Politics

వైకాపా దిగజారుడుతనానికి అది నిదర్శనం

వైకాపా దిగజారుడుతనానికి అది నిదర్శనం

తనను ఎంపీగా అనర్హుడిని చేయలేకే వైకాపా నేతలు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. బ్యాంకులకు రూ.23వేల కోట్లు ఎగవేశానంటూ ఓ పత్రిక రాసిన కథనంతో వారి విశ్వసనీయత మరింత దిగజారిందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారం కోసం రుణం తీసుకొని రూ.826.17 కోట్లు దారి మళ్లించారంటూ రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు దాని డైరెక్టర్లు, అధికారులపై సీబీఐ దిల్లీ విభాగం కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘బ్యాంకుల ద్వారా నాకు మంజూరైన మొత్తం రుణం రూ.4వేల కోట్లలోపే. అందులో రూ.2వేల కోట్లు నేను బ్యాంకు నుంచి ఇప్పటికీ డ్రా చేయలేదు. నాపై కేసు నమోదైన 6వ తేదీనే ప్రధాన మంత్రి మోదీని సీఎం జగన్‌ కలిశారు. అదే రోజు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ సీఎంను కలవడం అనుమానాస్పదం. వారిపై రూ.43వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నందునే నాపై రూ.23వేల కోట్లకు ఆరోపణలు చేశారని భావిస్తున్నా. తప్పుడు కథనాలు రాసిన వారిపై పరువు నష్టం దావా వేయాలని మా న్యాయవాదులు సూచిస్తున్నారు. 3-4 నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకని అనుకుంటున్నా. నా వ్యాపార లావాదేవీల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు. సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తా. నిధులు నేను తినేస్తే ప్రాజెక్టులు ఎవరు కడతారు? ఈ అంశాలను కోర్టుల దృష్టికి తీసుకెళ్తా. కేంద్ర ఆర్థికశాఖలో ఉన్న తన బ్యాచ్‌మేట్‌ ద్వారా సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ నాపై కేసు వేయించేలా చేశారు’’ అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

‘‘60 శాతం కేంద్ర నిధులు పొందుతూ జగనన్న విద్యా కానుక పేరు పెట్టడంపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. నన్ను బతిమిలాడి వైకాపాలోకి తీసుకు వచ్చిన రెండో రోజే నాకు టికెట్‌ ఇవ్వకూడదని కుట్ర పన్నారు. ప్రశాంత్ కిశోర్ జోక్యంతోనే నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. తితిదేలో యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కార్పొరేషన్ల పేరుతో బీసీల్లోనే వైషమ్యాలు సృష్టిస్తున్నారు. న్యాయవ్యవస్థపై ఒక వర్గం ప్రజాప్రతినిధులు దాడి చేయడాన్ని కోర్టు తీవ్రంగా ఖండించింది. సీఎం చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని ఆయన విమర్శించారు.