Kids

హైదరాబాద్ బర్తడే తెలుసా?

హైదరాబాద్ బర్తడే తెలుసా?

మహ్మద్‌ కులీ కుతుబ్‌షా కలల నగరం భాగ్యనగరం. చార్మినార్‌ కట్టడంతో నగర నిర్మాణం మొదలైందని తెలుసు. అదీ 1591లో. మరి, ‘ఏ తేదీన’ అంటే మాత్రం సమాధానం దొరకడం అంత సులువు కాదు. అయితే, హైదరాబాద్‌ చరిత్రపై మక్కువతో మొదలైన ‘హైదరాబాద్‌ ట్రైల్స్‌’ నిర్వాహకులు మాత్రం మహానగరానికి అంకురార్పణ అక్టోబరులోనే జరిగిందని తేదీతో సహా వెల్లడిస్తున్నారు. అదే రోజు వ్యవస్థాపక దినోత్సవాన్నీ నిర్వహిస్తున్నారు. మరి ఆ తారీఖు తాలూకూ వివరాల్లోకి వెళితే…
** ‘‘హె అల్లా! చేపలతో సరస్సును నింపినట్టుగా, నా నగరాన్ని ప్రజలతో నెరపు’’.. అని భాగ్యనగర నిర్మాణ వేళ మహ్మద్‌ కులీ ప్రార్థించినట్లుగా చరిత్రకారులు చెబుతుంటారు. ఆ దార్శనికుడు ఏ శుభముహూర్తాన నగర నిర్మాణానికి అంకురార్పణ చేశారో గానీ, రాజు ప్రార్థన సఫలీకృతమైంది. కోటి మందిని గర్భీకరించుకున్న మహానగరంగా ఖ్యాతికెక్కింది. చదువు పూర్తిచేసిన యువత.. అప్పులపాలైన అన్నదాత.. ఇలా పొట్టచేతపట్టుకొని ఎవరొచ్చినా ప్రేమతో తన ఒడిలోకి పొదువుకునే నగరంగా వర్థిల్లుతోంది. సామాన్యులకు అనువైన నగరంగా విరాజిల్లుతోంది. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు ఆలవాలంగా నిలుస్తోంది. మూసీ, ఈసా తెహజీబ్‌గా భిన్నసంస్కృతుల సమ్మిళితంగా ప్రసిద్ధికెక్కింది. మినీ భారత్‌గా పేరు పొందింది. ఒకసారి ఈ నేలపై అడుగుపెట్టిన వారెవరైనా, భాగ్యనగరంపై మనసు పారేసుకోకుండా ఉండలేరని పలువురి అభిప్రాయం. అలాంటి మహానగరం 1591లో మహ్మద్‌ కులీ ఆలోచనల నుంచి రూపుదిద్దుకుందని చరిత్రకారులు చెబుతారు. ఇరానీ ఆర్కిటెక్ట్‌ మీర్‌ మోమిన్‌ సృజన నుంచి పురుడుపోసుకుంది.
**అక్టోబరులో…
హైదరాబాద్‌ నగరంగా ఆవిర్భవించకముందే, ఈ నేలపై నిర్మితమైన తొలి కట్టడం పురానాపూల్‌ వంతెన. అదీ 1578లో. దక్షిణ భారతదేశంలోనే తొలి వంతెన ఇదే కావడం విశేషం. అయితే, భాగ్యనగర నిర్మాణం మాత్రం చార్మినారు స్మారక చిహ్నంతో ప్రారంభమైందని తెలిసిందే. మహ్మద్‌ కులీ చేతులమీదుగా నగర నిర్మాణానికి 1591, అక్టోబర్‌ ఏడున అంకురార్పణ జరిగిందనడానికి కొన్ని చారిత్రక ఆధారాలున్నాయని హైదరాబాద్‌ ట్రైల్స్‌ నిర్వాహకుడు ఏబీ గోపాలకృష్ణ చెబుతున్నారు. అందుకు ఆనాటి ఒక ఫర్మానాలో పొందుపరిచిన విషయాలే ఆధారమని ఆయన అంటున్నారు. ‘‘చంద్రుడు సింహరాసిలోకి ప్రవేశించి, బృహస్పతి స్వస్థానంలోకి వెళ్లడంతో పాటు అన్ని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉన్న శుభముహూర్తాన నూతన నగరానికి పునాది పడింది’’ అని ఒక ఫర్మానాలో ఉన్నట్లు గోపాలకృష్ణ వివరిస్తున్నారు. ఆ ఫర్మానాలోని గ్రహస్థితి వివరాల ఆధారంగా ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు ఏడుగా లెక్కించినట్లు ఆయన చెబుతున్నారు. అలా ఐదేళ్లుగా అదే రోజున హైదరాబాద్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని తమ సంస్థ నిర్వహిస్తోన్నట్లు కృష్ణ తెలిపారు. అయితే, ఈ తేదీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చరిత్ర అధ్యయనకారులూ లేకపోలేదు.
**430 వసంతాల ఉత్సవం…
హైదరాబాద్‌ ట్రైల్స్‌ సంస్థ వసామహా ఆర్కిటెక్చర్‌ సంస్థతో కలిసి బుధవారం ఆన్‌లైన్‌ వేదికగా ‘‘నగర 429వ వ్యవస్థాపక దిన’’ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రిటీషు డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, ఇండియన్‌ టూరిజం శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శతరూప దత్త, సీఎస్‌ఐఐటీ ప్రిన్సిపల్‌ ఆచార్య నహీమా, చరిత్ర అధ్యయనకారుడు సజ్జాద్‌ షాహిద్‌, సీనియర్‌ ఆర్కిటెక్ట్‌ వసంతశోభ, కోల్‌కతా 300 వార్షిక వేడుకల నిర్వాహకురాలు డాక్టర్‌ కేదారేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చారిత్రక అధ్యయనకారులు మాట్లాడుతూ నగర వ్యవస్థాపక తేదీపై ఒక స్పష్టత అవసరమని సూచించారు. భాగ్యనగర చరిత్ర, సంస్కృతిని భావితరాలకు తెలిపేలా 430 వసంతాల వేడుకను ప్రభుత్వం, పౌరసమాజం ఘనంగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ‘‘అక్టోబర్‌ ఏడున హైదరాబాద్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాం. ఫర్మానాలోని వివరాల ప్రకారం నగర ఫౌండేషన్‌ డేగా ఆ తేదీని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖలు రాశాను. తేదీపై అభ్యంతరాలుంటే చరిత్ర అధ్యయనకారులు, ఖగోళశాస్త్రవేత్తలతో చర్చలు నిర్వహించి స్పష్టత తీసుకోవచ్చు. అయితే, వచ్చే ఏడాది నగర వ్యవస్థాపక దినోత్సవాన్ని మాత్రం ప్రభుత్వం నిర్వహించాలని కోరుతున్నాం. అదీ నగర ఖ్యాతిని నలుగురికీ తెలియజేసేందుకే. మా వంతుగా హెరిటేజ్‌ వాక్స్‌, టాక్స్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని ఏబీ గోపాలకృష్ణ చెబుతున్నారు.