ఇటీవల సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. చేతిలో డబ్బులు లేకపోయిన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదైనా కొనొచ్చు. ఎందుకంటే ప్రతి చోట పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటితో పాటు ఎవరికి డబ్బులు పంపిచాలన్న, వినియోగదారులు బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ నుంచే చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లను ప్రోత్సహించడానికి స్క్రాచ్ కార్డులను కూడా అందిస్తున్నాయి.
అయితే వీటిని అడ్డం పెట్టుకొని కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. వారు ఎలా మోసానికి పాల్పడుతున్నారో తెలుపే ఒక వీడియోని తెలంగాణ పోలీసుశాఖ తమ ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో మీకు స్క్రాచ్ కార్డు వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్‌లోకి వస్తాయి అని చూపెడుతుంది. అలా అక్కడ క్లిక్ చేయగానే మీ అకౌంట్‌లోకి డబ్బులు రావాల్సింది పోయి మీ అకౌంట్ నుంచే డబ్బులు వారి ఖాతాలోకి జమ అవుతాయి. అందుకే ఇక నుంచి స్క్రాచ్ కార్డులు అవి ఉపయోగించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు