కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి తనయుడు డా.విక్రమ్ లకిరెడ్డి-ప్రియ దంపతులు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మెర్సెద్ నగరంలో గల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు మరో భారీ విరాళాన్ని అందజేశారు. Merced2020 ప్రాజెక్టులో భాగంగా ₹8804కోట్ల ఖర్చుతో ఈ విశ్వవిద్యాలయ విస్తరణ పనులు జూన్ 1న ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా UC Merced క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ సెంటరులో నిర్మించిన సెంట్రల్ హబ్‌కు విక్రమ్-ప్రియా దంపతులు భారీ విరాళాన్ని అందజేశారని, విశ్వవిద్యాలయ అభివృద్ధి పట్ల డా.లకిరెడ్డి కుటుంబానికి గల అవ్యాజమైన అభిమానికి తమ హృదపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ యూనివర్శిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సెంట్రల్ హబ్‌లో విద్యాపరమైన సభలు, సమావేశాలు, విద్యార్థుల సమ్మేళనాలు తదితర సమాజహితమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. డా.విక్రమ్ కార్డియాలజిస్టుగా, UC Merced Foundation ట్రస్టీగా ఉన్నారు. ఆయన తండ్రి డా.లకిరెడ్డి హనిమిరెడ్డి మెర్సెద్ నగరంలో ప్రప్రథమ కార్డియాలజిస్టుగానే గాక 2006నుండి ఇదే ఫౌండేషన్ ట్రస్టీగా సేవలందిస్తున్నారు. ఆయన గతంలో ఈ క్యాంపస్‌లో అతిపెద్ద ఆడిటోరియం నిర్మాణానికి ₹7.7కోట్లు(మిలియన్ డాలర్లు) విరాళంగా అందజేశారు. 2020 UC Merced ఛాన్సలర్ మెడల్‌ను హనిమిరెడ్డికి బహుకరించి సత్కరించారు.