బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాసి ఉన్న సుదీర్ఘ లేఖను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర పరిశ్రమ తనకు పేరు ప్రఖ్యాతలు, గౌరవ సంపదలు అన్నిటినీ ఇచ్చిందని చెబుతూనే ఇకపై తాను సేవా మార్గంలో నడిచేందుకు సంకల్పించానని వెల్లడించారు. “నేను ఈ రోజు నా జీవితంలో అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను. అభిమానుల ఆశీర్వాదాలతో పేరు, డబ్బు, గౌరవం ఇలా అన్నింటినీ సంపాదించుకున్నాను. కానీ కొన్ని రోజులుగా నాలో అంతర్మథనం మొదలైంది. ఓ మనిషి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టేది కేవలం డబ్బు, పేరు సంపాదించడానికి మాత్రమేనా? నిస్సహాయుల సేవలో గడపడం అవసరం కాదా? ఒకవేళ మనిషి ఏ క్షణంలోనైనా మరణిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది? చాలా కాలంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాను. నిజంగా నేను చనిపోయాక ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనుంది. దీనికి నా మతంలోనే సమాధానం లభించింది. మరణించాక మంచి జీవితం పొందడం కోసమే ఈ జీవితం. ఈ ఉన్న జీవితాన్ని నిస్సహాయులకు సేవ చేస్తూ తరించాలన్నదే ఆ దేవుడి ఆజ్ఞ.. అందుకే నేను నా సినీ ప్రపంచానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్తున్నాను. ఇక నుంచి దేవుడి ఆదేశాల ప్రకారమే సేవామార్గంలో వెళ్తాను” అని రాసుకొచ్చారు. కాగా సనాఖాన్ తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ “కత్తి”, మంచు మనోజ్ “మిస్టర్ నూకయ్య” సినిమాల్లోనూ నటించారు. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఆమె బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నారు. ఆ మధ్య కొరియోగ్రాఫర్ మెల్విన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కూడా జరిపారు. కానీ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో అతనికి బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచారు.
కత్తి ఖాన్ టాటా
Related tags :