బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్ లోన్ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్-భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్-భారత్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్ తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంపై సీబీఐ దాడులు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది.