* మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. తాడిపత్రి పోలీసులను హేళనగా మాట్లాడుతూ నోరు పారేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… ముచ్చుకోటలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ మైనింగ్‌పై అధికారులు వివరాలు సేకరించారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. అక్కడకు వచ్చిన పోలీసులను హేళన చేస్తూ మాట్లాడారు. సీఐ తేజోమూర్తిని పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి బెదిరించారు. మీ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘మా అనుచరులు రాక్షసులు. టీడీపీ అధికారంలోకి వస్తే రెచ్చిపోతారు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉంటారు. పోలీసులు మీ భవిష్యత్ పాడు చేసుకోవద్దు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా విధుల్లో ఉన్న సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
* చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో! ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించుకోవడానికి ప్రపంచ ప్రజలంతా ముఖాన మాస్కులు ధరించి తిరుగుతుంటే నెదర్లాండ్స్ ప్రజల్లో ఎక్కువ మంది ఎలాంటి మాస్కులు ధరించకుండానే సాధారణ రోజుల్లాగే తిరిగారు. ఫలితంగా అతి తక్కువగా ఉన్న కరోనా కేసులు అతి ఎక్కువగా పెరిగిపోయాయి. వైరస్‌కు హాట్‌బెడ్‌గా మారిపోవడంతో హాలండ్ (నెదర్లాండ్స్) కరోనా బారిన పడి కొట్టుమిట్టాడుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా చేరింది.
* నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట, టోలిచౌకి, ఎస్సార్ నగర్, ముషీరాబాద్,గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, కోఠి,పురానాపూల్, రాజేంద్ర నగర్,అత్తాపూర్, నార్సింగి, మణికొండ, అంబర్‌పేట, నల్లకుంట, నాచారం, మల్కాజ్‌గిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం దంచికొడుతోంది. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
* జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ పై హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ పట్టణంలో ఉన్న చెరువుల్లో చేపడుతున్న అక్రమాల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు కలెక్టర్‌ను ప్రశ్నించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశింది. కంచరోలి, ఇబ్రహీం ట్యాంక్ చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణలను ఎందుకు అడ్డుకోవడం లేదో తెలపాలని కోర్టు కోరింది. కోర్టు చెప్పేది నాలుగవ తరగతి ఉద్యోగికి కూడా అర్థం అవుతుంది కానీ నిర్మల్ జిల్లా కలెక్టరుకు అర్థం కావడంలేదని హైకోర్టు న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే సోమవారం అనగా అక్టోబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తులు సోమవారంకు వాయిదా వేశారు.
* ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈసారి వంద శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 824మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24మంది పీపీఈ కిట్లతో వచ్చి మరీ ఓటు వేశారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ఫలితాలు ఈ నెల 12న ప్రకటించనున్నారు.
* తెలంగాణలో పెద్ద ఎత్తున చేప పిల్లలను ఇప్పుడు పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ రీజనల్ సబ్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మంచి నీటి చేపలు, రోయ్యల ఎగుమతిపై దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్ నగరంలో చేపలకు, సముద్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో 150 డివిజన్లలో లైవ్ ఫీష్ ఔట్లేట్లు పెట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు లాభాం చేకూరే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి బాగా వస్తుందని, మార్కెట్లు బాగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 1:15 రేషియోలో చేపలకు లాభం ఉంటుందని, రాబోయో రోజుల్లో ప్రభుత్వమే మార్కెటింగ్‌కు సహకారం అందిస్తుందని చెప్పారు.
* విజయవాడలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపిలేని జడివానతో విజయవాడలోని ప్రధాన కూడళ్లన్ని జలమయమయ్యాయి. వన్ టౌన్ రోడ్ ,బందర్ రోడ్ ,ఎంజే నాయుడు హాస్పిటల్ రోడ్ ,పాలీక్లినిక్ రోడ్ లతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జడివాడతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రహదారులన్ని సెలయేళ్ళను తలపించాయి. భారీ వర్షంతో వాహనచోదకులు ,పాదచారులు తీవ్ర అవస్థలు పడ్డారు. విజయవాడ అండర్ బ్రిడ్జీల వద్ద మొకాలు లోతుకు వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు.’ న్యాయవ్యవస్థపై యుద్ధమా? ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది? అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. కావాలంటే తీర్పులపై అప్పీలుకు వెళ్లండని జడ్జిలు వ్యాఖ్యానించినట్టుగా కూడా పేర్కొన్నాయి. కాకపోతే ఈ వ్యాఖ్యలు వారిచ్చే తీర్పుల్లో ఉంటే అప్పీలుకు వెళ్లి అవి చట్టబద్ధమా? కాదో తేల్చమని పైకోర్టును కోరడానికి అవకాశం ఉంటుంది.
* సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకుంటే అద్భుతాలనే సృష్టిస్తాయి. కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడుస్తాయి. వారికి ఒక జీవితాన్నిస్తాయి. దిల్లీలో మామూలు సమయాల్లో ఎవరికి కనిపించని ఓ చిన్న హోటల్ ‘బాబా కీ దాబా’నే అందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు దాని గురించి ఒక్కరాత్రిలో ప్రపంచానికి తెలిసింది. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా తమ సేవలను ఆ హోటల్‌కు అందిస్తామని తెలిపింది. ఇప్పుడు ఆ వృద్ధ యజమానుల కన్నీళ్లు..ఆనంద బాష్పాలుగా మారిపోయాయి.
* కరోనా వైరస్ సృష్టించిన విలయానికి ప్రపంచదేశాలు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. కానీ, వైరస్‌కు మూలకారణమైన చైనాలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా జరిగిన ‘గోల్డెన్ వీక్’ హాలిడే ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది. ఎనిమిది రోజులపాటు సాగిన ‘గోల్డెన్ వీక్’ హాలీడేలో దాదాపు 64కోట్ల మంది చైనీయులు స్వదేశీ పర్యటన చేశారు. దీంతో చైనా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చినట్లు చైనా పర్యాటకశాఖ ప్రకటించింది.
* ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలు కాబోతోందని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. ఆయన చాలా రోజుల తర్వాత తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. నటుడు శ్రీకాంత్ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘పెళ్లి సందడి’కి సీక్వెల్ తీయబోతున్నట్లు చెప్పారు. 1996లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆర్కా మీడియా నిర్మాణంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు దర్శకేంద్రుడు చెప్పారు. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. శివశక్తి దత్త, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామంటూ రాఘవేంద్రరావు ప్రత్యేక వీడియోను ట్విటర్ ద్వారా ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.
* పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాక్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి అతడు ఈ గూఢచర్యం కొనసాగిస్తున్నాడని అధికారులు తెలిపారు. పాక్ నుంచి అతడికి భారీగా నగదు అందుతోందని వెల్లడించారు. కుల్జీత్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, పలు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్‌ఫోన్లలో సాంబ జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు ఉన్నట్లు కనుగొన్నారు. సాంబ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ శర్మ మాట్లాడుతూ.. దేశద్రోహం కేసులో కుల్జీత్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పాక్‌తో అతడి గూఢచర్యం ఎలా మొదలైంది, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం చేరవేశాడు అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
* తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సవరణల ముసాయిదా బిల్లులను కేబినెట్ ఆమోదించే అవకాశముంది. వర్షాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత విధానంలో పంటలసాగుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, 14న ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. చట్ట సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించి ఆమోదించే అవకాశముంది.
* నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనుంది. ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. ఆ ఎన్నికల కోసం 40 మందితో కూడిన ముఖ్య ప్రచారకర్తల జాబితానూ ఇప్పటికే రూపొందించింది. ఆ పార్టీ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. బిహార్ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు శరద్ పవారే ఎన్సీపీ ప్రచారంలో కీలకంగా ఉండనున్నారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్ మాలిక్, ఎంపీలు ప్రపుల్ పటేల్, ఫజీయా ఖాన్ తదితరులు కూడా ముఖ్య ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ అక్టోబరు 28న, రెండోదశ నవంబరు 3న, ఇక చివరిదైన మూడోదశ నవంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
* కృత్రిమ మేధ (ఏఐ)దే భవిష్యత్ అని, ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే అభిప్రాయం సరికాదని, పాత ఉద్యోగాలు పోయి కొత్తవి వచ్చి చేరతాయని చెప్పారు. ఏఐ వల్ల రాబోయే రోజుల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధమవ్వాలని సూచించారు. ‘ఈనాడు-హైసియా’ ఆధ్వర్యంలో ‘ఏఐ- విద్య, ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, హ్యూసిస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జీఆర్ రెడ్డి మాట్లాడగా.. ఐఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
* తన హద్దులు మర్చిపోయి ఉపదేశాలు ఇవ్వబోయిన చైనాకు భారత విదేశాంగశాఖ గట్టి షాక్ ఇచ్చింది. ‘ఇదేమీ చైనా కాదు.. భారత్ ఇక్కడ మీడియా స్వేచ్ఛగా రిపోర్టింగ్ చేస్తుంది’ అని వెనకేసుకొచ్చింది. అప్పటికే తైవాన్ కూడా స్పందించి డ్రాగన్ తీరుపై దుమ్మెత్తి పోసింది. అసలే లద్దాఖ్ పరిణామాలతో మంచి కాకమీదున్న భారత్‌పై ఏదో పెత్తనం చేయాలనుకొని డ్రాగన్ పరువు పోగొట్టుకుంది.ఈ నెల 7వ తేదీన చైనా ఎంబసీ నుంచి మీడియాకు ఓ లేఖ విడుదలైంది. రానున్న ‘తైవాన్ జాతీయ దినోత్సవం’ను ఎలా కవర్ చేయాలో మీడియాకు జాగ్రత్తలు చెప్పింది. అసలు తైవాన్ అనేదే లేదు. ఉన్నా అది చైనాలో భాగం అని పేర్కొంది.