ)రూపంలో నిధులను సమకూర్చనుంది. ఆ తర్వాత టాటాసన్స్‌ ఇచ్చిన రుణాన్ని వాటాల రూపంలోకి మార్చుకొంటుంది.

* బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో మేలిమి పసిడి 10 గ్రాముల ధర రూ.694 తగ్గి రూ.51,215 గా ఉంది. నిన్నటి ట్రేడింగ్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.51,909 వద్ద ముగిసింది. రూపాయి విలువ బలపడడం ధర తగ్గుమఖం పట్టడానికి కారణమైంది. దిల్లీలో కేజీ వెండి ధర రూ.126 పెరిగి రూ.63,427 వద్ద ముగిసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,892 డాలర్లు ఉండగా.. వెండి ఔన్సు ధర 23.73గా ఉంది. మరోవైపు బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి 73.33 వద్ద ముగిసింది. దేశీయ షేర్లు రాణించడం, విదేశీ పెట్టుబడులు పెరగడం కలిసొచ్చింది.