* కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయంతో వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ఈ సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ అన్ని రంగాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు చేస్తున్న నేపథ్యంలోనే ‘విభిన్న ఆర్థికవ్యవస్థ’లకు సిద్ధం కావాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో మూలధనం, శ్రమ, నైపుణ్యాలతోపాటు నూతన ఆవిష్కరణలతో నూతన వ్యాపార పద్ధతులను అవలంబించాలని సూచించింది.**మధ్య ఆదాయ దేశాల్లోనే 82శాతం..కరోనా కారణంగా ఈ ఒక్క సంవత్సరమే కొత్తగా దాదాపు 8 నుంచి 11 కోట్ల మంది తీవ్ర పేదరికంలోని వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో 2021 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ నివేదించింది. ప్రపంచ మొత్తం జనాభాలో దాదాపు 1.4 శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారుకోవడానికి కరోనా వైరస్‌తోపాటు ఆర్థిక మాంద్యం కారణమవుతాయని ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ అభిప్రాయపడ్డారు. వీటిని సమర్థంగా ఎదుర్కొని బయటపడేందుకు ఆయా దేశాలు కరోనా తర్వాత ‘విభిన్న ఆర్థిక విధానాలను’ అనుసరించాలని సూచించారు. ఇప్పటికే పేదరికంతో సతమతమవుతున్న మధ్య ఆదాయ దేశాల్లో తాజా పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తంచేసింది. కటిక పేదరికం జాడలు మధ్య ఆదాయ దేశాల్లోనే 82శాతం ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.**భారత్ సమాచారం లేకపోవడం ఆటంకం..!పేదరికం విషయంలో భారత్‌కు సంబంధించిన సమాచారం లేకపోవడం కూడా తీవ్ర ఆటంకంగా మారిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అత్యంత పేదలు ఎక్కువగా ఉండే భారత్‌లో ఈ సమాచారం లేకపోవడం వల్ల ప్రస్తుతం ప్రపంచ పేదరికాన్ని అంచనా వేయలేకపోతున్నామని స్పష్టంచేసింది. అయితే పేదలు ఎక్కువగా నివసించే ముంబయిలోని ధారావిలో కరోనా వైరస్ విజృంభణకు స్థానిక అధికారులు తీసుకున్న చర్యలను అభినందించింది. భారీ సంఖ్యలో వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని పేర్కొంది. పట్టుదల, ప్రజల భాగస్వామ్యంతోనే ధారావి ఈ విజయం సాధించిందని ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది.
* ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 66,944 నమూనాలను పరీక్షించగా 5,292 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7,39,719కి చేరింది. 24 గంటల వ్యవధిలో 42 మంది కొవిడ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో 6 మంది.. చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, అనంతపురం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున.. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి మరణించగా.. విజయనగరం జిల్లాలో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,128కి చేరింది. ఒక్కరోజులో 6,102 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 63,49,953 నమూనాలను పరీక్షించారు.
* కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ యువతి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్సై అనంతరాములు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన మంజుల కుమార్తె శ్రీవర్షిణి(23) బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం శ్రీవర్షిణి కుటుంబసభ్యులతో కలిసి గుర్రంగూడలోని గో కార్టింగ్ వద్దకు వెళ్లారు. గో కార్టింగ్ చేస్తుండగా శ్రీవర్షిణి తలకున్న హెల్మెట్ కిందపడిపోవడంతో ఆమె తల వెంట్రుకులు వాహనం చైన్‌లో ఇరుక్కుపోయి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో శ్రీవర్షిణి తలకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, సీటుబెల్టు, హెల్మెట్ వంటి భద్రతా ఉపకరణాలు సరిగా లేకపోడం వల్లే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని గో కార్టింగ్ యాజమాన్యం చెబుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* కరోనా వైరస్ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైరస్‌కు కారణమైన చైనా తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి కారణమైన చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆసుపత్రి నుంచి అధికారిక నివాసానికి చేరి 50గంటలు గడువక ముందే చైనా తీరుపై ట్రంప్ ఈ విధంగా స్పందించారు. ఇలాంటి పరిస్థితి రావడానికి దేశప్రజల తప్పు ఏమీ లేదని..పూర్తిగా ఇది చైనా తప్పిదమేనన్నారు. ‘అమెరికాతోపాటు ప్రపంచం మొత్తం ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణమైన చైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఇది కచ్చితంగా చైనా చేసిన తప్పు, గుర్తుపెట్టుకోండి..’అని ట్రంప్ స్పష్టంచేశారు. అయితే, చైనాపై ఎలాంటి చర్యలుంటాయని మాత్రం వెల్లడించలేదు. ఈ సమయంలోనే కరోనా మూలాలపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ నివేదిక కూడా చైనా తీరును మరోసారి తూర్పారపట్టింది.
* మహారాష్ట్రలో టీఆర్‌పీ రేటింగ్ కుంభకోణాన్ని ముంబయి పోలీసులు బయటపెట్టారు. టీఆర్‌పీల విషయంలో కొన్ని ఛానెళ్లు మోసాలు చేస్తున్నాయని వెల్లడించారు. కొందరికి డబ్బులు ఇచ్చి వాళ్ల ఛానెళ్లు చూసేలా చేస్తున్నాయని ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామనీ.. వీరిలో ఒకరు రేటింగ్‌లను సమీక్షించేందుకే ఏర్పాటు చేసే పీపుల్ మీటర్ల ఏజెన్సీకి చెందిన మాజీ ఉద్యోగిగా గుర్తించినట్టు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఓ ప్రముఖ ఛానల్ సహా మూడు ఛానెళ్లు ఈ టీఆర్‌పీ మోసాలకు పాల్పడుతున్నాయన్న సీపీ.. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
* కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. గాలి కాలుష్యం వల్ల దీని ముప్పు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తాజాగా మరో పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా రోగుల్లో తీవ్రతను మరింతగా పెంచుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు అమెరికాలోని దాదాపు 3,122 ప్రాంతాల్లో గాలిలో ఉండే పార్టికల్ మాటర్(పీఎం2.5), నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ స్థాయిలను సమీక్షించారు. అనంతరం, పట్టణాల్లో ఉండే కాలుష్యం కరోనా తీవ్రతను మరింత పెంచుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. తాజాగా ఈ పరిశోధన నివేదిక ది ఇన్నోవేషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
* తెలంగాణ ఏర్పాటైన తర్వాత వైద్యారోగ్య శాఖలో అనేక సంస్కరణలు అమలు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వైద్య శాఖలో కీలక అంశాలపై మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి చర్చించారు. అనంతర ఈటల మీడియాతో మాట్లాడారు. వైద్యం విషయంలో కేరళ, ఇతర రాష్ట్రాలతో తెలంగాణ పోటీపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ వచ్చే నాటికి మాతాశిశు మరణాల రేటు 92 ఉంటే, ప్రస్తుతం 63కు తగ్గిందన్నారు. బాలింతల మరణాల రేటు దేశంతో పోలిస్తే రాష్ట్రంలోనే అతి తక్కువగా నమోదవుతోందని వివరించారు. అదే విధంగా శిశు మరణాలు 26కి తగ్గినట్టు తెలిపారు. మూత్ర పిండాలు, గుండె మార్పిడి చికిత్సలు ప్రస్తుతం ప్రధాన ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తున్నారని.. దీనిని ప్రభుత్వ వైద్య కళాశాలలకు సైతం విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకంలో అవసరం లేని సేవలు తొలగించి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి మరింత పటిష్టం చేయనున్నట్లు ఈటల వివరించారు.
* ‘దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా వచ్చింది అనుకుంటున్నా. వైరస్ రావడం వల్లే ప్రజలకు ఉచితంగా అందించాలనుకున్న చికిత్స గురించి ముందుగా నేనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నా’ అని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొవిడ్ సోకడంతో సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ట్రంప్.. రెండు రోజుల క్రితం శ్వేతసౌధానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. నేడు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
*ఏపీ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీలు నందిగం సురేష్, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వీరు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించాయని, కోర్టులపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. వీరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు.. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై రిజిస్ట్రార్ కేసు దాఖలు చేసినా పదవిలో ఉన్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. వాళ్లను రక్షించడానికి కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.