దేశంలో మనవాళ్ల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం రుజువైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై సర్వే చేసాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు నిర్దారించాయి. దేశాన్ని ఈస్ట్ , వెస్ట్ , నార్త్ , సౌత్… సెంట్రల్, నార్త్ ఈస్ట్‌గా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లు… తీసుకుంటున్న విధానాన్ని 24 గంటలను ఒక యూనిట్ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ.. తీసుకునే విధానం మాత్రం ఎక్కడ సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది.
దేశవ్యాప్తంగా తృణ,చిరుధాన్యాల వినియోగం బాగా పెరిగింది. అయితే పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని ఎక్కువగా లాగించేస్తున్నారు. ఇదే సమయంలో అధిక పోషకాలు ఉండే కూరగాయలు, ఆకు కూరలు, పాలు, పప్పుధాన్యాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలను తినాల్సిన దానికంటే తక్కువే తింటున్నారని తెలిపింది. ప్రత్యేకించి పట్టణ ప్రజలైతే తగినన్ని పోషక విలువలున్న ఆహారం తినకపోయినా చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లను తెగ లాగించేస్తున్నారని ఎన్‌ఐఎన్ అంటోంది. ఒక రోజులో తినే ఆహారంలో 11 శాతం ఇవే వుంటున్నాయంటే, ఏ స్థాయిలో చిరు తిళ్ళు తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పట్టణాల్లో దొరికే వెరైటీలు దొరకవు కాబట్టి, వాటిలోని 4 శాతం చాక్లెట్లు, బిస్కెట్స్ , చిప్స్ లాంటివి తింటున్నారని తేల్చింది. దేశంలో 97.1 శాతం మంది గ్రామీణ ప్రజలు, 68.3 శాతం మంది పట్టణ ప్రజలు తినాల్సిన పరిమాణం కంటే అధిక మొత్తంలో తృణధాన్యాలు తీసుకుంటున్నారని తేలింది. తినాల్సినవి తినకుండా .. పనికిరాని చెత్త తినటం వల్లే మధుమేహం, బీపీ లాంటి వాటి బారిన పడి త్వరగా అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారట. పట్టణాల్లో నివసించే పురుషులు మహిళల కంటే ఎక్కువగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. పోషకాహార లోపమే ఈ దుస్థితికి కారణం అని హెచ్చరించింది.పట్టణ ప్రజల్లో 18 శాతం, గ్రామీణ ప్రజల్లో కేవలం 5 శాతం మంది మాత్రమే సరైన ప్రోటీన్లు ఉన్న పప్పులు, విత్తనాలు.. మాంసాహారం వంటివి తింటున్నారు. దేశ ప్రజల్లో 66 శాతం మంది కంటే ఎక్కువ మంది, తగిన ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం లేదని ఒప్పుకుంటున్నారట. సాధారణంగా మనం తినే ఆహారంలో తృణధాన్యాలు 45 శాతానికి మించకూడదు. కానీ, పట్టణ ప్రజల ఆహారంలో 51 శాతం, గ్రామీణ ప్రజల ఆహారంలో 65 శాతం బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలు వున్నాయి. అలాగే, రోజు మనం తినే ఆహారంలో పప్పు ధాన్యాలు, విత్తనాలు, మాంసం, చేపలు 17 శాతం మాత్రమే ఉండాలి. కానీ, వాస్తవానికి ప్రజల ఆహారంలో 11 శాతం మాత్రమే పోషక విలువలు వుండే ఆహారం ఉంటుంది. పట్టణాల్లో వుండే వారి కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో వుండే ప్రజలు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు వుండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. అంటే వీళ్లకు బియ్యం, గోధుమలు మాత్రమే ప్రధాన ఆహారం కదా.. పోషకాలు వుండే వాటిని తక్కువగా తింటున్నారు. పట్టణాల్లో మధ్య వయస్కులు రోజుకు 1943 క్యాలరీలు ఆహారాన్ని తీసుకుంటున్నారు. అందులో 284 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 516 కొవ్వు పదార్దాలు, 55.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2082 క్యాలరీలు ఆహారం తీసుకుంటుంటే, అందులో 368 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 36 గ్రాముల కొవ్వు పదార్దాలు, 69 గ్రాముల ప్రోటీన్స్ ఉన్న పదార్ధాలను తింటున్నారు. శరీరానికి అవసరమైన మొత్తం శక్తిలో అధిక శాతాన్ని తృణధాన్యాల నుండే తీసుకుంటున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. ఈ విధానాన్ని అనుసరిస్తే ముందే గానే అనారోగ్యం నుండి బయట పడొచ్చు అంటున్నారు ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు.