* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ ద్వారా నగదు బదిలీలు కాకపోవడంతో చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. యోనో యాప్ కూడా పనిచేయట్లేదు. కాగా.. కనెక్టివిటీలో లోపం కారణంగా సేవలకు అంతరాయం కలిగిందని ఎస్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
* మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 9:52 గంటల సమయంలో సెన్సెక్స్ 93 పాయింట్లు ఎగబాకి 40,687 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 11,958 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.75 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలు చవిచూసిన సూచీలు క్రమంగా కోలుకున్నాయి. మారటోరియం కాలంలో వడ్డీ చెల్లించే విషయంపై సుప్రీంకోర్టు నేడు జరపనున్న విచారణపై మదుపర్లు దృష్టి సారించారు. అమెరికా సూచీలు స్వల్పంగా లాభపడ్డా.. ఆసియా మార్కెట్లు మాత్రం మందకొడిగానే కొనసాగుతున్నాయి.
* స్వావలంబన-ప్రపంచీకరణల కలయిక ఎంతైనా అవసరమని పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతారెడ్డి వెల్లడించారు. భారతీయ పరిశ్రమ ప్రస్తుత నాయకత్వంలో వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘లీడ్స్ 2020’ నాలుగు రోజుల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘స్వావలంబన, ప్రపంచీకరణలు కలవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. అయితే స్థిరత్వం, వైవిధ్యం అనేవి భవిష్యత్తు వృద్ధికి మూల స్తంభాలుగా ఉంటాయ’ని సంగీతారెడ్డి తెలిపారు. కొవిడ్-19 తర్వాత పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘దృఢమైన, బలమైన భారత్ భవిష్యత్తును నిర్మించడానికి మేము అంతా కలిసికట్టుగా పని చేస్తామని ప్రపంచ భాగస్వాములకు భరోసా ఇవ్వాలని అనుకుంటున్నాన’ని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌పై ప్రస్తుతం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఏర్పడిందని, ఇవి ఖాతాదారుల విధేయత, వ్యాపార స్థిరత్వానికి ప్రవేశ మార్గాలని ఫిక్కీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఉదయ్ శంకర్ అభిప్రాయపడ్డారు.
* కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో స్థిరాస్తి రంగం కష్టాల్లో కూరుకుపోయిందని, నగదు కొరత ఏర్పడిన డెవలపర్లకు లభ్యత పెంచేలా ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కోరింది. 20,000 మందికి పైగా బిల్డర్లు ఉన్న ఈ సమాఖ్య వడ్డీ మాఫీ రూపంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఆశిస్తోంది. ఈఎంఐ మారటోరియం గడువును 2021 మార్చి వరకు పొడిగించాలంటోంది. స్థిరాస్తి రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే చాలా మంది డెవలపర్లు సరైన సమయానికి తమ ప్రాజెక్టులు పూర్తి చేసి, గృహ కొనుగోలుదార్లకు వాటిని అందించే పరిస్థితి ఉండదని, దీంతో ఎగవేతలు పెరిగే అవకాశం ఉందని, భారీగా ఉద్యోగ కోతలు ఏర్పడొచ్చని క్రెడాయ్ పూర్వ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ వెల్లడించారు. ఈయన దిగ్గజ స్థిరాస్తి సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్‌నకు ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ).
* వ్యాపార సంస్థలకు చెల్లింపుల సేవలను అందించే రేజర్‌పే యూనికార్న్ సంస్థల జాబితాలోకి చేరింది. 100 కోట్ల (బిలియన్) అమెరికన్ డాలర్ల విలువైన కంపెనీని యూనికార్న్‌గా పేర్కొంటారు. జీఐసీ, సిఖోయా క్యాపిటల్‌తో పాటు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారి నుంచి తాజాగా 10 కోట్ల (100 మిలియన్) డాలర్లను సమీకరించడంతో కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకుందని రేజర్‌పే సోమవారం ప్రకటించింది. గత ఆరు నెలల కాలంలో సంస్థ వ్యాపారం 300 శాతం పెరిగిందని వెల్లడించింది. సిరీస్-డి నిధుల సేకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చిందని పేర్కొంది. సింగపూర్ వెల్త్ ఫండ్ జీఐసీ, సిఖోయా ఇండియా, రిబిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, వై కాంబినేటర్, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఈ నిధులను అందించాయి. కొత్తగా సమీకరించిన నిధులను కొత్త బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం రేజర్పేఎక్స్తో పాటు, చిన్న, మధ్య తరహా సంస్థలకు పెట్టుబడులను సమకూర్చేందుకు రేజర్‌పే క్యాపిటల్‌ను ప్రారంభిస్తామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 500 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. 2025 నాటికి 5 కోట్ల వ్యాపార సంస్థలకు చెల్లింపుల సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్-19 వల్ల డిజిటల్ చెల్లింపులు పెరిగాయని సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు హర్షిల్ మాథుర్ తెలిపారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా తాము సేవలనందిస్తున్నామన్నారు.
* తమ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ అపాచీ బైక్‌లను దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా విక్రయించినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. 2005లో టీవీఎస్ అపాచీ సిరీస్ మొదలైంది. అపాచీ మోటార్‌సైకిళ్లు 160-310 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో లభ్యమవుతున్నాయి. ఈ సిరీస్‌లో ఆర్టీఆర్ 160, అపాచీ ఆర్టీఆర్ 4వీ, ఆర్టీఆర్ 180, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, ఆర్ఆర్ 310 బైకులు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
* దసరా నేపథ్యంలో దూరప్రాంతాలకు బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.లాక్‌డౌన్‌కు ముందు నడిచినట్లే దూరప్రాంతాలకు 2,028 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.దీనిలో భాగంగా దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.డిమాండ్ మేరకు రిజర్వేషన్ చేసుకునే బస్సుల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులపై చర్చలు ఇంకా పూర్తి సఫలం కాకపోవడంతో తెలంగాణకు బస్సులు నడపడం లేదు.ఇరు రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాకే తెలంగాణకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది.