Food

జంక్ కాదు జింక్ తినాలి

జంక్ కాదు జింక్ తినాలి

కొవిడ్‌-19 వచ్చినప్పటి నుంచీ అందరికీ సుపరిచితమైపోయిన సప్లిమెంట్‌ జింకోవిట్‌. జింక్‌ లోపిస్తే కరోనాతో మరణించే ప్రమాదం ఎక్కువని అధ్యయనాల్లోనూ తేలడంతో వైద్యులూ విటమిన్‌-సితోపాటు జింక్‌ ట్యాబ్లెట్‌నీ వాడమంటున్నారు. తాజాగా వచ్చిన మరో పరిశీలనలోనూ ఈ విషయం స్పష్టమైంది. రోగనిరోధకశక్తికి కారణమయ్యే కణాలను జింక్‌ బలోపేతం చేస్తుంది, న్యూరోట్రాన్స్‌మిటర్‌లానూ పనిచేస్తుంది. అందుకే శరీరానికి జింక్‌ అవసరం. లెగ్యూమ్‌ జాతికి చెందిన గింజలు- అంటే, చిక్కుడు, సెనగలు, బీన్సూ; గుమ్మడి, నువ్వులు, జీడిపప్పు వంటి గింజలూ నట్సూ; పాలూ, చీజ్‌ వంటి డెయిరీ ఉత్పత్తులూ; గుడ్లూ; డార్క్‌ చాకొలెట్లూ; సీ ఫుడ్‌ వంటి వాటిల్లో జింక్‌ లభ్యమవుతుంది. సాధారణంగా మహిళలకు 8 మి.గ్రా., పురుషులకి 11 మి.గ్రా. జింక్‌ కావాలి. అంటే- రోజూ అవరసమయ్యే జింక్‌లో ఒక గుడ్డు నుంచి ఐదు శాతం, వంద గ్రా.సెనగల నుంచి 12 శాతం, కప్పు పాల నుంచి 9 శాతం, వంద గ్రా. పనీర్‌ నుంచి 28 శాతం, రెండు టేబుల్‌స్పూన్ల నట్స్‌ నుంచి 15 శాతం, మూడు టేబుల్‌స్పూన్ల పుచ్చ, గుమ్మడి, అవిసె వంటి గింజల నుంచి 31 నుంచి 43 శాతం లభిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా నత్తలు, రొయ్యలు, ఆయిస్టర్లని వంద గ్రా. తింటే రోజువారీ కన్నా ఎక్కువగా సుమారు 291 శాతం లభిస్తుందట. కాబట్టి వీటిని వారానికి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది. పుట్టగొడుగులు, పాలకూరల్లోనూ జింక్‌ శాతం ఎక్కువే. కాబట్టి ఇవన్నీ తీసుకోవాల్సిందే.