మీనాక్షీ అమ్మ అంటే అలుపెరుగని అభ్యాసం. 79 ఏళ్ళ వయసులో సైతం… చీరకట్టులోనే బరిలో పులిలా లంఘించి, కుర్రాళ్ళను మట్టి కరిపించే లాఘవం ఆమె సొంతం. ప్రాచీన యుద్ధకళ కలరిపయట్టుకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న ఆకాంక్ష, భర్త వదలి వెళ్ళిన ఆశయాన్ని కొనసాగించాలన్న తపన…ఇవి ఆమెకు ప్రపంచ ప్రఖ్యాతినే కాదు… ‘పద్మశ్రీ’ గౌరవాన్ని కూడా తెచ్చి పెట్టాయి. దేశంలోనే అత్యంత వయోధికురాలైన యుద్ధకళా గురువుగా పేరొందిన మీనాక్షీ అమ్మ జీవన పయనం ఆమె మాటల్లోనే…
*‘‘నేను కలరిపయట్టు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎక్కువకాలం కొనసాగించాలన్న ఆలోచన నాలో ఏమాత్రం లేదు. అప్పుడు నాకు ఏడేళ్ళు. నాట్యం అంటే నాకు ఇష్టం. మా నాన్నకు కూడా యుద్ధకళల్లో ప్రవేశం ఉంది. కలరిపయట్టు నేర్చుకుంటే శరీరం లాఘవంగా ఉంటుందనీ, అది నాట్యానికి ఎంతో ఉపయోగపడుతుందనీ నాన్న చెప్పారు. ఆ విద్యతో నా ప్రయాణం అలా మొదలయింది.
*మాది కేరళ రాష్ట్రంలోని కొజిక్కోడ్ జిల్లా వటకర పట్టణం. అక్కడ రాఘవన్ మాస్టర్ కలరిపయట్టులో శిక్షణ ఇచ్చేవారు. నాన్న నన్ను ఆయన దగ్గర చేర్చారు. ఆ రోజుల్లో యుద్ధ కళలను నేర్చుకొనే అమ్మాయిలు చాలా తక్కువగా ఉండేవారు. ఎవరైనా శిక్షణలో చేరినా ఏడాది లేదా రెండేళ్ళలో మానేసేవారు. ప్రధానంగా తల్లితండ్రులే తమ ఇంటి ఆడబిడ్డల్ని పంపడానికి ఇష్టపడేవారు కాదు. అదృష్టవశాత్తూ మా అమ్మా నాన్నా నన్ను ప్రోత్సహించారు. నాట్యానికి దోహదపడుతుందని చేరిన నాకు క్రమంగా ఆ కళమీద ఇష్టం పెరుగుతూ వచ్చింది. అయితే అటు నాట్యాన్నీ, ఇటు కలరిపయట్టునీ అభ్యాసం చెయ్యడం కష్టమైంది. దేన్ని కొనసాగించాలన్న ప్రశ్న నాలో తలెత్తినప్పుడు నా మనసు కలరిపయట్టు మీదే మొగ్గు చూపించింది. పదేళ్ళపాటు రాఘవన్ మాస్టర్ దగ్గరే శిక్షణ తీసుకున్నాను. నాకు పదిహేడేళ్ళ వయసున్నప్పుడు నా గురువు రాఘవన్‌తో నాకు వివాహం జరిగింది. అది పెద్దలు నిశ్చయించిన పెళ్ళే.
***దళితుడని వివక్ష చూపారు!
నా భర్త రాఘవన్ చాలా పట్టుదల ఉన్న మనిషి. బ్రిటిష్ వారి కాలంలో కలరిపయట్టు మీద నిషేధం ఉండేది. కొద్దిమంది గురువులు దాన్ని నేర్పుతూ ఉండేవారు. ప్రధానంగా నాయర్ సామాజిక వర్గం వారు గురువులుగా ఉండేవారు. దళిత వర్గానికి చెందిన నా భర్తకు నేర్పడానికి అప్పట్లో అభ్యంతరాలు ఎదురయ్యాయి. దాన్ని ఆయన ఒక సవాల్‌గా తీసుకున్నారు. కలరిపయట్టులో నిష్ణాతుడైన తరువాత ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ ఈ విద్య నేర్పడం ప్రారంభించారు. అందుకోసం ‘కడతనడన్ కలరి సంఘం’ పేరిట ఒక గురుకులాన్ని 1949లో ఏర్పాటు చేశారు. అప్పటి ఆ గురుకులం అక్కడే ఇంకా కొనసాగుతోంది.
***అంతా ఉచితంగానే…
నేను పదో తరగతి వరకూ చదువుకున్నాను. కుట్టు పనిలో శిక్షణ తీసుకున్నాను. నాకు పెళ్ళైన తరువాత ఎక్కువగా ఇంటి పనులకే పరిమితమైనా కలరిపయట్టు అభ్యాసం మాత్రం మానలేదు. అయితే మా గురుకులాన్ని నేను నిర్వహించాల్సి వస్తుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. సుమారు అరవయ్యేళ్ళు కలరి సంఘాన్ని నడిపించిన నా భర్త 2009లో మరణించారు. మాకు నలుగురు పిల్లలు. వారు కూడా కలరిపయట్టులో నిష్ణాతులే. అయితే నా కుటుంబ సభ్యులూ, శిక్షణ పొందుతున్న వారూ నన్ను ప్రధాన శిక్షకురాలుగా ఉండాలని ఒత్తిడి చేశారు. దాంతో అంగీకరించక తప్పలేదు. ఈ గురుకులం నా భర్త కల. కలరిపయట్టు కళ అంతరించిపోకుండా చూడాలన్నది ఆయన లక్ష్యం. ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ ఈ విద్య అందాలన్నది ఆయన ఆశయం. అందుకే, శిక్షణ ఉచితంగానే ఇచ్చేవారు. శిక్షణ పూర్తయ్యాక గురుదక్షిణ మాత్రమే తీసుకొనేవారు. ఆయన ఆశయాన్ని కొనసాగించడానికే ఈ బాధ్యతలు నేను తీసుకున్నాను.
**దేవుణ్ణి కోరేది అదే!
సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య శిక్షణ తరగతులు ఉంటాయి. శిక్షణ లేని రోజుల్లో ప్రతి సంవత్సరం అరవై వరకూ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాను. ఎక్కువగా చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని గురుకులం నిర్వహణ కోసం ఖర్చు చేస్తాం. అలాగే వివిధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాను. సాధారణంగా విజయం సాధించేది నేనే! నిత్యం అభ్యాసం చెయ్యడంతోనే ఇది సాధ్యమవుతుంది. నేను చాలా దృఢమైన మహిళని. ఏ సవాలునైనా ధైర్యంగా నిలిచి ఎదుర్కోగలను. నా పిల్లలు కూడా గురుకులం నిర్వహణకు తోడ్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2017లో నాకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారం నా భర్త ఆశయానికి లభించిన బహుమానం. అది నా బాధ్యతను మరింత పెంచింది. యుద్ధ కళలను ప్రభుత్వాలు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి పిల్లలకు నేర్పించాలన్నది నా ఆకాంక్ష. మరింత మంది పిల్లలకు శిక్షణను ఇచ్చే ఆరోగ్యాన్ని నాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ ఫ
****అమ్మాయిలందరూ నేర్చుకోవాలి
‘‘కలరిపయట్టు రెండువేల ఏళ్ళ క్రితం నాటి యుద్ధ విద్య. జూడో, కరాటే లాంటి వాటికి ఇదే మూలం. దీనిలో ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. మొదట కర్రలతో శిక్షణ మొదలుపెడతాం. మెల్లగా బాకులు, కత్తులతో అభ్యాసం చేయిస్తాం. ఏ ఆయుధం లేకుండా ప్రత్యర్థిని ఎదుర్కోవడం ప్రధానమైన అంశం. మహిళలకు భద్రత నానాటికీ ప్రశ్నార్థకం అవుతున్న ఈ కాలంలో అమ్మాయిలందరూ ఆత్మరక్షణ కోసం కలరిపయట్టు నేర్చుకోవాలి. ఇప్పటి వరకూ సుమారు పదివేల మంది మా దగ్గర శిక్షణ పొందారు. వారిలో నా పిల్లలూ, మనుమలూ కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం 150 నుంచి 160 మందికి శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు బాలికలే కాదు, వారి తల్లులూ, ఉద్యోగినులూ ఎక్కువగా వస్తున్నారు.
*దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు, సెలవుల్లో విదేశాల నుంచి వచ్చి కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇది నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తోంది. కలరిపయట్టు శరీర దారుఢ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది రక్తపోటు తగ్గుతుంది. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ చెబుతూ ఉంటాను. మా గురుకులంలో కొన్ని ఔషధాలూ, నూనెలూ తయారు చేస్తాం. అభ్యాసంలో గాయాలైనవారికి మా సొంత మందులతోనే చికిత్స చేస్తాం. బయటివారు కూడా మసాజ్‌ల కోసం, ఇతర చికిత్సల కోసం మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ తయారీ విధానాలన్నీ తరతరాలుగా వస్తున్నవే. వాటిని నా భర్త దగ్గరే నేర్చుకున్నాను.’’
మీనాక్షి…కత్తి డాలు పట్టిందో…
Related tags :