Fashion

ముంగిట్లో దేవుళ్లు

ముంగిట్లో దేవుళ్లు

ముంగిట్లోనూ దేవుడి మంటపం ముందూ ముగ్గు వేయడం మన సంప్రదాయం. కానీ మనకు ఎన్నో పండగలూ వేడుకలూ… వాటిని ప్రతిబింబించేలా ముగ్గు వేయడం ఓ ముచ్చటైన ఆచారం… వినాయకుడికి స్వస్తిక్‌ గుర్తునీ లక్ష్మీదేవికి పద్మాన్నీ కుమారస్వామికి మయూరాన్నీ ముగ్గులో భాగంగా వేస్తుంటారు. అయితే చేయి తిరిగిన కొందరు మహిళామణులు ఆ దేవతారూపాన్నే ముగ్గుగా వేసి తమ భక్తినీ అనురక్తినీ చాటుకుంటున్నారు.
*తెలుగునాట అనేకాదు, భారతావనిలో ముగ్గులేని వాకిలి ఉంటుందా… పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా దాదాపుగా అందరూ గుమ్మం ముందు చిన్నదో పెద్దదో ముగ్గు వేస్తుంటారు. ఆ అలవాటు లేనివారు కూడా శుభకార్యాలప్పుడూ పండుగలప్పుడూ ఆ సందర్భాన్ని సూచించే రంగవల్లికను తప్పనిసరిగా వేస్తారు. అయితే, ఇప్పుడు కొందరు చెయ్యి తిరిగిన మహిళలు ఆ దేవీదేవతా రూపాల్ని అచ్చుగుద్దినట్లుగా వాకిట్లోనూ ప్రతిష్ఠించేస్తూ తమలోని కళను ప్రదర్శిస్తున్నారు.నిజం చెప్పాలంటే- పల్లెల నుంచి పట్టణానికి వచ్చినా సముద్రాలు దాటి విదేశాలకేగినా ముగ్గు పెట్టే సంప్రదాయాన్ని మాత్రం మనవాళ్లు మర్చిపోకపోవడం విశేషం. అందుకే ఆనాటి ముగ్గుల డిజైన్లు నేటికీ బతికి ఉన్నాయి. అంతేకాదు, వాటికి ఎప్పటికప్పుడు రంగులూ మెరుపులూ తళుకులూ అద్దుతూ మరింత అందంగా వేస్తున్నారు. ఆ ముగ్గుల్లో ఇప్పుడు దేవుడూ ఓ అందమైన డిజైన్‌గా మారిపోయాడు. అందుకే ఎన్ని గంటలు పట్టినా, ఎంత కష్టమైనా సరే, ఆ దేవీదేవతల్నీ ముగ్గులుగా వేసి ఆనందిస్తున్నారు. ఇంట్లోని పూజా మండపం ముందుగానీ వాకిట్లో గానీ వాళ్లు వేస్తున్న దేవతారూపాల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ముగ్గుపిండినీ బియ్యప్పిండినీ కలిపి వాటికి రంగులద్దుతూ దేవతా ముగ్గులు వేయడంలో తమిళనాడుకి చెందిన మంగళం శ్రీనివాసన్‌ది అందె వేసిన చెయ్యి. ‘మై మామ్స్‌ ఆర్ట్‌ గ్యాలరీ’ పేరుతో తెరిచిన ఆమె ఫేస్‌బుక్‌ ముగ్గుల పేజీలోకి చూసే అభిమానులెందరో. అలాగే ఔరంగాబాద్‌కు చెందిన అర్చనా షిండే ఈమధ్య మహలక్ష్మీ పూజా మంటపం ముందు వేసిన వేంకటేశ్వరుని రంగోలీ ట్విటర్‌లో వైరల్‌ అయింది. పైథానీ చీరల ముగ్గులు వేయడంలోనూ ఈమెకి అద్భుతమైన ప్రతిభ ఉంది. వీళ్లలానే ముగ్గు గీతలో నిష్ణాతులైన మరికొందరు మహిళలు సైతం దేవుళ్ల రూపాల్ని అచ్చుగుద్దినట్లుగా వాకిళ్లలో కొలువుదీరుస్తున్నారు. ఇంత అందమైన ముగ్గులతో నీరాజనం పట్టిన ఈ కళాకారులకి ఆ దేవీదేవతలు అడగకుండానే వరాలవాన కురిపించరూ..!